Kodali Nani On Secretariat : ఆంధ్రప్రదేశ్ సచివాలయాన్ని కూడా తాకట్టు పెట్టారని వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలను మాజీ మంత్రి కొడాలి నాని తిప్పికొట్టారు. ఆస్తులు తాకట్టు పెట్టకుండా బ్యాంకులు అప్పులు ఎలా ఇస్తాయని ప్రశ్నించారు. సచివాలయాన్ని తాకట్టు పెట్టారని చంద్రబాబుకు గగ్గోలు పెడుతున్నారని.. నేడు రాష్ట్ర అప్పులు 4లక్షల కోట్లు ఉంటే దులో 2.50లక్షల కోట్లు చంద్రబాబు చేసినవేనన్నారు. ఏ ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టకుండానే.... చంద్రబాబు రెండున్నర లక్షల కోట్లు అప్పు చేశారా అని ప్రశ్నించారు. ప్రజలకు అవసరమైనప్పుడు.... ప్రభుత్వ ఆస్తులను బ్యాంకులకు తాకట్టు పెట్టడం మామూలేనని స్పష్టం చేశారు. సచివాలయం అనేది పది ఎకరాల ఆస్తి మాత్రమేనని స్పష్టం చేశారు. ప్రత్యేకించి ఏ ఆస్తులు తాకట్టు పెట్టాలో అన్న విషయం రాజ్యాంగంలో ఏమైనా రాశారా అని ప్రశ్నించారు. ప్రజల అవసరాల కోసం...ప్రభుత్వ వేసులుబాటును బట్టే ఆస్తులు తాకట్టు పెట్టడం జరుగుతుందని స్పష్టం చేశారు.
సచివాలయాన్ని తాకట్టు పెట్టడం సిగ్గు చేటన్న చంద్రబాబు
జగన్ తాకట్టు పెట్టింది కేవలం భవనాలను కాదని.. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని అని చంద్రబాబు విమర్శలు గుప్పించారు. రాష్ట్ర సచివాలయం తాకట్టు పెట్టడంపై చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఇది రాష్ట్రానికి ఎంత అవమానకరం.. ఎంత బాధాకరం.. ఎంత సిగ్గు చేటు అని అన్నారు. ప్రభుత్వ పరిపాలనా వ్యవస్థకు గుండెకాయలాంటి రాష్ట్ర సచివాలయాన్ని తాకట్టు పెట్టి అప్పు తేవడమా? అని ప్రశ్నించారు. రూ.370 కోట్లకు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కూర్చునే భవనాన్ని, ఒక రాష్ట్ర పాలనా కేంద్రాన్ని, తాకట్టు పెట్టడం అంటే ఏంటో ఈ ముఖ్యమంత్రికి తెలుసా? అని ప్రశ్నించారు. నువ్వు తాకట్టు పెట్టింది కేవలం భవనాలను కాదని.. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని అని అన్నారు. ఈ మేరకు చంద్రబాబు ఎక్స్ లో పోస్ట్ చేశారు.
తాకట్టు పెట్టలేదన్న ఏపీ ఫ్యాక్ట్ చెక్
అయితే సచివాలయాన్ని తాకట్టు పెట్టారన్న వార్తలను ఏపీ ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ ఖండించింది. రాష్ట్ర సచివాలయంలోని అయిదు భవనాలు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకు తాకట్టు పెట్టినట్లు వచ్చిన వార్త పూర్తిగా వాస్తవ విరుద్ధం. ఐసీఐసీఐ, హెడ్ డీఎఫ్‌సీ బ్యాంకుల నుండి ఏపీ సీఆర్డీఏ ఎలాంటి రుణమూ పొందలేదు. రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ నుంచి ఈ విషయమై ఏపీ సీఆర్డీఏకు ఎలాంటి ప్రతిపాదనా రాలేదని తెలిపింది. ఈ కథనం రాసిన పత్రికైప ప్రెస్ కౌన్సిల్ కు ఫిర్యాదు చేస్తామని తెలిపింది.
ఓ వైపు ఫ్యాక్ట్ చెక్ తాకట్టు పెట్టలేదని చెప్పినా.. తాకట్టు పెడితే తప్పేమిటని కొడాలి నాని వ్యాఖ్యానించడంతో.. అసలు సెక్రటేరియట్ విషయంలో ఏం జరిగిందనేది ఆసక్తికరంగా మారింది.