TDP Gollapally :   మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు  తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు.  రాజోలు టికెట్ జనసేనకు కేటాయించడంపై గొల్లపల్లి అసంతృప్తి వ్యక్తం చేశారు ఇది తనను అవమానించినట్లేనని అందుకే రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు.  తూర్పు గోదావరి జిల్లా రాజోలు టీడీపీ ఇంచార్జ్ గా గొల్లపల్లి సూర్యారావు ఉన్నారు.       కష్టకాలంలో తెలుగుదేశం పార్టీ కోసం పనిచేశానని లేఖలో గొల్లపల్లి ఆవేదన వ్యక్తం చేశారు. రాజోలులో సీటు ఇవ్వకుండా అవమానించారని తెలిపారు.        


రాజోలు స్థానాన్ని  జనసేనకు కేటాయించిన చంద్రబాబు                      


ఇటీవల టీడీపీ, జనసేన ప్రకటించిన ఉమ్మడి ఎమ్మెల్యేల అభ్యర్థుల జాబితాలో గొల్లపల్లి పేరు లేకపోవడంతో ఆయన కలత చెందారు. పొత్తులో భాగంగా రాజోలు సీటును జనసేనకు టీడీపీ కేటాయించింది. దీంతో నిరాశలో గొల్లపల్లి పార్టీకి గుడ్ బై చెప్పారు.. ఇదిలా ఉంటే గొల్ల‌ప‌ల్లి గ‌త రాత్రి ఎంపీ కేశినేని నానితో భేటి అయ్యారు.. త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్ పై ఆయ‌న చ‌ర్చించారు… ఈ సంద‌ర్భంగా నానీ అయ‌న‌ను వైసీపీలోకి రావల‌సిందిగా ఆహ్వానించారు. అన్ని  విషయాలు మాట్లాడుకోవడంతో ఆయన తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు.  


జనసేనలో తన కుమార్తెకు సీటు కోసం ప్రయత్నం - విఫలం కావడంతో వైసీపీకి జంప్       


డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు.. గొల్లపల్లి సూర్యారావు సొంత నియోజకవర్గం. 2014లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఇక్కడి నుంచి విజయం సాధించారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బొంతు రాజేశ్వరరావును ఓడించారు. 2019లో కూడా టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు గానీ.. జనసేన అభ్యర్థి రాపాక వరప్రసాద్ చేతిలో  ఓడిపోయారు.  వచ్చే ఎన్నికల్లో తన కూతురికి టికెట్ ఇప్పించే ప్రయత్నాల్లో ఉన్నారాయన. అది కూడా సాధ్యపడకపోవచ్చంటూ టీడీపీ నుంచి సంకేతాలు రావడంతో  ఆయన పార్టీ మారిపోతున్నారు.   కనీసం జనసేనలో అయిన తన కుమార్తె అభ్యర్థిగా నిలబెట్టేందుకు చేసినా ప్రయత్నాలు కూడా విఫలమవడంతో ఆయన పార్టీ మారాలని నిర్ణయం తీసుకున్నారు. 


రాజోలు సీటు ఇస్తారా ?                                                            


రాజోలులో ప్రస్తుతం జనసేన పార్టీ నుంచి గెలిచి వైసీపీలోకి వచ్చిన రాపాక వరప్రసాద్ ఇంచార్జ్ గా ఉన్నారు. గొల్లపల్లి సూర్యారావుకు ఎక్కడ టిక్కెట్ కేటాయిస్తారన్నది స్పష్టం కాలేదు. కానీ ఆయన రాజోలులోనే పోటీ చేస్తానని అడిగే అవకాశం ఉంది. అయితే  అమలాపురం లోక్‌సభ టికెట్‌ను గొల్లపల్లికి కేటాయిస్తారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నారు. కానీ చివరికి రాజోలు అసెంబ్లీనే కేటాయిస్తారని.. కావాలంటే రాపాకను పార్లమెంట్ కు పోటీ చేయమని సూచిస్తారని అంటున్నారు.