అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీపీఆర్‌వో పూడి శ్రీహరిని పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం ఉదయం తాడేపల్లిలోని ఆయన నివాసానికి చేరుకున్న పోలీసులు, అక్కడ సోదాలు నిర్వహించి ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీహరి వినియోగిస్తున్న సెల్ ఫోన్, ల్యాప్‌టాప్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన వైసీపీ మీడియా విభాగం బాధ్యతలను కూడా చూస్తున్నారు.
సోషల్ మీడియాలో ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత పోస్టింగ్‌లు పెట్టించారనే ఆరోపణలతో ఈ అరెస్ట్ జరిగినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా చంద్రబాబు చేతిలో కత్తి పెట్టినట్లు ఉన్న ఒక యానిమేషన్ వీడియోను సామాజిక మాధ్యమాల్లో సర్క్యులేట్ చేశారనే ఫిర్యాదుపై చిత్తూరులో కేసు నమోదైంది. ఈ కేసు విచారణలో భాగంగానే పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. దాంతోపాటు మరికొన్ని కేసుల్లో విచారణలో భాగంగా శ్రీహరిని ప్రశ్నించనున్నారు.
మఫ్టీలో వచ్చి బలవంతంగా ఎత్తుకెళ్లారు.. వైసీపీ ఎమ్మెల్సీ
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీపీఆర్‌ఓ పూడి శ్రీహరిని పోలీసులు అరెస్ట్ చేసిన తీరుపై ఆ పార్టీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఉదయం జగన్‌ను కలిసి ఇంటికి తిరిగి వెళ్తుండగా, మఫ్టీలో వచ్చిన పోలీసులు శ్రీహరిని మార్గమధ్యలో అడ్డగించి బలవంతంగా ఎత్తుకెళ్లారని ఆయన ఆరోపించారు. ఏ కేసులో అదుపులోకి తీసుకుంటున్నారో, ఏ స్టేషన్‌కు తరలిస్తున్నారో కనీస సమాచారం ఇవ్వకుండా దౌర్జన్యంగా వ్యవహరించారని, ఆయన ఫోన్‌ను, ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నారని మండిపడ్డారు.
శ్రీహరిని తీసుకెళ్లిన కొద్దిసేపటికే మరికొంత మంది పోలీసులు ఆయన నివాసంపై దాడి చేసి సోదాలు నిర్వహించారని అప్పిరెడ్డి తెలిపారు. ఇంట్లో ఉన్న సహాయకుడిని బెదిరించి బయటకు పంపారని, పార్టీ ప్రజాప్రతినిధులు అక్కడికి వెళ్లినా లోనికి రానివ్వకుండా అడ్డుకున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలే లక్ష్యంగా కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయని ఆయన విమర్శించారు.
సీనియర్ జర్నలిస్టు అయిన శ్రీహరిని ఇలా అక్రమంగా అరెస్టు చేయడం అత్యంత హేయమని, ఇది పూర్తిగా చట్టవిరుద్ధమని ఆయన పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వంలో పోలీసులు చట్టాన్ని ఉల్లంఘించి వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ, పోలీసుల తీరును తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం వెంటనే పూడి శ్రీహరిని బేషరతుగా విడిచిపెట్టాలని ఈ సందర్భంగా లేళ్ల అప్పిరెడ్డి డిమాండ్ చేశారు.
శ్రీహరి అరెస్టును ఖండించిన వైసీపీ
ఈ అరెస్టుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారో, ఏ పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్నారో కనీస సమాచారం ఇవ్వకుండా పోలీసులు ఓవరాక్షన్ చేస్తున్నారని వైసీపీ తన 'X' (గతంలో ట్విట్టర్) వేదికగా విమర్శించింది. రాష్ట్రంలో అక్రమ అరెస్టులు ఇంకెన్నాళ్లు కొనసాగుతాయని ప్రభుత్వాన్ని ప్రశ్నించిన పార్టీ, రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే శ్రీహరిని అరెస్ట్ చేశారని ఆరోపించింది.
మాజీ మంత్రి అంబటి ఆగ్రహం..
కుప్పం పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయిన అక్రమ కేసుల్లో వైసీపీ ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరిని చిత్తూరు 2 టౌన్ సీఐ నెట్టి కాంతయ్య దౌర్జన్యంగా తీసుకెళ్లారని మాజీ మంత్రి అంబటి రాంబాబు.. పోలీసుల తీరును ఆయన తీవ్రంగా ఖండించారు.
