Kiran Kumar Reddy : నందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్ సీజన్ 2 ఎపిసోడ్ 4 ఆహాలో స్ట్రీమింగ్ అయ్యింది.  మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, ఎంపీ సురేష్ రెడ్డితో ఎపిసోడ్ లో బాలయ్య సంచలన విషయాలు రాబట్టారు. ప్రత్యేకించి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి  వైఎస్ఆర్ హెలికాఫ్టర్ ప్రమాదం రోజు సంగతులపై మాట్లాడారు. ఆ రోజు వైఎస్ఆర్ తో కలిసి తాను కూడా స్పీకర్ హోదాలో వెళ్లాల్సి ఉందన్న కిరణ్ కుమార్ రెడ్డి...ఆ రోజు అసెంబ్లీ ముగింపు పనులు ఉండటంతో వెళ్లలేదన్నారు. బతికున్నా కనుకే సీఎం అయ్యాయని ఆ తర్వాత రాష్ట్ర విభజనను చూడాల్సి వచ్చిందని గుర్తు చేసుకున్నారు కిరణ్ కుమార్ రెడ్డి. నా తండ్రి పోయినప్పుడు ఎంత బాధపడ్డానో రాష్ట్ర విభజన జరిగినప్పుడు అంతే బాధపడ్డానని కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. జరిగిపోయిన దాని గురించి ఇప్పుడు ఆలోచించాల్సిన పనిలేదన్నారు. మూడు రాజధానుల అంశంపైనా మాట్లాడిన కిరణ్ కుమార్ రెడ్డి, అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు అన్నీ ఒక్క చోట ఉంటేనే పరిపాలనా సౌలభ్యం ఉంటుందన్నారు. 


మూడు రాజధానులపై 


అన్ స్టాపబుల్ 2 లో మూడు రాజధానులపై మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి స్పందించారు. అసెంబ్లీ జరిగేటప్పుడు అధికారులంతా అక్కడే ఉండాలన్నారు. ఎగ్జిక్యూటివ్‌ అంటే కేబినెట్‌, సెక్రటేరియట్‌కు సంబంధించిన అధికారులు అసెంబ్లీకి హాజరవ్వాలన్నారు. న్యాయపరమైన వ్యవహారాలకు సంబంధించిన వివరాలను సీఎం,  మంత్రుల దగ్గర చర్చించి, వారి సూచనతో కోర్టులో ఏం చెప్పాలో అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. అసెంబ్లీ, కోర్టు, సచివాలయం మూడూ కలిసి ఉంటేనే పాలనా సౌలభ్యం ఉంటుందని అన్నారు.  


వైఎస్ఆర్ తో ఫ్లైట్ లో వెళ్లాల్సి ఉంది? 


మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి తన పొలిటికల్ కెరీర్ గురించి మాట్లాడుతూ.. ఎమ్మెల్యేగా 15 సంవత్సరాలు చేసిన తర్వాత చీఫ్‌ విప్‌, తర్వాత స్పీకర్‌ అయ్యానన్నారు. ఆ రోజు వైఎస్ఆర్ తో సహా హెలీకాఫ్టర్ లో తాను వెళ్లాల్సి ఉందని కానీ అసెంబ్లీ ముగిసే సమయం కావడంతో వెళ్లలేదన్నారు.  బతికున్నాను కాబట్టే ఆ తర్వాత ముఖ్యమంత్రి అయ్యానని గుర్తుచేశారు. బతికుండటం వల్లే రాష్ట్ర విభజన చూడాల్సి వచ్చిందని కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. రాజశేఖర్‌రెడ్డి వెళ్లే హెలికాఫ్టర్‌లో వెళ్లాల్సి ఉండగా ఆయన తనకు ఫోన్‌ చేసి పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీకి ఎవరిని ఎంపిక చేస్తున్నావ్‌? అని అడిగారని, నాగం జనార్థన్‌రెడ్డి పేరుని ప్రతిపక్ష నాయకుడు సూచించారని చెప్పానన్నారు. అయితే శోభానాగిరెడ్డిని తీసుకోండని రాజశేఖర్‌రెడ్డి చెప్పారు. అకౌంట్స్‌ కమిటీ సహా మూడు కమిటీలను పెండింగ్ ఉంచుతానని, చర్చించిన తర్వాత వివరాలు ప్రకటిస్తానని చెప్పానని కిరణ్ కుమార్ రెడ్డి గుర్తుచేసుకున్నారు. ఆ తర్వాత రోజు కమిటీల ప్రకటన ఉండడంతో వైఎస్ఆర్ తో హెలికాఫ్టర్‌ ప్రయాణాన్ని రద్దు చేసుకున్నానన్నారు. తాను కార్యాలయంలో ఉండగా ఫోన్‌ వచ్చిందన్నారు. ముఖ్యమంత్రి ఇంకా రాలేదని సమాచారం వచ్చిందని, ఎప్పుడో బయలుదేరారు కదా అనుకొని తానే అక్కడి ఆఫీసుకు ఫోన్‌ చేసి సీఎం ఇంకా చేరలేదట ఏమైందో తెలుసుకోండని అధికారులను కోరారన్నారు. మా నాన్న చనిపోయినప్పుడు ఎంత బాధపడ్డానో రాష్ట్ర విభజన జరిగినప్పుడు కూడా అంతే బాధపడ్డానని కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. తాను పుట్టి, పెరిగింది హైదరాబాద్‌లోనే అన్నారు. ప్రస్తుతం ఉంటోంది కూడా హైదరాబాద్‌లోనే అన్నారు. రెండు రాష్ట్రాలు బాగుండాలనేదే తన కోరిక అని కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. జరిగిపోయిన దానిగురించి ఇప్పుడు విచారించాల్సిన అవసరంలేదన్నారు.