Food Supply Through Drones In Vijayawada: విజయవాడలోని (Vijayawada) వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పటికే అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. బాధితులకు సమీపంలోని కల్యాణ మండపాలు, స్కూళ్లల్లో పునరావాసం కల్పించారు. వారికి 3 పూటలా ఆహారం అందిస్తున్నారు. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ (NDRF), ఎస్డీఆర్ఎఫ్ (SDRF) బృందాలు రంగంలోకి దిగాయి. బోట్ల సాయంతో చిన్నారులు, వృద్ధులు, బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అయితే, ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో తమకు కనీసం ఆహారం అందడం లేదని కొందరు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బోట్లు సైతం వెళ్లలేని మారుమూల ప్రాంతాల్లోని బాధితులకు ఆహారం, తాగునీరు అందించడం కష్టంగా మారింది. దీనిపై దృష్టి సారించిన అధికార యంత్రాంగం వరద ప్రభావిత ప్రాంతాల్లో డ్రోన్ల సాయంతో ఆహారం సరఫరా చేసేందుకు సన్నద్ధమవుతోంది. బోట్లు, హెలికాఫ్టర్లు సైతం వెళ్లలేని ఇరుకు ప్రాంతాల్లో ఆహార సరఫరాకు ప్రత్యామ్నాయంగా డ్రోన్ల వినియోగంపై ఫోకస్ చేసింది. అందుబాటులో ఉన్న 3 డ్రోన్లతో విజయవాడ కలెక్టరేట్ వేదికగా ట్రయల్ రన్‌ను అధికారులు నిర్వహించారు.


పర్యవేక్షించిన సీఎం


సీఎం చంద్రబాబు (CM ) స్వయంగా ఈ ట్రయల్ రన్‌ను పర్యవేక్షించారు. ఓ మినీ హెలికాఫ్టర్‌లా ఉండే ఈ డ్రోన్లు ఎంత బరువు మోయగలవు.? ఏయే ప్రదేశాల వరకూ వెళ్లగలవు.?, మార్గమధ్యలో ఏమైనా అడ్డంకులు వస్తే ఎలా తప్పించుకుని రాగలవు.? వంటి అంశాలను ఈ రన్‌లో పరిశీలించారు. ట్రయల్ రన్ తర్వాత దాదాపు 8 నుంచి 10 కిలోల వరకూ ఆహారం, మెడిసిన్, తాగునీరు వంటివి తీసుకెళ్లే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. వీటిని ఏ మేరకు వినియోగించుకోవచ్చో పరిశీలించి ఫుడ్ డెలివరీ డ్రోన్లు సిద్ధం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ట్రయల్ రన్‌కు 3 ఫుడ్ డెలివరీ డ్రోన్లను వినియోగించగా.. మరో 5 డ్రోన్లు సిద్ధంగా ఉంచారు.


రంగంలోకి నేవీ హెలికాఫ్టర్లు


మరోవైపు, వరద సహాయక చర్యల కోసం ఇప్పటికే నేవీ హెలికాఫ్టర్లు రంగంలోకి దిగాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ముమ్మరంగా బాధితులకు ఆహారం, మంచినీరు సరఫరా చేస్తున్నాయి. విజయవాడ నగరంలో 78, కృష్ణా జిల్లాలో 81 పునరావాస శిబిరాలు ఏర్పాటు చేశారు. జిల్లావ్యాప్తంగా 17 చోట్ల తెగిపోయిన రోడ్ల పునరుద్ధరణకు చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.


సీఎం ఆగ్రహం


అటు, విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిశీలన అనంతరం సీఎం చంద్రబాబు మరోసారి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ క్రమంలో కొందరు అధికారుల తీరుపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. సహాయక చర్యల్లో అలసత్వం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. బాధితులకు సహాయం అందించడంలో ఇప్పటికీ కొందరు అధికారులు నిర్లక్ష్యం వీడడం లేదని.. స్వయంగా తానే రంగంలోకి దిగినా ఇంకా మొద్దనిద్ర వీడలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుకున్న స్థాయిలో ఆహారం తెప్పించగలిగినా పంపిణీ విషయంలో జాప్యం జరగడంపై అసంతృప్తి వెలిబుచ్చారు. పని చేయడం ఇష్టం లేకపోతే ఉద్యోగాలు వదిలేసి ఇంటికి వెళ్లాలని.. ప్రజలు బాధల్లో ఉంటే అండగా ఉండాల్సింది పోయి ఇలా ప్రవరిస్తే సహించేది లేదని క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తోంది.


Also Read: Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీ గేట్లను ఢీకొన్న బోట్లు - మరమ్మతులకు ప్రభుత్వం చర్యలు, రంగంలోకి నిపుణులు కన్నయ్య నాయుడు