Floods Affect: ఎగువ ప్రాంతాలలో వరద ఉద్ధృతి తగ్గి ముఖం పట్టినప్పటికీ కూడా కోనసీమ జిల్లాలో లంక గ్రామాల ప్రజల కష్టాలు తీరడం లేదు. ఇంకా చాలా గ్రామాల్లో మోకాళ్ల లోతు ముంపు నీటిలోనే ప్రజలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కోనసీమ వ్యాప్తంగా ముంపుకు గురైన లంక గ్రామాలలో వందల హెక్టార్లలో ఉద్యాన పంటలు తుడిచి పెట్టుకు పోయాయి. దీంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో పక్క ఇళ్లల్లోకి విష సర్పాలు చొరబడి భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని వాపోతున్నారు. ఇదిలా ఉంటే కరకట్టలు కూడా ఎక్కడపడితే అక్కడ బలహీన పడిన పరిస్థితి కనిపిస్తుంది. ఏ క్షణాన ఏ ఏటిగట్టు కూలిపోతుందో అంటూ భయభ్రాంతులతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. వరద బాధితులను పరామర్శించడానికి వెళ్లిన ప్రజాప్రతినిధులు అధికారులపై ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
నిత్యావసర సరుకులు కేవలం కొన్ని ప్రాంతాల్లోని వారికి మాత్రమే అందుతున్నాయని చెప్పారు.శివారులంక గ్రామాల్లో పూట గడవడమే చాలా ఇబ్బందిగా మారిదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో పక్క పేరుకుపోయిన బురదతో రోగాల భయం వెంటాడుతోంది. అలాగే పునరావాస కేంద్రాల్లో ఉన్న వారికి సరిగ్గా భోజనం కూడా దొరకట్లేదని వాపోతున్నారు. మంచి నీళ్లు, చిన్న పిల్లలకు పాలు కూడా అందించాలని కోరుతున్నారు. ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకొని వరద ప్రభావం తగ్గేలా చేయాలని.. తమకు అన్ని రకాలుగా సాయం చేయాలని వేడుకుంటున్నారు. అంతే కాకుండా ఆస్తి నష్టం జరిగిన ప్రజలందరికీ సర్కాకే అండగా ఉండాలంటున్నారు.
వరద బాధితులకు అండగా స్వచ్ఛంద సేవా సంస్థలు..
కోనసీమ జిల్లాలో వరద ముంపు గ్రామాల్లోని ప్రజలకు పలు స్వచ్చంధ సంస్థలు నిత్యావసర సరుకులు అందజేశాయి. ఇందులో భాగంగానే రాజమహేంద్రవరానికి చెందిన మదర్ తెరిసా మిలీనియం సేవా సంస్థ.. అయినవిల్లి లంక పరిసర ఐదు గ్రామాలకు చెందిన దాదాపు 4000 కుటుంబాలకు సుమారు 20 లక్షల రూపాయల వ్యయంతో నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.
పడవల ద్వారా దాటింపులు..
కోనసీమ జిల్లాలోని వరద ముంపు గ్రామాలలో పడవ దాటింపు కార్మికుల సేవలు కీలకంగా మారాయి. వరద ముంపులో చిక్కుకున్న వారిని అదే విధంగా సహాయక కార్యక్రమాల్లో పాల్గొనే వారికి పడవలో ప్రయాణం చేయడమే ఉన్నటువంటి ఏకైక మార్గం. అధికారులు వెళ్లాలన్న... ప్రజా ప్రతినిధులు చూడాలన్న... బాధితులు రేవు దాటాలన్న పడవలే దిక్కు. గత వారం రోజులుగా లంక గ్రామాలలో పడవ దాటింపులు చేస్తున్నామని చెబుతున్నారు. అయితే ఈ పని చేస్తున్నా ప్రభుత్వం తమకు ఏమాత్రం సాయం చేయడం లేదని వాపోతున్నారు. ఇప్పటికైనా స్పందించి తమకు డబ్బులు వచ్చేలా చేయాలని కోరుతున్నారు. ఏదిఏమైనాప్పటికీ కోనసీమలో వరద కష్టాలు తలుచుకుంటే చాలు కళ్ళల్లో నీళ్లు తిరిగేలా చేస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ కోనసీమలో వరద కష్టాలు తలుచుకుంటే చాలు కళ్ళల్లో నీళ్లు తిరిగేలా చేస్తున్నాయి.