Minister Meruga Nagarjuna: ఏపీ మంత్రి మేరుగ నాగార్జున వల్ల తనకు ప్రాణాహాని ఉందని బాపట్ల జిల్లా అమర్తలూరు మండలం మూల్పురు మాజీ సర్పంచ్ భర్త మాణిక్యరావు ఆరోపించారు. బాపట్ల జిల్లా తెనాలిలో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. తనపై అక్రమ కేసులు పెట్టేందుకు మంత్రి ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. తాను చనిపోతే పూర్తి బాధ్యత మంత్రి మేరుగ నాగార్జునదే అని వివరించారు. బిల్లులు రాకుండా అడ్డుకుంటున్నారని వీడియో విడుదల చేసి తర్వాత తనపై కక్ష పెంచుకున్నారని, ఇంటి చుట్టూ పోలీసులను పెట్టి భయ భ్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవలే మంత్రిపై ఆరోపణలు చేస్తూ మాణిక్య రావు వీడియో విడుదల చేశారు. తన భార్య రోజ్ మేరీ సర్పంచ్ గా ఉన్న సమయంలో గ్రామాభివృద్ధికి సంబంధించిన బిల్లులు రాకుండా మంత్రి అడ్డుకుంటారని వీడియోలో ఆరోపించారు. స్థానిక నాయకులు ఆడించినట్లుగా ఆడుతూ.. మంత్రి మేరుగ దళితులను వేధిస్తున్నారని ఫైర్ అయ్యారు. మాణిక్యరావు చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి.
అసలేం జరిగిందంటే..?
గ్రామ అభివృద్ధికి సంబంధించిన బిల్లులు రాకుండా మంత్రి మేరుగ నాగార్జున అడ్డుకుంటున్నారని బాపట్ల జిల్లా అమర్తలూరు మండలం మూల్పూరు మాజీ సర్పంచ్ రోజా మేరీ భర్త మాణిక్యాల రావు ఆరోపించారు. 2013-2018 వరకు రోజా మేరీ సర్పంచ్ గా పని చేశారు. ఆ సమయంలో కోట్ల రూపాయలతో పంచాయతీ అభివృద్ధి చేశామని మాణిక్య రావు చెప్పారు. అయితే 14వ ఆర్థిక సంఘం నిధుల్లో తమకు రావాల్సిన బిల్లులు రాకుండా స్థానిక నాయకుల మాటలు విని మంత్రి మేరుగ నాగార్జున బిల్లులు రానివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఎలాంటి ఉపయోగం లేదని వాపోయారు. స్థానిక నాయకుల చేతిలో కీలుబొమ్మగా మారి మంత్రి నాగార్జున దళితులను వేధిస్తున్నారని మండిపడ్డారు. తన ఆవేదనను చెప్పుకుంటున్నందుకు.. కొందరు చంపేస్తామని బెదిరింపులకు పాల్పడడం దారుణం అన్నారు.