Eluru Girls Hostel News: ఏలూరులో ఓ మంచి ఉద్దేశంతో నెలకొల్పిన బాలిక వసతి ఆశ్రమంలో అక్కడే వార్డెన్ గా పని చేస్తున్న ఉద్యోగి అరాచకాలు బయటికి వచ్చాయి. సేవాశ్రమం అయిన అందులో ఓ కామాంధుడైన ఓ మహిళా వార్డెన్ భర్త బాలికల పట్ల వ్యవహరిస్తున్న తీరు విస్మయాన్ని కలిగిస్తోంది. నిందితుడి వయసు 55. మహిళా వార్డెన్‌ భర్తగా ఆ ఆశ్రమంలోకి ఎంటర్ అయి అందులో ఆశ్రయం పొందుతున్న బాలికలను లైంగికంగా వేధించడమే పనిగా పెట్టుకున్నాడు. తాను చెప్పినట్లు వినకపోతే బాలికలను దారుణంగా కొట్టడంతో చాలా రోజులుగా ఆ దుర్మార్గాలను తట్టుకున్న ఆ బాలికలకు ఓపిక నశించి అతని బండారం అంతా బయట పెట్టారు.


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏలూరు అమీనాపేటలో శ్రీస్వామిదయానంద సరస్వతి సేవాశ్రమం ఉంది. అందులో వందల మంది బాలికలు ఆశ్రయం పొందుతున్నారు. ఈ హాస్టల్‌ను నిర్వహకులు ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఏర్పాటు చేశారు. హాస్టల్‌ వార్డెన్‌గా పని చేస్తున్న మణిశ్రీ భర్త శశికుమార్‌ అనే 55 ఏళ్ల వ్యక్తి బాలికలపై తరచూ అఘాయిత్యాలకు పాల్పడు­తూ ఉన్నాడు ఇతను స్థానిక ఎన్‌ఆర్‌ పేటలో మణి ఫొటో స్టూడియో నడుపుతున్నాడు. ఇంకా యర్రగుంటపల్లి బీసీ హాస్టల్లో కూడా పనిచేస్తున్నాడు. కొంతకాలం క్రితమే తన రెండో భార్య మణిశ్రీని సేవాశ్రమంలో వార్డెన్‌గా చేర్చినట్లు చెబుతున్నారు.


ఇలా పదుల సంఖ్యలో బాలికలను వేధించినట్టుగా బాధిత బాలికలు వాపోతున్నారు. ఆదివారం ఒక బాలికను బాపట్లకు ఫొటో షూట్‌ కోసమని తీసుకువెళ్లి సోమవారం రాత్రి తిరిగి తీసుకువచ్చినట్లుగా బాలికలు చెబుతున్నారు. రాత్రివేళ ఆ బాలిక తన దుస్తులను ఏడుస్తూ ఉతుక్కుంటుండగా.. తోటి బాలికలు ప్రశ్నించగా.. ఆమె ఈ విషయం చెప్పింది. ఇలా ఆ విషయం బయటకు చెప్పిందనే కోపంతో నిందితుడు అక్కడ ఉన్న విద్యార్థినులు అందరినీ మోకాళ్లపై కూర్చోబెట్టి దారు­ణంగా కొట్టాడు. ఆ దారు­ణాలను  భరిస్తూ ఉండకూడదనే మంగళవారం ఏలూరు టూటౌన్‌ పోలీస్‌­స్టేషన్‌కు వచ్చి అందరూ కంప్లైంట్ ఇచ్చారు.


ఫొటో షూట్‌లపేరుతో అరాచకాలు
బాలికలను ఒక్కొక్కరిని బయటకు తీసుకెళ్లి ఫొటో షూట్‌ల పేరుతో తమ కాళ్లూచేతులూ కట్టేసి అఘాయిత్యానికి పాల్పడతాడని బాలికలు వాపోయారు. ఆ క్రమంలో తమను కొడతాడని చెప్పారు. బాయ్‌ఫ్రెండ్స్‌ ఉంటే చెప్పండి వాళ్ల దగ్గరకు పంపుతా.. రూమ్‌లు కూడా ఏర్పాటు చేస్తా అని అసభ్యంగా మాట్లాడతాడని బాలికలు చెప్పారు. తాము సగం తాగిన టీ, కాఫీ లాక్కొని ఎంగిలి తాగుతూ వక్రంగా మాట్లాడతాడని అన్నారు. 


అయితే, పోలీసులకు ఫిర్యాదు చేసే ముందే బాధిత విద్యార్థినులు మీడియాకు కూడా జరిగినది మొత్తం చెప్పారు. అయినా పోలీసులు మాత్రం బాలికలను భయపెట్టి ఈ దారుణ సంఘటనను నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. అయితే, ఈ ఘటనపై ఏలూరు డీఎస్పీ శ్రావణ్‌­ కుమా­ర్‌ వెంటనే స్పందించి చర్యలకు రెడీ అయ్యారు. సేవాశ్రమం వద్దకు వెళ్లి ఘటనలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. ముగ్గురు బాలికలు ఫిర్యాదు చేశారని, కేసు నమోదు చేసినట్లుగా తెలిపారు. పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి, నిందితు­లపై కేసులు పెడతామని చెప్పారు. నిందితులను అదు­పులోకి తీసుకునేందుకు చర్యలు చేపట్టామని అ­న్నా­రు.