AP Voters Final List Released: ఏపీలో రాబోయే ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు ముమ్మరం చేసింది. 2024 తుది ఓటర్ల జాబితాను ఈసీ వెబ్ సైట్ (Election Commission) లో పొందుపరిచింది. ఓటర్లు తమ పేర్లు జాబితాలో ఉన్నాయో.? లేదో? చెక్ చేసుకోవాలని అధికారులు సూచించారు. తుది జాబితాలో పేరు లేకపోయినా ఆందోళన అవసరం లేదని.. సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తర్వాత కూడా ఓటరుగా నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఓటు నమోదు కోసం వచ్చే దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి ఎన్నికల సంఘం వారికి ఓటు హక్కు కల్పిస్తుంది. తుది జాబితాకు అనుబంధంగా ఈ జాబితాను జత చేస్తారు. 


చెక్ చేసుకోండిలా



  • ఎన్నికల సంఘానికి చెందిన వెబ్ సైట్ (https://voterportal.eci.gov.in) ను ఓపెన్ చేసి సెర్చ్ ఎలక్టోరల్ రోల్ ఆప్షన్ ద్వారా ఓటరు వివరాలు తెలుసుకోవచ్చు. అందులో రాష్ట్రం, పేరు, తండ్రి లేదా భర్త పేరు, వయసు ఇతర వివరాలను సంబంధిత కాలమ్స్ లో ఎంటర్ చేయాలి. అనంతరం జిల్లా, అసెంబ్లీ, నియోజకవర్గం పేరు ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే, EPIC, మొబైల్ నెంబర్ సాయంతోనూ ఓటరు వివరాలు తెలుసుకునే వీలుందని అధికారులు తెలిపారు.

  • చీఫ్ ఎలక్టోరల్ ఆఫీస్, ఆంధ్రప్రదేశ్ పోర్టల్ లోనూ ఓటరు వివరాలు లభిస్తాయి. https://ceoandhra.nic.in/ceoap_new/ceo/index.html లో సెర్చ్ యువర్ నేమ్ ఆప్షన్ ఎంచుకోవాలి. అనంతరం ఓటరు పోర్టల్ కే సైట్ రీడైరెక్ట్ అవుతుంది. ఈ వెబ్ సైట్ లో ఓటరు జాబితా పీడీఎఫ్ రూపంలో లభిస్తుంది. ఈ నెల 22న విడుదలైన తుది జాబితాను ఇందులో చూడొచ్చు. అందులో జిల్లా, నియోజకవర్గం, భాష ఎంచుకున్న అనంతరం క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేయాలి. తద్వారా పోలింగ్ కేంద్రాలు, పార్టుల వారీగా ఓటర్లు జాబితాను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. 

  • ఎన్నికల సంఘం మొబైల్ యాప్ లోనూ ఓటరు వివరాలు తెలుసుకోవచ్చు. మొబైల్ లోని ప్లే స్టోర్ లో ఓటరు హెల్ప్ లైన్ అనే యాప్ డౌన్ లోడ్ చేసుకుని.. మీ మొబైల్ నెంబరుతో రిజిస్టర్ చేసుకోవాలి. జాబితాను తెలుసుకునేందుకు పైన ఉన్న ఆప్షన్ పై క్లిక్ చేయాలి. అందులో మొబైల్ నెంబర్, క్యూఆర్ కోడ్, వివరాలు ఆధారంగా సెర్చ్ డీటెయిల్స్, EPIC నెంబర్ వారీగా వివరాలు తెలుసుకోవచ్చు.


ఓటు వివరాలు లేకపోతే


ఒకవేళ, వెబ్ సైట్ లేదా యాప్ లో మీ ఓటు వివరాలు అందుబాటులో లేకపోతే జిల్లా ఎన్నికల అధికారికి (కలెక్టర్) ఫిర్యాదు చెయ్యొచ్చు. ఓటును అక్రమంగా తొలగించారని రాత పూర్వకంగా ఫిర్యాదు చెయ్యొచ్చు. కలెక్టర్.. ఈఆర్వో (ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్) స్థాయి అధికారితో విచారణ జరిపి పొరపాటును గుర్తించాల్సి ఉంటుంది. మీ ఓటును తొలగించాలని ఎవరైనా ఫారం - 7 ద్వారా ఫిర్యాదు చేశారా.? లేక అధికారులే తొలగించారా.? అనేది విచారించాల్సి ఉంటుంది. మీ ఓటును అక్రమంగా జాబితా నుంచి తొలగించారని తేలితే సంబంధిత ఈఆర్వోతో పాటు, బీఎల్వో, ఫారం - 7 దరఖాస్తుదారుపై చర్యలు తీసుకునేలా జిల్లా కలెక్టర్ ను కోరవచ్చు. అలాగే, ఓటరు జాబితాలో పేరు ఉన్నా.. అందులో పేరు, చిరునామా తదితర వివరాలు తప్పుగా నమోదైతే ఫారం - 8 ద్వారా సరిచేసుకోవచ్చు. కొత్తగా ఓటరుగా నమోదు కావాలంటే ఫారం - 6 ద్వారా వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. 


టోల్ ఫ్రీ నెంబర్ ఇదే


ఓటు హక్కుకు సంబంధించి ఎవరికి ఎలాంటి సందేహాలున్నా టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయాలని అధికారులు సూచించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల మధ్య కాల్ చేయాలని పేర్కొన్నారు. 


Also Read: Ganta Srinivasa Rao: 'సీఎం జగన్ కు భయం పట్టుకుంది' - తన రాజీనామా ఆమోదంపై గంటా శ్రీనివాసరావు స్పందన