YSR Rythu Bharosa Jagananna Vidya Deevena funds in AP: ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే అమలులో ఉన్న వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి నిధుల విడుదలకు ఎన్నికల సంఘం బ్రేక్ వేసింది. ప్రస్తుతం ఏపీలో అసెంబ్లీ ఎన్నికలతో పాటు, సార్వత్రిక ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. నోటిఫికేషన్ విడుదల కాగానే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున నిధుల విడుదలకు అడ్డుకట్ట పడింది. ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించే లక్ష్యంతో ఇప్పటికే పలు ఈసీ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. తాజాగా నిధుల విడుదల విషయంలోనూ అంతే వ్యవహరించింది.
వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం లబ్ధిదారులకు ప్రతి నెల విడుదల చేస్తున్న సంక్షేమ పథకాల నిధుల విడుదల కోసం ఈసారి కూడా ఎన్నికల సంఘాన్ని అనుమతి కోరింది. అయితే, రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున నిధుల విడుదల కుదరదని ఈసీ తేల్చిచెప్పింది. ఈ మే నెలలో విడుదల చేయాల్సిన సంక్షేమ పథకాల్లో భాగంగా ఫీజు రీఎంబర్స్‌మెంట్ (విద్యాదీవెన), ఇన్ పుట్ సబ్సిడీ (రైతు భరోసా) లాంటి పథకాలు ఉన్నాయి. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున వీటి విడుదలకు పర్మిషన్ ఇవ్వాలని వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. ఇవి గత కొన్నాళ్లుగా కొనసాగుతున్న పథకాలు అని, కొత్త పథకాలు కావని స్పష్టత ఇచ్చింది. కాబట్టి, ఇవి ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందికి రావని వివరించింది. అయినప్పటికీ ఎన్నికల సంఘం మాత్రం సదరు సంక్షేమ పథకాల సొమ్మును లబ్దిదారుల ఖాతాల్లో జమ చేయడానికి పర్మిషన్ ఇవ్వలేదు.
వాలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీకి బ్రేక్
ఏపీలో గత నెల నుంచే ఆసరా పింఛన్లను నేరుగా ఇంటికి వెళ్లి అందించే ప్రక్రియను ఈసీ ఆపేసింది. అంతకుముందు వరకూ ఆసరా పెన్షన్లను ఇంటింటికీ వాలంటీర్లు వెళ్లి అందించేవారు. అందుకు ఈసీ ఒప్పుకోకపోవడం.. అంతకుముందే వాలంటీర్లను దూరం పెట్టాలనే ఆదేశాలు ఉండడంతో.. నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులను జమ చేశారు. కదల్లేని స్థితిలో ఉన్నవారి ఇంటికి సచివాలయ సిబ్బంది ద్వారా అధికారులు డబ్బులను పంపిణీ చేయించారు. దీనిపైనే అధికార పార్టీ, విపక్షపార్టీల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు తలెత్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఫీజు రీయింబర్స్ మెంట్, ఇన్ పుట్ సబ్సిడీ పథకాల డబ్బులను విడుదల చేయడానికి ఈసీ నిరాకరించింది.