AP Latest News Telugu: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా హింసాత్మక ఘటనలు, ఉద్రిక్తతలు కొనసాగుతుండడంపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ఈ మేరకు డీజీపీ హరీశ్ కుమార్, సీఎస్ జవహార్ రెడ్డికి సమన్లు జారీ చేసింది. ఇద్దరూ వ్యక్తిగతంగా వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించింది. ఇందుకోసం సీఎస్, డీజీపీ రేపు ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఏపీలో ఎన్నికల తరువాత జరుగుతున్న హింసను అరికట్టడంలో డీజీపీ, సీఎస్ లు విఫలమైనట్లుగా ఎన్నికల కమిషన్ అభిప్రాయపడింది.


పల్నాడు, చంద్రగిరి, తాడిపత్రి, సత్తెనపల్లి, మాచర్ల, తిరుపతి తరదితర ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు జరిగిన సంగతి తెలిసిందే. వాహనాలను తగులబెట్టడం, రాళ్లు రువ్వుకోవడం, మారణాయుధాలతో దాడులు చేసుకోవడం వంటి ఘటనలు జరిగాయి.


తిరుపతిలో చంద్రగిరి అభ్యర్థిపై దాడి                       
చంద్రగిరి నుంచి టీడీపీ అభ్యర్థిగా ఉన్న పులివర్తి నానిపై మంగళవారం తిరుపతిలో దాడి జరిగిన సంగతి తెలిసిందే. తిరుపతి పద్మావతి యూనివర్సిటీలో ఉన్న స్ట్రాంగ్ రూం పరిశీలనకు వెళ్లి వస్తు్న్న పులివర్తి నానిపై వైసీపీ శ్రేణులు దాడి చేశారు. ఎరుపు రంగు హ్యుండయ్ కారులో వచ్చి.. అకస్మాత్తుగా పులివర్తి నాని కారు అయిన ఫార్చునర్‌ను ధ్వంసం చేశారు. ఆయనపై కూడా రాళ్ల దాడి, ఆయుధాలతో దాడి చేశారు. వైసీపీ కార్యకర్తల దాడిలో నాని భద్రతా సిబ్బందికి గాయాలు అయ్యాయి. ఆ దాడిని నిరసిస్తూ మహిళా యూనివర్సిటీ రోడ్డుపైనే నాని బైఠాయించి నిరసన తెలిపారు. వైసీపీ శ్రేణులను చెదరగొట్టేందుకు పులివర్తి నాని భద్రతా సిబ్బంది గాల్లోకి రెండు రౌండ్ల కాల్పులు కూడా జరిపారు.


దాడికి సంబంధించిన సీసీటీవీ వీడియోలు బయటికి వచ్చాయి. కారు బ్యానెట్‌కు ఉన్న కెమెరాలో దాడి ఫుటేజీ అంతా రికార్డు అయింది. టీడీపీ కార్యకర్తలు అక్కడికి చేరుకొని వైసీపీ నేతలను తరిమికొట్టారు. అక్కడే ఉన్న వైసీపీ నేతల కారు, బైక్ ను టీడీపీ నేతలు ధ్వంసం చేశారు.


కారంపూడిలో టీడీపీ ఆఫీసు ధ్వంసం
పల్నాడు జిల్లా కారంపూడిలోనూ ఉద్రిక్తతలు జరిగాయి. మే 13 పోలింగ్ రోజున ఉద్రిక్తతల్లో గాయపడిన తమ వారిని పరామర్శించేందుకు పేటసన్నెగండ్ల గ్రామానికి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వెళ్తుండగా.. కారంపూడిలో తన అనుచరులతో కలిసి ఎమ్మెల్యే భయానక వాతావరణం సృష్టించారని అరోపణలు ఉన్నాయి.


వారంతా టీడీపీ కార్యాలయం ధ్వంసం చేయటంతో పాటు అక్కడ ఉన్న టీడీపీ నేత జానీ బాషా వాహనానికి నిప్పు అంటించారు.  దాడులు ఆపేందుకు ప్రయత్నించిన కారంపూడి సీఐ నారాయణ స్వామిపై కూడా దాడికి తెగబడినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. దీంతో సీఐ నారాయణస్వామికి కూడా తీవ్ర గాయాలు అయ్యాయి.


తాడిపత్రిలోనూ ఉద్రిక్తతలు చెలరేగాయి. తాడిపత్రిలో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి విధ్వంసం సృష్టించారని ఆరోపణలు ఉన్నాయి. చింతలరాయుని పాళెంలో ఉన్న వైసీపీ ఏజెంట్లు సంజీవ, అజయ్‌, మరో నలుగురు కలసి టీడీపీ ఏజెంట్‌ భాను, ఆ పార్టీ వర్గీయుడు మోహన్‌లపై దాడికి దిగారు. ఇది ఉద్రిక్తతలకు దారి తీసింది.