ED to register case in Andhra Pradesh liquor scam: ఆంధ్రప్రదేశ్ రాజకీయవర్గాల్లో పెను సంచలనంగా మారిన లిక్కర్ స్కాంలో ఈడీ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీఐడీ సిట్ దర్యాప్తు చేస్తున్నకేసుకు సంబంధించి పూర్తి వివరాలు ఇవ్వాలని ఈడీ లేఖ రాసింది. నిందితులను విచారించడానికి విజయవాడ సీపీ అనుమతి కోరుతూ లేఖ రాసింది. ఎఫ్ఐఆర్ తో పాటు సీజ్ చేసిన బ్యాంక్ అకౌంట్ల వివరాలుతో అరెస్టు చేసిన వారి డీటైల్స్.. దర్యాప్తులో తేలిన నగదు లావాదేవీల వివరాలుతో సహా మొత్తం వివరాలు అందించాలని ఈడీ కోరింది. పీఎంఎల్ఏ సెక్షన్ కింద కేసులు నమోదు చేయనున్నారు.
ఏపీ లిక్కర్ స్కాంలో వేల కోట్ల లావాదేవీలు జరిగాయని ఆరోపణలు
ఏపీలో లిక్కర్ స్కాంలో నగదు లావాదేవీలు చేయడం ద్వారా మొత్తం స్కాంను నడిపించారని సీఐడీ సిట్ చెబుతోంది. ఈ వ్యవహారంలో సీఐడీ సిట్ చాలా వరకూ వివరాలు సేకరించింది. వరుసగా అరెస్టులు చేస్తోంది. ఈ కేసులో కీలకమైన వ్యక్తులుగా ఉన్న ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీ తమను అరెస్టు చేయకుండా చూడాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీంతో వారి కోసం సిట్ వెదుకుతోంది. వారు ఆజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. వారి ఇళ్లల్లో సిట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
గతంలోనే ఈ కేసును ఈడీకి రిఫర్ చేసిన ఏపీ ప్రభుత్వం
ఈ కేసులో ఈడీ దర్యాప్తు కోసం చాలా కాలంగా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. గతంలో అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఈ కేసును ఈడీకి రిఫర్ చేస్తున్నట్లుగా చెప్పారు. అవినీతి వ్యవహారంలో రాష్ట్ర సిట్ చర్యలు తీసుకుంటుంది. వేల కోట్ల మనీలాండరింగ్ ఇష్యూలో.. ఈడీ చర్యలు తీసుకుంటుంది. ఆర్థికలావాదేవీలు, అక్రమ నగదు లావాదేవీైలు, సూట్ కేసు కంపెనీల గుట్టు ఇప్పటికే బయటపడటంతో నిందితులు అంతా ఇరుక్కుపోయినట్లుగా భావిస్తున్నారు.
సీబీఐ విచారణ కూడా కావాలని టీడీపీ ఎంపీ శివనాథ్ లేఖ
మరో వైపు ఈ కేసులో సీబీఐ విచారణ చేయించాలని టీడీపీ ఎంపీ కేశినేని శివనాథ్ లేఖ రాశారు. సీబీఐకి రాసిన అధికారిక లేఖలో విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని శివనాథ్ రూ.3600 కోట్లకు పైగా విలువైన భారీ మద్యం కుంభకోణంపై నిష్పాక్షిక దర్యాప్తు జరపాలని కోరారు. రాష్ట్ర వనరులు మరియు ప్రజారోగ్యానికి సంబంధించిన ఇంత భారీ కుంభకోణం ఎలా అదుపు లేకుండా పోయిందని ప్రశనించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నిజం తెలుసుకునే హక్కు ఉందని.. నిందితుల్ని కఠినంగా శిక్షించాల్సి ఉందన్నారు. ఈ కుంభకోణం తీవ్రత, పరిమాణం , అంతర్రాష్ట్ర ఆర్థిక చిక్కులను దృష్టిలో ఉంచుకుని, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) వెంటనే దర్యాప్తును చేపట్టి, సమగ్రమైన నిష్పాక్షికమైన దర్యాప్తును కోరారు.