ED investigation in Andhra liquor Scam Case: ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసు కీలక మలుపులు తిరుగుతోంది. సీఐడీ సిట్ అధికారులు ఇప్పటికే ప్రాథమిక చార్జిషీటు దాఖలు చేశారు. ఈ స్కామ్ మొత్తానికి సూత్రధారిగా జగన్‌ను గుర్తించారని అరెస్టు చేయవచ్చన్న ప్రచారం కూడా ఊపందుకుంటోంది. ఇలాంటి సమయంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కూడా రంగంలోకిదిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణ కొనసాగుతుండగానే, కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా కేసులు పెట్టింది. అక్రమ నగదు చెలామణి కోణంలో దర్యాప్తు ప్రారంభించింది. ఈ స్కామ్ మొత్తం నగదు లావాదేవీలు నిండి ఉన్నాయని సిట్ గుర్తించింది. సీఐడీ నమోదుచేసిన కేసు ఆధారంగానేమే నెలలోనే ఈడీ మనీ లాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించింది.
మద్యం సరఫరాదారుల నుంచి కమీషన్ల రూపంలో భారీగా ముడుపులు వసూలు చేసి, ఆ డబ్బును హవాలా మార్గాల్లో తరలించారని సిట్ తన ప్రాథమిక దర్యాప్తులో తేల్చింది. ఈడీ విచారణకు సిఫారసు చేస్తున్నట్లుగా అసెంబ్లీలోనే చంద్రబాబు ప్రకటించారు. సిట్ అధారాలను బేస్ చేసుకుని ఈడీ కూడా నోటీసులు జారీ చేయడం ప్రారంభించింది. వైసీపీ హయాంలో భారీగా మద్యం ఆర్డర్లు పొంది, కమిషన్లు ఇచ్చినట్లుగా ఆరోపణలు ఉన్న డిస్టిలరీల యజమానులకు నోటీసులు జారీ చేస్తోంది. శర్వాణి డిస్టిలరీస్ డైరెక్టర్ చంద్రారెడ్డికి నోటీసులు జారీ చేసి, విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. రానున్న రోజుల్లో మరికొంత మంది మద్యం వ్యాపారులు, అప్పటి ప్రభుత్వ పెద్దలతో సంబంధాలున్న వ్యక్తులను ఈడీ విచారించే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది.
ఈ కేసులో ఇప్పటికే ఎంపీ పి.వి. మిథున్ రెడ్డితో సహా 12 మందిని సిట్ అరెస్టు చేసింది. నిందితులు మద్యం సిండికేట్‌గా ఏర్పడి, ఆర్డర్లు ఇచ్చే విధానాన్ని అనుకూలంగా మార్చుకుని, భారీగా కమీషన్లు దండుకున్నారని సిట్ తన చార్జిషీట్‌లో పేర్కొంది. ఈ అక్రమ ధనాన్ని ఎన్నికల ఖర్చులకు, ఇతర పెట్టుబడులకు మళ్లించినట్లు చెబుతోంది. సిట్ దర్యాప్తుతో పాటు ఇప్పుడు ఈడీ విచారణ కూడా మొదలుకావడంతో, ఈ కుంభకోణం వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరనేది తేలనుందని భావిస్తున్నారు.
లిక్కర్ స్కామ్ ద్వారా సంపాదించుకున్న దొంగ డబ్బు లో హెచ్చు భాగం హవాలా విదేశాలకు తరలిపోయిందని సిట్ సేకరించిన వివరాలు ఈడీకి అందించింది. నిందితులు విదేశాల్లో కూడా లాజిస్టిక్స్ పేరుతో కంపెనీలు పెట్టి బ్లాక్ ను వైట్ చేశారని .. ఇండియాకు తరలించారని గుర్తించారు. అలాగే 2024 ఎన్నికల్లో దాదాపు 300 కోట్లు వైసిపి అభ్యర్థులకు ఇచ్చారన్న సమాచారం కూడా సిట్ ఈడీకి ఇచ్చినట్లుగా తెలుస్తోంది. నోట్ల కట్టల డెన్ లను గుర్తించారు. అక్కడ తీసిన వీడియోలు సాక్ష్యాలను కూడా ఈడీకి ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ అరెస్టులు ప్రారంభిస్తే.. లిక్కర్ కేసులో కొత్త సంచలనాలు నమోదయ్యే అవకాశాలు ఉంటాయి. రాజకీయంగానూ కలకలం రేపే అవకాశాలు ఉంటాయి.