జగన్ అక్రమాస్తుల కేసుల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ మరో రెండు చార్జిషీట్లను దాఖలు చేసింది. వాన్‌పిక్, లేపాక్షి కేసుల్లో ఈ చార్జిషీట్లను దాఖలు చేసింది. ఇప్పటి వరకూ ఏడు అభియోగపత్రాలను దాఖలు చేయగా.. వాటిని కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఇప్పుడు దాఖలు వాటితో కలిపి మొత్తం 9 చార్జిషీట్లను ఈడీ దాఖలు చేసినట్లయింది. సీబీఐ అభియోగపత్రాల ఆధారంగా ఈడీ కూడా కేసులు నమోదు చేసి దర్యాప్తు జరుపుతోంది. తాజాగా దాఖలు చేసిన రెండు చార్జిషీట్లను కోర్టు పరిగణనలోకి తీసుకుంటే నిందితులందరికీ నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది.
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో రస్ అల్‌ఖైమా సంయుక్త భాగస్వామ్యంతో వాడరేవు నిజాంపట్నం రేవు, పారిశ్రామిక కారిడార్ వాన్‌పిక్ ప్రాజెక్టును నిమ్మగడ్డ ప్రసాద్ చేపట్టారు. వాన్‌పిక్‌లో రస్ అల్‌ఖైమాకు 51 శాతం, నిమ్మగడ్డ ప్రసాద్‌కు 49 శాతం వాటాలున్నాయి. దీనికోసం ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ ప్రభుత్వం 11వేల ఎకరాల భూమిని కేటాయించారు. ఈ భూమిని కేటాయించిన తర్వాత నిమ్మగడ్డ ప్రసాద్ జగన్ కంపెనీల్లో రూ.850 కోట్ల మేరకు పెట్టుబడులు పెట్టారు. వైఎస్సార్ ఫౌండేషన్‌కు రూ.7 కోట్ల విరాళాలిచ్చారు. ఇదంతా క్విడ్ ప్రో కోనేనని సీబీఐ కేసు నమోదు చేసింది. చార్జిషీటు ఆధారంగా ఈడీ కూడా ద్రవ్య అక్రమ చలామణీ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసింది. ఇప్పుడు అభియోగపత్రం దాఖలు చేసింది.
అనంతపురం జిల్లాలోని గోరంట్ల మండలం లేపాక్షిలో బాలాజీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీకి 2008లో లేపాక్షి నాలెడ్జి హబ్ కోసం 8844 ఎకరాలను అప్పటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం కేటాయించింది. కోటి రూపాయలు మాత్రమే ఖర్చు చేసి లేపాక్షి హబ్‌కు కేటాయించిన భూములను వివిధ బ్యాంకుల్లో తాకట్టు పెట్టి బాలాజీ కంపెనీ 800 కోట్ల రూపాయల అప్పు తీసుకుంది. ఆ నిధులను ఇందూ ప్రాజెక్ట్స్‌కు బదలాయించారు. ఇందూ ప్రాజెక్ట్స్ క్విడ్ ప్రో కోలో భాగంగా జగన్ కంపెనీల్లో పెట్టుబడి పెట్టిందని సీబీఐ చార్జిషీటు దాఖలు చేసింది. దీని ఆధారంగా ఈడీ కూడా అభియోగపత్రం దాఖలు చేసింది.
ఇటీవలే ఈడీ కేసుల విచారణ ముందు వద్దని .. సీబీఐ కేసుల విచారణ చేపట్టాలని కోరుతూ జగన్, విజయసాయిరెడ్డి హైకోర్టులో పిటిషన్లు వేశారు. అయితే హైకోర్టు పిటిషన్లను కొట్టి వేసింది. దీంతో ముందుగా ఈడీ కేసుల విచారణ ప్రారంభమవనుంది. ఇప్పటికే జగన్ అక్రమాస్తుల కేసుల్లో చార్జిషీట్ల ప్రక్రియ పూర్తయిన కేసుల్లో వాదనలు వినిపించడానికి సిద్ధం కావాలని సీబీఐ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.