Yanamala Ramakrishnudu : కక్ష సాధింపులో సీఎం జగన్ ది నెంబర్ వన్ ప్లేస్ అని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. సింగపూర్ ఎకనామిక్ బోర్డును టీడీపీ ప్రభుత్వం తీసుకువచ్చిందని గుర్తుచేశారు. ఈడీబీని చెత్తబుట్టలో పడేసి ర్యాంకింగులు వస్తున్నాయని చెప్పడం మోసపూరితం అని ఆరోపించారు. రాష్ట్రంలో ఆర్థిక అభివృద్ధి రేటు నెగెటివ్ దిశగా వెళుతోందన్నారు.  ఏపీలో క్రిప్టో క్రాట్స్ పుట్టుకువస్తున్నారని విమర్శించారు. దోపిడీ వ్యవస్థ వల్ల కొత్త ధనవంతులు వస్తున్నారు తప్ప సామాన్యుల ఆదాయం పెరగడం లేదన్నారు. ఈ వ్యత్యాసం గురించి చర్చించమంటే ఆర్థిక మంత్రి పిట్టకథలు చెబుతున్నారన్నారు.  రాష్ట్రం అప్రతిష్ఠపాలవ్వడంతో పారిశ్రామిక అభివృద్ధి కుప్పకూలిందని ఆరోపించారు. ప్రైవేట్ పెట్టుపడులు రావడం లేదన్నారు. రీ మైగ్రేషన్ వల్ల గ్రామాల్లో ఆదాయం లేని  వాళ్ల సంఖ్య అధికమైందని యనమల ఆరోపించారు. డ్రగ్స్ ,మద్యం, దొంగ సంపాదనలను సీఎం ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు.  


10 లక్షల కోట్ల అప్పులు 


"ఏపీ పేరు చెబితే పెట్టుబడిదారుల కళ్లకు జగన్ కనిపించి భయపెడుతున్నారు.  జగన్ కక్ష అంతా ప్రజాస్వామ్యం, ప్రజల మీదే. ప్రపంచంలో ఉన్న నియంతలకు ఒక్కొక్కరికి ఒక్కో లక్షణం ఉంటే ఆ లక్షణాలు అన్నీ కలిపిన వ్యక్తి జగన్. జగన్ కు పరిపాలన రాదు ఎకానమీ అంటే ఏంటో తెలియదు. 10 లక్షల కోట్లు అప్పులు దిశగా ప్రభుత్వం వెళుతోంది. సంవత్సరానికి లక్ష కోట్లు అప్పులు చెల్లించడానికే సరిపోతాయి. ప్రతీ నెలా అప్పులు తెచ్చినా....అభివృద్ధి కనిపించడం లేదు. పెట్రోల్, డీజిల్ పై సబ్సిడీ ఇవ్వమని కేంద్రం చెప్పినా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. తూర్పు తీరంలో భూములు మొత్తం జగన్ కబ్జాలోకి వెళ్లిపోతున్నాయి. శ్రీకాకుళం నుంచి కృష్ణపట్నం వరకు భూములు అన్నీ సీఎం బినామీలు తీసుకుంటున్నారు. ఆధారాలతో సహా నిరూపించడానికి మేం సిద్ధం.  డైరెక్ట్ బెనిఫిట్ స్కీం కింద నేరుగా నిధులు ప్రజలకు చేరితే పేదరికం ఎందుకు పెరుగుతోంది. రాష్ట్రంలో విద్య, వైద్య రంగాలు దెబ్బతిన్నాయి. " - యనమల రామకృష్ణుడు  


వైసీపీది భస్మాసుర హస్తం 


వైసీపీది భస్మాసుర హస్తం అని యనమల రామకృష్ణుడు విమర్శించారు. తన చెయ్యి తన మీదే పెట్టుకుంటున్నారన్నారు. పవన్ కల్యాణ్, చంద్రబాబుపై దాడి అటువంటిదేనన్నారు. కాకినాడ తీరంలో బల్క్ డ్రగ్స్ పార్క్ నిర్మాణంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కు వెళతామని యనమల స్పష్టం చేశారు. అమెరికా, యూరప్ లో తొలగిస్తున్న ప్రమాదకర రసాయన పరిశ్రమలను ఇక్కడకు తరలిస్తున్నారని ఆరోపించారు. ప్రమాదకర పరిశ్రమల వల్ల ప్రజల ప్రాణాలు బలిపెడతామంటే అంగీకరించబోమన్నారు. 


ప్రధానికి ఆ బాధ్యత ఉంది 


రుషికొండ సహా విశాఖలో జరుగుతున్న దోపిడీని నియంత్రణ చేయాల్సిన బాధ్యత ప్రధానిపై ఉందని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు అన్నారు. విశాఖ పర్యటనకు వస్తున్న ప్రధాని మోదీకి ఇక్కడ పరిస్థితులను వివరించి చెప్పాల్సిన బాధ్యత బీజేపీ నాయకత్వంపై ఉందన్నారు.  తనపై దౌర్జన్యంగా తప్పుడు కేసులు పెట్టినప్పుడు మద్దతుగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను ఎండగట్టాలనే తాను మాట్లాడుతున్నానని అయ్యన్న అన్నారు. 


 ప్రధాని అపాయింట్మెంట్ కోరతాం 


విశాఖకు వస్తున్న ప్రధానమంత్రి అపాయింట్మెంట్ కోరతామని టీడీపీ అంటోంది. కేంద్రం నుంచి రావాల్సిన ప్రాజెక్ట్ లు, వైసీపీ ప్రభుత్వం దోపిడీ గురించి ప్రధాని దృష్టికి తీసుకుని వెళతామని టీడీపీ నేత బండారు సత్యన్నారాయణ మూర్తి తెలిపారు. ప్రధాని పర్యటన కోసం డేరాలు కట్టి వైసీపీ నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారని విమర్శలు చేశారు.