Case On Chandrababu : తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలులో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై కేసు నమోదైంది. చంద్రబాబుతోపాటు మాజీ మంత్రులు చినరాజప్ప, కేఎస్‌ జవహర్‌ తో సహా మొత్తం ఎనిమిది మంది నేతలపై కేసు నమోదు చేశారు పోలీసులు. మరో 1000 మంది కార్యకర్తలపై కేసు నమోదు చేసినట్లు తెలిసింది. డీఎస్పీ భక్తవత్సల ఫిర్యాదుపై కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా రోడ్‌షో నిర్వహించడమే కాకుండా పోలీసులతో దురుసుగా ప్రవర్తించారన్న అభియోగంపై ఈ కేసులు నమోదు చేసినట్లు సమాచారం. శుక్రవారం అనపర్తిలో జరిగిన రోడ్‌షో, బహిరంగ సభకు పోలీసులు అనుమతి రద్దు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులకు, కార్యకర్తలకు మధ్య భారీ తోపులాట జరిగింది. అడుగడుగునా పోలీసులు ఆంక్షలు విధించి చంద్రబాబును, టీడీపీ నాయకులను, కార్యకర్తలను అడ్డుకున్నారు. రోడ్డుకు అడ్డంగా ఏర్పాటు చేసిన బారికేడ్లను టీడీపీ కార్యకర్తలు తోసుకుంటూ ముందుకు వెళ్లారు. పోలీసుల ఆంక్షల మధ్య చంద్రబాబు ఏడు కిలోమీటర్లు నడిచి వెళ్లారు. చంద్రబాబు పాదయాత్రగా వెళ్తున్న సమయంలో అడుగడుగునా పోలీసులు అడ్డుతగలడంతోపాటు చంద్రబాబు ప్రసంగించిన వాహనాన్ని ముందుకు కదలనీయకపోవడంతో మరో వాహనంపై నుంచి ప్రసంగించారు. ఈ మొత్తం వ్యవహారంలో పోలీసులకు, టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది.  దీంతో చంద్రబాబుతోపాటు ఎనిమిది మంది టీడీపీ నేతలు, 1000 మంది కార్యకర్తలపై కేసులు నమోదు చేసినట్లు సమాచారం.  


పోలీస్ యాక్ట్, జీవో నెం.1 ఆంక్షలు


నిన్న అనపర్తిలో చంద్రబాబు చేసిన ఆరోపణలు, విమర్శలపై తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ సుధీర్ రెడ్డి స్పందించారు. జిల్లాలోని అనపర్తిలో ప్రతిపక్ష నాయకులు చంద్రబాబునాయుడు సభకోసం అనుమతి కావాలని కోరారు. కానీ పోలీస్‌యాక్ట్, జీవో నంబర్‌-1 అనుసరించి రోడ్డుపై ఎలాంటి బహిరంగ సభలకు అనుమతిలేదని, వచ్చిపోయే వాహనాలకు ఇబ్బంది కలగకుండా ర్యాలీ నిర్వహించుకోవచ్చంటూ  నిబంధనలను వారికి తెలియజేశాం అన్నారు. చంద్రబాబు రోడ్డుపై బహిరంగ సభకు ఏర్పట్లు చేస్తున్నారని తెలిసి వారికి మరోసారి రోడ్డుపై బహిరంగ సభకు అనుమతి లేదని తెలిపి సభను నిర్వహించుకునేందుకు అనుకూలంగా ఉండే రెండు బహిరంగ ప్రదేశాలను కూడా వారికి పోలీసు యంత్రాంగం సూచించిందని ఎస్పీ తెలిపారు. కళాక్షేత్రంతోపాటు, ఒక లే అవుట్‌లో బహిరంగ సభ నిరభ్యంతరంగా పెట్టుకోవచ్చని సూచించాం. అంతేకాకుండా తగిన భద్రతను కూడా కల్పిస్తామని వివరించినట్లు చెప్పారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడటంలో భాగంగా పోలీసులు ప్రతిపక్షనేత చంద్రబాబుకు, టీడీపీకి చేసిన విజ్ఞప్తిని తోసిపుచ్చారని ఎస్పీ తెలిపారు. పోలీసు సూచనలను చంద్రబాబు పట్టించుకోలేదని, నిషేధాజ్ఞలు ఉల్లంఘించి రోడ్డుపై సభ నిర్వహించారని చెప్పారు. పోలీస్‌యాక్ట్‌, జీవో-1 కు టీడీపీ నేతలు విరుద్ధంగా నడుచుకున్నారని.. ఈ ఘటనలో చట్టాలను, నిబంధనలను ఉల్లంఘించినందుకుగాను చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.  


 


గాయపడిన వారికి చంద్రబాబు పరామర్శ 


 నిన్నటి అనపర్తి సంఘటనలో గాయపడిన వారిని టీడీపీ అధినేత చంద్రబాబు పరామర్శించారు. అనపర్తి  చంద్రబాబు పర్యటనకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో పాదయాత్రగా చంద్రబాబు అనపర్తి చేరుకుని ప్రసంగించారు. ఈ సందర్భంగా జరిగిన తొక్కేసలాటలో గాయపడిన వారిని చికిత్స కోసం రాజమండ్రి సీడీఆర్ ఆసుపత్రికి తరలించారు. గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని శనివారం ఉదయం చంద్రబాబు పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన చంద్రబాబు ప్రభుత్వంపై, నిన్నటి సంఘటనపై విరుచుకుపడ్డారు. ముందు రోజు పర్మిషన్లు ఇచ్చి మరికొద్ది సేపట్లో పర్యటన ప్రారంభమవుతుండగా ఇబ్బందులకు గురి చేయడం పోలీసులకు సరికాదని, పోలీసులు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని  తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు. నిన్న ప్రకటించినట్టే అనపర్తి నుంచే సహకార నిరాకరణ చేపట్టామని చంద్రబాబు తెలిపారు. సైకో ముఖ్యమంత్రి పాలనలో ఈ రాష్ట్రానికి అధోగతి పట్టిందని సైకో పోవాలి సైకిల్ రావాలి అంటూ ఆయన వ్యాఖ్యానించారు.