East Godavari News : ధాన్యం కొనుగోలులో పెద్ద స్కామ్ జరుగుతోంది. ఈ మాటలు స్వయానా అధికార పార్టీ ఎంపీ ప్రస్తావించారు. దీంతో ఇప్పుడు ఏపీలో ఇదే హాట్ టాపిక్ గా మారింది. ఏపీలో రబీ కోతలు పూర్తి అయి ధాన్యం సేకరణ ప్రారంభమయింది. అయితే ఈ రబీ ధాన్యం కొనుగోలులో పెద్ద స్కామ్ జరుగుతోందని ఎంపీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ ఆరోపించారు. రాజమహేంద్రవరంలో బుధవారం జరిగిన తూర్పుగోదావరి జిల్లా డీఆర్‌సీ, నీటి సలహా కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మాట్లాడిన ఎంపీ సుభాష్ చంద్రబోస్ సంచలన ఆరోపణలు చేశారు. రైతుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని కొందరు రైస్ మిల్లర్లు నిలువుదోపిడీ చేస్తున్నారన్నారు. ఈ కుంభకోణం వెనుక రైస్ మిల్లర్లు, కొందరు అధికారులు ఉన్నారన్నారు. రైతుల దగ్గర దళారులతో తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేయించి, తర్వాత మిల్లరు ఓ  జాబితా తెచ్చి అధికారులకు ఇచ్చి అవే పేర్లతో ఆధార్‌కార్డు, బ్యాంక్‌ ఖాతాలు జతచేయిస్తున్నారన్నారు. ఉదాహరణకు ఒక రైతుకు నాలుగు ఎకరాలు ఉంటే 2 ఎకరాలు రైతు పేర చూపించి, మిగతా రెండు ఎకరాలు వేరే మండలాల్లోని వ్యక్తుల పేర్లతో నమోదు చేసి ఒక్కో బస్తాకు కనీసం రూ.200 దోచేస్తున్నారని ఎంపీ ఆరోపించారు.


17 వేల మంది వివరాలు లేవు 


ఈ దోపిడీపై తన దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయని ఎంపీ సుభాష్ చంద్రబోస్ స్పష్టం చేశారు. ఈ విషయాన్ని సీఎం జగన్‌ దృష్టికి తీసుకువెళ్తనన్నారు. సీబీసీఐడీతో విచారణ చేయిస్తే ఈ ధాన్యం స్కామ్ బయటపడుతుందన్నారు. కోనసీమ జిల్లాకు సంబంధించి కొన్ని ఆధారాలు తన దగ్గర ఉన్నాయని ఎంపీ అన్నారు. కాకినాడ జిల్లాలో కూడా ఈ తరహా మోసాలు జరుగుతున్నాయన్నారు. ఆ ఆధారాలు కూడా సేకరిస్తున్నానని పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ఈ మోసాలపై ఏమైనా ఫిర్యాదులు వచ్చాయా అని ఎంపీ అధికారులను ప్రశ్నించారు. తూర్పుగోదావరి జిల్లా వ్యవసాయాధికారి మధుసూదన్‌ స్పందిస్తూ ఈ క్రాప్‌ ద్వారా నమోదైన రైతుల పేర్లతో రైతు భరోసా కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. జిల్లాలో 17 వేల మంది వివరాలు లభించడంలేదన్నారు. వెంటనే ఎంపీ సుభాష్ చంద్రబోస్ జోక్యం చేసుకుని ఆ పేర్లు ఏమైనట్లు అని ప్రశ్నించారు. వీటిని రైస్ మిల్లర్లు తప్పుడు పేర్లతో తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేసి ఓ జాబితా అధికారులకు ఇస్తారన్నారు. 



(ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ) 


ఒక్క ఫిర్యాదు కూడా అందలేదు : జేసీ శ్రీధర్ 


ఈ ధాన్యం కుంభకోణం బయటపడాలంటే ప్రతి గ్రామంలో ఎవరు ఎంత ధాన్యం విక్రయించారో చాటింపు వేసి ఆరా తీయాలని ఎంపీ అన్నారు. ఎంపీ ఆరోపణలపై స్పందించిన జేసీ సీహెచ్‌ శ్రీధర్‌ మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పటి వరకూ ఒక్క ఫిర్యాదు కూడా రాలేదన్నారు. ఆర్బీకేల ద్వారా ఎలా అమ్ముకోవాలో రైతులకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ఎంపీ బోసు వాదనను టీడీపీ ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు సమర్థించారు. ఈ సమావేశంలో మంత్రులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, తానేటి వనిత, ఎంపీ మార్గాని భరత్‌, ఎమ్మె్ల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు పాల్గొన్నారు.