Mahasena Rajesh : తూర్పుగోదావరి జిల్లాలో జనసేనకు వింత అనుభవం ఎదురైంది. ఇన్నాళ్లు జనసేనకు మద్దతుగా ఉన్న మహాసేన రాజేష్ ఆ పార్టీకి షాక్ ఇచ్చారు. ఎలాగూ జనసేన టీడీపీతో పొత్తుపెట్టుకుంటుందని ముందే ఊహించిన ఆయన... టీడీపీలోకి జంప్ అవుతున్నారు. ఇప్పటికే టీడీపీ సీనియర్ నేతలతో భేటీ అయిన ఆయన పార్టీలో చేరడంపై చర్చించారు. టీడీపీ కీలక పదవి ఇచ్చేందుకు చంద్రబాబు సుముఖంగా ఉన్నాయని, పార్టీలో చేరితే మంచిదని రాజేష్ టీడీపీ నేతలు చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై జనసేన నేత నాగబాబు స్పందించారు. మహాసేన రాజేష్ గురించి జనసైనికులు తప్పుగా మాట్లాడకండని, ప్రజాస్వామ్యంలో ఎవరు ఏ పార్టీలో అయినా చేరవచ్చన్నారు. అది ఆయన ఇష్టమని నాగబాబు ట్వీట్ చేశారు.
చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరిక
మహాసేన రాజేష్ టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. చంద్రబాబు సమక్షంలో పెద్దాపురంలో ఆయన టీడీపీ కండువా కప్పుకోనున్నట్లు వెల్లడించారు. జనసేన పార్టీలో చేరాలని భావించామని, కానీ టీడీపీ నేతల నుంచి ఫోన్ రావడంతో వారి సూచన మేరకు ఆ పార్టీలో చేరుతున్నట్లు రాజేష్ తెలిపారు. 2018లోనే టీడీపీలో చేరాలని భావించామని కానీ కొందరు అడ్డుపడ్డారని రాజేష్ తెలిపారు. గతంలో వైఎస్సార్‌సీపీకి మద్దతు ఇవ్వడానికి కొన్ని కారణాలు ఉన్నాయన్నారు. అనంతరం మహాసేన చేసిన పోరాటాలకు టీడీపీ, జనసేన మద్దతుగా నిలిచాయన్నారు. 2018లోనే చంద్రబాబును కలిశానని, కానీ ఓ నేత టీడీపీలోకి రాకుండా అడ్డుపడ్డారని రాజేష్ చెప్పుకొచ్చారు. దీంతో ఆ సమయంలో వైఎస్ జగన్ పిలవడంతో ఇష్టం లేకుండానే వైసీపీలో చేరామన్నారు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితులు మారిపోయాయని, దళితులకు జరుగుతున్న అన్యాయంపై పోరాటాలు చేయడంతో తమపై కేసులు పెట్టి వేధించారన్నారు.
టీడీపీ-జనసేన పొత్తు కుదిరే అవకాశం
మహాసేన కష్టాల్లో ఉన్నప్పుడు టీడీపీ, జనసేన మద్దతుగా నిలిచాయని రాజేష్ తెలిపారు. టీడీపీలో జాయిన్ అవ్వాలని భావించిన ఓ రాష్ట్ర స్థాయి నేత అడ్డుపడడంతో కుదరలేదని, దీంతో జనసేనకు దగ్గరయ్యామన్నారు. జనసేన చేపట్టిన కొన్ని కార్యక్రమాలకు ఆ పార్టీ ఆహ్వానం మేరకు హాజరయ్యానని రాజేష్ గుర్తు చేశారు. జనసేన పార్టీ కోసం కష్టపడదామని సిద్ధమయ్యామని, కానీ పరిస్థితులు మారిపోయాయన్నారు. దీంతో 2022 డిసెంబర్ 8న అంబేడ్కర్ కాంగ్రెస్ పార్టీ పేరుతో కొత్త పార్టీ పెట్టాలని నిర్ణయించామన్నారు. జనసేన ప్రస్తుతం బీజేపీతో పొత్తులో ఉందని, భవిష్యత్తులో టీడీపీతో జతకడితే బీజేపీ ఎంపీ సీట్లు అడుగుతుందని సమాచారం ఉందన్నారు. టీడీపీ కూడా జనసేన పార్టీతో పొత్తు పెట్టుకునే యోచనలో ఉంది కాబట్టి ఆ పార్టీలో చేయాలని చేరాలని నిర్ణయించుకున్నామన్నారు. టీడీపీ నేతలు తనకు ఫోన్ చేసి పార్టీలోకి ఆహ్వానించినట్లు మహాసేన రాజేష్ చెప్పుకొచ్చారు. తనను గతంలో వ్యతిరేకించి నేతలో మార్పు వచ్చిందని ఆయన మహాసేనను తప్పుగా అర్థం చేస్తున్నారని ఫీలయ్యారన్నారు. మహాసేన అగ్ర వర్ణాలకు వ్యతిరేకంగా మాట్లాడిందని అనుకున్నారని, పూర్తి సమాచారం తెలియక మాట్లాడామని ఆ నేత చెప్పారన్నారు.
జనసేన నుంచి ఆహ్వానం రాలేదు
జనసేనలో చేరడానికి సిద్ధమైనా, టీడీపీ నేతల మాటలను బట్టి ఆ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నామని మహాసేన రాజేష్ తెలిపారు. జనసేనకు దగ్గరయ్యాం కాబట్టి ఆ పార్టీలో చేరాలని భావించామని కానీ జనసేన పార్టీ ఎప్పుడూ తనను పార్టీలోకి ఆహ్వానించలేదని తెలిపింది. పొత్తులపై స్పష్టత వచ్చిన తర్వాత రాజేష్ ను పార్టీలోకి తీసుకుందామని జనసేన అగ్రనేతలు భావించినట్లు తెలిసిందన్నారు. మహాసేన ఎప్పుడూ సీట్లు గురించి ఆలోచించలేదని, కానీ వారి నిర్ణయాన్ని గౌరవించాలన్నారు. ఈ పరిణామాల మధ్య తమ నిర్ణయాన్ని మార్చుకుని టీడీపీ చేరాలని భావించినట్లు మహాసేన రాజేష్ స్పష్టం చేశారు.