రాష్ట్ర వ్యాప్తంగా ఆశా కార్యకర్తలు కదంతొక్కారు. కోవిడ్‌ సమయంలో మృతిచెందిన ఆశా కార్యకర్తల కుటుంబాలను ఆదుకోవాలన్న డిమాండ్‌ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల వద్ద ఆందోళనకు దిగారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ కలెక్టరేట్‌ వద్ద ఆశా కార్యకర్తల నిరసన ఉద్రిక్తంగా మారింది. ఆశా కార్యకర్తలను కలెక్టరేట్ లోనికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, ఆశా కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో బారికేడ్లను తోసుకుని ఆశా కార్యకర్తలు ముందుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ సమయంలో పోలీసులు, ఆశా కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. తోపులాటలో ఓ ఆశా కార్యకర్త స్పృహతప్పి పడిపోయింది. దీంతో ఆమెను స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. శాంతియుతంగా నిరనస చేస్తున్న తమను ముందుకు వెళ్లనీయకుండా అడ్డుకుని, లాఠీలతో కొట్టారని ఆశా కార్యకర్తలు ఆవేదనం చెందారు. పోలీసులు ఆశా కార్యకర్తలను అరెస్టు చేసి పోలీసు స్టేషన్ లకు తరలించారు. పోలీసుల తీరును ఆశా కార్యకర్తలు తీవ్రంగా తప్పుబట్టారు. హక్కుల కోసం పోరాడుతుంటే అరెస్టులు చేస్తారా అని ప్రశ్నించారు. 


ప్రభుత్వం ఇప్పటికైనా ఆదుకోవాలి 


తమ సమస్యల పరిష్కరించాలని ఆశా వర్కర్లు గత కొంత కాలంగా నిరసనలు చేస్తున్నారు. రాష్ట్ర ఆశావర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పలుమార్లు కలెక్టరేట్ల ముట్టడి చేపట్టారు. తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, ఇతర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. పనిభారాన్ని తగ్గించాలని, సంబంధం లేని పనులు చేయించకూడదని కోరారు. ఆశాలకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని, వేతనంతో కూడిన మెటర్నిటీ సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమకు గౌరవ వేతనం అందించాలని, అధికారుల బెదిరింపులు, వేధింపులు ఆపాలని ఆశా కార్యకర్తలు ఎప్పటి నుంచో డిమాండ్‌ చేస్తున్నారు. పని భారం పెరిగి ఒత్తిడికి గురవుతున్నామని ఆశా వర్కర్లు అంటున్నారు. ప్రభుత్వం తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని లేకపోతే పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తామంటున్నారు. కోవిడ్ సమయంలో ప్రాణాలకు తెగించి పని చేశామని, కొంత మంది ప్రాణాలు వదిలారని వారి కుటుంబాలని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. 


ఆశాల వర్కర్ల అరెస్టులు 


ఏజెన్సీ ప్రాంతంలో పనిచేస్తున్న ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమయ్యిందని ఆశా వర్కర్లు ఆరోపిస్తున్నారు. తమ సమస్యల పరిష్కారం కోరుతూ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లు కలెక్టరేట్ల ఎదుటు ఆందోళన చేపట్టారు. తమపై పని ఒత్తిడి తగ్గించాలని, రిఫరల్ కేసులకు టీఏ, డీఏ వర్తింపజేయాలని, వేతనంతో కూడిన సెలవులు ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఆశా వర్కర్ విధి నిర్వహణలో మరణిస్తే కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన నిరసనలు కొన్ని చోట్ల ఉద్రిక్తంగా మారాయి. ఆశా వర్కర్లను పోలీసులు అరెస్టు చేశారు.