Dwarampudi Chandra Shekar: వారాహి యాత్రలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ తనపై చేసిన తీవ్ర విమర్శలపై కాకినాడ అర్బన్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి స్పందించారు. పవన్ రాజకీయ వ్యభిచారి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పార్టీ పెట్టినప్పుడు ఉన్న ఏ ఒక్కరైనా ఇప్పుడు నీతో ఉన్నారా అని ప్రశ్నించారు. పవన్ తనపై చేసిన అసత్య ఆరోపణలను నిరూపించాలని కోరారు. అలాగే ప్రజలకు తనకు మద్దతు ఇచ్చి రెండు సార్లు గెలిపించారని.. అదే పవన్ కల్యాణ్ పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓడించారని గుర్తు చేశారు. దీన్ని బట్టే జనాలు ఎవర్ని విమర్శిస్తున్నారో అర్థం అవుతుందంటూ చెప్పారు. అలాగే ఇంటిపై దాడి చేయడానికి వస్తే ఎలా ఊరుకుంటామని అడిగారు.
జనసేనలో ఉన్న వీర మహిళలు అంతా నటులే అంటూ విమర్శలు చేశారు. తుపాకీతో బెదిరింపులకు పాల్పడింది పవన్ కల్యాణ్ యేనని.. నీ కూతురే నీ మీద పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం మర్చిపోయావా అంటూ చురకలంటించారు. అలాగే 14 ఏళ్లు సీఎంగా ఉండి రౌడీలు, గూండాలను పెంచి పోషించిన నారాసురుడు చంద్రబాబు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తనకు ప్రాణహాని ఉందంటూ చేసిన కామెంట్లపై మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు. జనసేనాని కావాలనే అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజంగానే ఆయనకు ప్రాణ హాని ఉంటే ఈపాటికే పోలీసులకు ఫిర్యాదు చేసేవాడని వివరించారు. అలాగే పవన్ కల్యాణ్ కు తమవల్ల ప్రాణహాని లేదని.. చంద్రబాబు వల్ల ఉందని ఆరోపించారు. పవన్ కల్యాణ్ సినిమాల్లో తప్ప బయట ఎవరినీ కొట్టలేరని అన్నారు. తన దగ్గర పని చేసే సిబ్బందిని తప్ప ఎవరిపై కూడా చేయి చేసుకోలేరని చెప్పారు.
అరాచక పాలన సాగించిన టీడీపీ అధినేత చంద్రబాబును పవన్ కల్యాణ్ ఏరోజు అయినా కొట్టాడా అని ప్రశ్నించారు. అలాగే లోకేష్ అవినీతి పరుడు అని పవన్ కల్యాణ్ యే నేరుగా ఆరోపించారని గుర్తు చేశారు. కానీ అప్పుడు ఆయనను కొట్టగలిగాడా అని అడిగారు. పవన్ కల్యాణ్ ది రౌడీ మనస్తత్వం అని అందుకే అలా మాట్లాడుతున్నాడంటూ ఫైర్ అయ్యాడు. చంద్రబాబుతో పొత్తు అనగానే పవన్ వెనకాల కాపులు తిరగడం మానేశారని అన్నారు. ఎన్నికల ముందు పవన్ కల్యాణ్, చంద్రబాబు కలవడం ఖాయమని పేర్ని నాని తెలిపారు.