Chandrababu Pulivendula Tour :  తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు పులివెందుల పర్యటన సందర్భంగా స్వల్ప ఉద్రిక్తత ఏర్పడింది. పట్టణంలో పలు చోట్ల టీడీపీ నేతలు ర్యాలీలు నిర్వహించారు. చంద్రబాబు జమ్మల మడుగు నుంచి పట్టణంలోకి వచ్చే ముందుగా .. టీడీపీ కార్యకర్తల ర్యాలీలోకి ఓ వాహనం వచ్చింది. హఠాత్తుగా ఆ వాహనం  ఓపెన్ టాప్ నుంచి కొంత మంది యువకులు పైకి లేచి వైసీపీ జెండాలను ఊపారు. దీంతో టీడీపీ కార్యకర్తలు వాహనంపై దాడికి ప్రయత్నించారు. అయితే వాహనాన్ని వేగంగా అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు. వాహనం నుంచి జారిపడిన వైసీపీ జెండాను టీడీపీ కార్యకర్తలు తగులబెట్టారు. పోలీసులు పరిస్థితిని చక్కదిద్దారు.                    


వైసీపీ కార్యకర్తలు ఉద్దేశపూర్వకంగా ఉద్రిక్తతలు సృష్టించేందుకు ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.   పులివెందుల రోడ్ షో, బహిరంగ సభల కోసం ప్రత్యేకంగా టీడీపీ పోలీసులను అనుమతి కోరింది. కానీ అనుమతిపై పోలీసులు ఎటూ తేల్చడం లేదు. అయితే చంద్రబాబు పర్యటన విజయవంతం చేసి తీరుతామని పులివెందుల టీడీపీ ఇన్‌చార్జి బీటెక్ రవి స్పష్టం చేశారు. పులివెందుల నడిబొడ్డున బహిరంగసభ , రోడ్ షోలకు అనుమతులు లేకున్నా.. ఎలాంటి సమస్యలు వుండవని అనుకుంటున్నామన్నారు. ఒకవేళ వైసీపీ శ్రేణులు కవ్వింపు చర్యలకు పాల్పడినా, ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేసినా.. ఎలా ఎదుర్కొవాలో తమకు తెలుసన్నారు. ఎవరెన్ని చేసినా.. ఎలాగైనా సరే పులివెందుల చంద్రబాబు పర్య టనను విజయవంతం చేసి తీరుతామని ప్రకటించారు. పూల అంగళ్ల సెంటర్లలో కాకుండా.. వేరే చోట సభ పెట్టుకోవాలని టీడీపీ నేతలకు పోలీసులు సూచించారు.                                            


పులివెందులలోని పూలంగళ్ల సర్కిల్‌లో చంద్రబాబు బహిరంగ సభకు పోలీసులు అభ్యంతరం తెలిపారు. సర్కిల్‌కు కొద్ది దూరంలో.. వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద సభను మార్చుకోవాలని పోలీసులు చెప్పారు. పోలీసుల ఒత్తిడితో పూలంగళ్ల సర్కిల్ నుంచి మైక్ సెట్స్, సెటప్‌ను వెంకటేశ్వర ఆలయం వద్దకు టీడీపీ మార్చింది. వైసీపీ నేతలు, అధికారుల ఒత్తిడితోనే చంద్రబాబు సభకు పోలీసులు ఇబ్బందులు పెడుతున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.                      


పులివెందుల సీఎం జగన్ నియోజకవర్గం కావడంతో.. అక్కడ సభను విజయవంతం చేసేందుకు టీడీపీ నేతలు పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నారు. ఇటీవల గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీగా గెలిచిన భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి నియోజకవర్గం పులివెందులే.  దీంతో ఆయన కూడా ప్రతిష్టాత్మకంగా సభను తీసుకున్నారు. పెద్ద ఎత్తున జన సమీకరణ చేశారు. వచ్చే ఎన్నికల్లో పులివెందుల నుంచి పోటీ చేయనున్న  బీటెక్ రవి తన బలాన్ని ప్రదర్శించాలనుకుంటున్నారు. దీంతో పులివెందుల మొత్తం టీడీపీ కార్యకర్తలతో నిండిపోయింది.