Anantapuram TDP : ముందుగానే  మేనిఫెస్టో ప్రకటించి ప్రజల్లోకి వెళ్తున్న టీడీపీకి జిల్లాల్లో విబేధాలు సమస్యలుగా మారుతున్నాయి. అనంతపురం జిల్లాలో నేతల మధ్య సమస్యలు మరింత ఎక్కువయ్యాయి. బస్సుయాత్రలను కూడా క్యాన్సిల్ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.దంతో జిల్లాలో కొనసాగుతున్న వివాదాలపై టిడిపి అధిష్టానం సీరియస్‌గా దృష్టి సారించినట్టు తెలుస్తోంది. గొడవులు జరుగుతున్న నియోజకవర్గాల్లోని నేతలను త్వరలో అమరావతికి పిలిపించనున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 


బస్సు యాత్రకు బ్రేకులు


ఉమ్మడి అనంతపురం జిల్లాలో 23వ తేదీన భవిష్యత్తుకు బస్సుయాత్ర ప్రారంభమైంది. ప్రారంభమైనప్పటి నుంచి కొన్ని నియోజకవర్గాల్లో పార్టీలోని అంతర్గత విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. ఎన్నికలు సమీస్తున్న తరుణంలో జరుగుతున్న పరిణామాలు చర్చనీయాంశమవుతోంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో పెనుకొండ, కళ్యాణదుర్గం, మడకశిర, శింగనమల నియోజకవర్గాల్లో విభేదాలు ఎక్కువయ్యాయి.  పెనుకొండ, కళ్యాణదుర్గం నియోజకవర్గాల్లో బస్సుయాత్ర పూర్తయ్యింది. ఈ రెండు చోట్ల కూడా నాయకులు బాహాటంగానే ఘర్షణకు దిగి కొట్టుకున్నారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి, నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఉమామహేశ్వర నాయుడులు రెండు గ్రూపులుగా విడిపోయి కొట్టుకున్నారు. జిల్లా నేతల ముందే ఇవి జరుగుతున్నా వాటిని పుల్‌స్టాప్‌ పెట్టే ప్రయత్నంగాని, నిలువరించే చర్యలుగాని చేపట్టలేకపోయారు. 


కొన్ని నియోజకవర్గాల్లో బస్సు యాత్ర రద్దు 


మడకశిర నియోజకవర్గంలో బస్సుయాత్రనే రద్దు చేశారు. ఇక శింగనమల నియోజకవర్గంలో ఇంకా యాత్ర జరగాల్సి ఉంది. ఇక్కడ ఏమి జరుగుతుందోనని చర్చ ఆ పార్టీ శ్రేణుల్లో నెలకొంది. అంతకుమునుపు లోకేశ్‌ పాదయాత్ర సమయంలోనే నాయకుల మధ్య విభేదాలు పొడచూపిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ యాత్రలో ఏమి జరుగుతుందోనన్న గుబులు ఆ పార్టీ శ్రేణుల్లో నెలకొంది. ఇలా విభేదాలు రచ్చకెక్కుతుండటంతో అధిష్టానం దృష్టి సారించింది. ఈ నియోజకవర్గాల్లోని నాయకులతోపాటు, ముఖ్య నాయకులతో వచ్చే వారంలో ప్రత్యేకమైన సమావేశం ఏర్పాటు చేసింది. విభేదాలతో రచ్చకెక్కుతున్న నేతలకు ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి అధినాయకుడు చంద్రబాబునాయుడు క్లాస్‌ పీకనున్నట్టు సమాచారం. 


గతంలో ఎన్ని సార్లు సర్దిచెప్పినా మారని నేతలు 


పార్టీ ప్రతిపక్షంలో ఉండి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ నేతల తీరులో మార్పు రాకపోవడంపై ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తోంది. ఇదివరకే అనేక మార్లు నేతలకు సర్ధిజెప్పే ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోవడంతో ఈసారి జరిగే సమావేశంలో ఎటువంటి నిర్ణయాలు చేస్తారన్నది పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.  ఎన్నికలు కొన్ని నెలల్లో ఉన్న సమయంలో ఇప్పటికైనా అందరినీ సమన్వయం చేసుకుని ముందుకెళ్లాల్సిన సమయంలో ఇదేతీరున కొనసాగడం పార్టీ క్షేత్ర స్థాయి నేతల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. అధిష్టానం సీరియస్‌గా దృష్టి సారించి వీటిని పుల్‌స్టాప్‌ పెట్టే విధంగా చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ కార్యకర్తలు కోరుతున్నారు.