పెగాసస్ స్పైవేర్ అంశంపై చర్చ జరగాలని అసెంబ్లీలో వైఎస్ఆర్‌సీపీ సభ్యులు డిమాండ్ చేశారు. అసెంబ్లీ ప్రారంభమైన తర్వతా పెగాసస్‌పై చర్చకు ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి నోటీసు ఇచ్చారు. స్వల్ప కాలిక చర్చ చేపడతామని స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. బెంగాల్ సీఎం వ్యాఖ్యలను ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రస్తావించారు. పెగాసస్ అంశాన్ని సుప్రీంకోర్టు సీరియస్‌గా తీసుకుందన్నారు. పెగాసస్‌పై కమిటీ వేసి సుప్రీం దర్యాప్తు చేపట్టిందన్నారు. చంద్రబాబు హయాంలోనే పెగాసస్‌ను వాడారని బెంగాల్ సీఎం చెప్పారని బుగ్గన సభ దృష్టికి తీసుకెళ్లారు., పెగాసస్ సాప్ట్‌వేర్ ద్వారా ఫోన్లు ట్యాపింగ్ చేసే అవకాశముందన్నారు. పెగాసస్‌పై చర్చించి కమిటీకి రిపోర్ట్ చేయాల్సి బాధ్యత ఉందని మంత్రి అన్నారు.
పెగాసస్‌పై ప్రజలకు వాస్తవాలి తెలియాలి : అంబటి రాంబాబు
పెగాసస్ వ్యవహారంపై ప్రజలకు అన్ని విషయాలు తెలియాలని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. చంద్రబాబు హయాంలో పెగాసస్ సాఫ్ట్‌వేర్ ఉపయోగించారని బెంగాల్ అసెంబ్లీలో సీఎం మమత తెలిపారన్నారు. పెగాసస్ వ్యవహారంలో తమకు సంబంధం లేదని టీడీపీ నేతలు బుకాయిస్తున్నారని విమర్శించారు. వాస్తవాలు లేకుండా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రకటించరు కదా? అని అన్నారు. పెగాసస్ స్పైవేర్ అంశంపై విచారణ జరగాలని తెలిపారు. విచారణ జరిపితేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని తెలిపారు.
వైఎస్సార్‌సీపీని దెబ్బతీసేందుకు చంద్రబాబు కుట్ర చేశారని అంబటి రాంబాబు అన్నారు. చంద్రబాబు హయాంలోని ఓ ఇంటెలిజెన్స్ చీఫ్ పోలీసు అధికారిలా పని చేయలేదని .. పచ్చచొక్కా వేసుకున్న టీడీపీ నేతలా వ్యవహరించారని విమర్శించారు. పెగాసస్‌ను ప్రత్యర్థి రాజకీయ నేతలపై ఉపయోగించారని అన్నారు. వైఎస్సార్‌సీపీ నేతలందరీ ఫోన్లను ట్యాప్ చేశారని ఆరోపించారు. సహచరులైన బీజేపీ నేతలపైనా కూడా పెగాసన్ ఉపయోగించారని తెలిపారు. చంద్రబాబు ఎవరికోసం పెగాసస్ కొన్నారో తేల్చాలని డిమాండ్ చేశారు.
ఎవరు కొన్నారో తేలాల్సి ఉందన్న ఆదిమూలపు సురేష్ !
పెగాసస్ కొనాలని తమ వద్దకు వచ్చినట్లు నాటి ఐటీ మంత్రి లోకేషే చెప్పారని.. పెగాసస్‌పై చర్చ జరగాల్సిన అవసరం ఉందని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ఇప్పటికే సుప్రీంకోర్టు విచారణకు కమిటీ వేసిందన్నారు. దీన్ని ఎవరు కొన్నారు.. ఎలా వినియోగించారు అనేది తేలాల్సి ఉందని మంత్రి స్పష్టం చేశారు.
వాస్తవాలు తెలియకుండా మమతా బెనర్జీ మాట్లాడరు కదా : గుడివాడ అమర్నాథ్
వాస్తవాలు లేకుండా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఈ విషయంపై మాట్లాడరు కదా అని మరో ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యానించారు. చంద్రబాబు హయాంలో పెగాసస్ సాఫ్ట్‌వేర్ ఉయోగించారని అన్నారు. బెంగాల్ అసెంబ్లీలో సీఎం మమతా తెలిపారని గుర్తుచేశారు. చంద్రబాబు అనైతిక రాజకీయవేత్త అని అన్నారు. పెగాసస్ స్పైవేర్‌పై సమగ్రమైన విచారణ జరగాలని అన్నారు. తేలుకుట్టిన దొంగలా చంద్రబాబు ఉన్నారని అన్నారు. సీఎం మమతా ఆరోపణలపై టీడీపీ నేతలు ఎందుకు మాట్లాడరు? అని సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు ఒక్కసారైనా సొంతంగా అధికారంలోకి వచ్చారా? అని ప్రశ్నించారు.