YSRCP News :  మచిలీపట్నం పోర్ట్ అభివృద్ధి కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్‌ రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి దయాసాగర్ ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన ఎవరో కాదు మాజీ మంత్రి మేకతోటి సుచరిత భర్త. సీఎం జగన్ మంత్రివర్గంలో దాదాపుగా మూడేళ్ల పాటు కీలకమైన హోంశాఖను నిర్వహించిన సుచరిత పదవిని తర్వాత తీసేశారు. దాంతో ఆమె అసంతృప్తికి గురయ్యారు. ఓ దశలో పార్టీకి కూడా రాజీనామా చేశారన్న ప్రచారం జరిగింది.  తన భర్త పార్టీ మారితే ఆయనతో పాటు వెళ్తానని ఓ సమావేశంలో సుచరిత చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. తర్వాత వైసీపీ హైకమాండ్ బుజ్జగించడంతో  అసంతృప్తి వ్యాఖ్యలు చేయడం లేదు. 


సుచరిత భర్తకు హఠాత్తుగా రెండేళ్ల పదవి కాలంతో  పోస్ట్                                        


హఠాత్తుగా ఆమె భర్త దయా సాగర్‌కు జగన్ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇచ్చింది. మచిలీపట్నం పోర్ట్ అభివృద్ధి కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమించింది. ఈ మేరకు మౌలిక వసతులు, పెట్టుబడుల మంత్రిత్వ శాఖ ముఖ్య కార్యదర్శి కరికాల వలవేన్ ఉత్తర్వులు జారీ చేశారు. రెండు సంవత్సరాల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. ప్రస్తుతం మచిలీపట్నం పోర్ట్ అభివృద్ధి కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్‌గా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలను నిర్వర్తిస్తోన్న డాక్టర్ వై విద్యా శంకర్‌ను రిలీవ్ చేశారు. ఆయన స్థానంలోో దయా సాగర్‌ను నియమించారు. 1992 బ్యాచ్‌కు చెందిన ఐఆర్ఎస్ అధికారి దయాసాగర్. 2022లో పదవీ విరమణ చేశారు.  


ఇటీవలే ప్రారంభమైన మచిలీపట్నం పోర్టు                                 


మచిలీపట్నం పోర్ట్ నిర్మాణాన్ని వై ఇటీవలే   ప్రారంభించారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తొలి రోజుల్లోనే అంటే 2020 ఫిబ్రవరి 4వ తేదీన జగన్ ప్రభుత్వం.. స్పెషల్ పర్పస్ వెహికల్ కింద మచిలీపట్నం పోర్టు డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ఏర్పాటు చేసింది.  తొలి విడతలో 5,156 కోట్ల రూపాయలతో పోర్టు నిర్మాణానికి పరిపాలన అనుమతులను జారీ చేసింది. అయితే దయాసాగర్ కు పదవి ఇవ్వడానికి  వారు పార్టీ మారకుండా చేయడానికేనని వైసీపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 


టీడీపీ టిక్కెట్ కోసం ప్రయత్నిస్తున్నారని ప్రచారం                              


దయాసాగర్ .. ఐఆర్ఎస్ ఆఫీసర్‌గా.. విజయవాడలో పోస్టింగ్ తెచ్చుకున్నారు. కానీ వైసీపీ ముఖ్యలే ఇక్కడ ఉండకుండా మధ్యప్రదేశ్ కు బదిలీ చేయించారన్న  ప్రచారం జరిగింది. అక్కడ డ్యూటీలో చేరి పదవి విరమణ చేసి ఏపీకి వచ్చేశారు దయాసాగర్. వచ్చినప్పటి నుండి ఆయన టీడీపీలో బాపట్ల ఎంపీ టిక్కెట్ కోసం ప్రయత్నిస్తున్నట్లుగా ప్రచారం జరిగింది. టీడీపీతో చర్చలు జరుపుతున్నట్లుగా క్లారిటీ రావడంతో ముందుగా పదవి ఇచ్చి సర్దుబాటు చేశారని భావిస్తున్నారు.