AP Minister Venugopala Krishna Chamber Was Not Locked: 
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు ఆలస్యంగా ఇస్తోందని, కొన్ని చోట్ల నెలల తరబడి వేతనాలు అందడం లేదని మంత్రి పేషికి తాళం అంటూ ప్రచారం జరిగింది. జీతాలు అందడం లేదని ఏపీ బీసీ సంక్షేమం, సమాచార, సినిమాటోగ్రఫీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ పేషీకి ఉద్యోగులు తాళం వేసి వెళ్లిపోయారని జరిగిన ప్రచారంలో వాస్తవం లేదని అధికారులు స్పందించారు. ఉద్యోగులు మంత్రి చాంబర్ కు ఈరోజు కాస్త ఆలస్యంగా వచ్చారని, కానీ జీతాలు రాకపోవడంతో తాళాలు వేసిన ఉద్యోగులు అని దుష్ప్రచారం జరిగిందని మంత్రి పేషీ స్పందించింది.

  


మంత్రి పేషీలో పనిచేస్తున్న ఉద్యోగులు రోజు మాదిరిగానే విధులకు హాజరయ్యారు. కానీ సోమవారం ఉద్యోగులు కాస్త ఆలస్యంగా రావడంతో పేషీకి తాళాలు కనిపించాయి. అయితే అభూత కల్పనతో కొన్ని మీడియా ఛానల్స్ మంత్రి పేషికి తాళలు అంటూ అవాస్తవాలను  ప్రచారం చేశాయని పేషీ అధికారులు స్పష్టం చేశారు. పేషిలో పనిచేస్తున్న ముగ్గురు అటెండర్లలో ఇద్దరు వ్యక్తిగత కారణాలతో సెలవులో ఉండటం మిగిలిన ఒక్క అటెండర్ వచ్చే సమయం ఆలస్యం కావడం. దాంతో పేషీ ఆలస్యంగా తెరవడం జరిగిన వాస్తవం అని పేర్కొన్నారు.


నేడు యథావిధిగా డ్యూటీ చేసిన పేషీ సిబ్బంది 
ప్రతిరోజు లాగానే నేడు పేషీలో ఓఎస్డీ, పీఆర్ఓలు, అటెండర్లు హాజరయ్యారు. యథాతథంగా తమ విధులలో పాల్గొని మంత్రి చెల్లుబోయిన పేషీకి వచ్చే వారి నుండి అభ్యర్థనలు, అర్జిలను అందింపుచుకుంటూ డ్యూటీ చేశారు. కానీ ఉన్న వాస్తవాలను కప్పిపుచ్చి ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమంలో భాగంగా కొందరు మీడియాకు సైతం తప్పుడు సమాచారం అందించారని, సోషల్ మీడియాలోనూ వదంతులు ప్రచారం జరిగాయని పేషీ అధికారులు తెలిపారు. జీతభత్యాలు విషయంలో ఎటువంటి లోటుపాట్లు లేవని ప్రజలకు అవాస్తవ సమాచారం ఇచ్చి ప్రభుత్వం మీద బురదజల్లే ప్రయత్నంలో భాగంగా జరిగిన ప్రచారం అని మంత్రి పేషీ ఈ వార్తను ఖండించింది.


వారంతా మంత్రి నియమించుకున్న వారే !  
మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ పేషీలో పని చేసే వారంతా ఆయనకు బాగా సన్నిహితులే అయి ఉంటారు. పర్మినెంట్ ఉద్యోగులు కాకుండా ఇతరుల్ని మంత్రి కాంట్రాక్ట్ పద్దతిలో నియమించుకుంటారు. వీరు అలా నియమితులైన వాళ్లేనని తెలుస్తోంది. అయితే మంత్రి నియమించిన వ్యక్తులే ఉద్యోగులైతే వారు ఆయనతో చర్చిస్తారు కానీ మంత్రి చాంబర్ కు తాళాలు లాంటివి ఎందుకు వేస్తారు అని కూడా వాదన వినిపించింది. అయితే ఏడు నెలలుగా జీతాలివ్వకపోవడంతో పేషీలో పనిచేసే ఉద్యోగులు, సిబ్బంది తాళాలేసి ఊరికి వెళ్లిపోయినట్లుగా ప్రచారం జరిగింది. 


జీతాలివ్వడం లేదని ఇటీవలే ముగ్గురు ఆత్మహత్యాయత్నం
ఏపీలో కాంట్రాక్ట్ సిబ్బంది జీతాలకు ఇబ్బంది పడుతున్నారని ఏదో చోట తరచుగా వినిస్తోంది. కొద్ది రోజుల కిందట స్కిల్ డెలవప్ మెంట్ శాఖలో జీతాలు ఇవ్వలేదని ముగ్గురు ఉద్యోగులు ఆత్మహత్యాయత్నం చేయడం కూడా సంచలనం సృష్టించిది. ఈ క్రమంలో జీతాలు అందడం లేదని మంత్రి పేషీకే తాళం వేసి ఉద్యోగులు వెళ్లిపోయారని ఏపీ లో హాట్ టాపిక్ అయింది.