AP DGP Comments :  ఆంధ్రప్రదేశ్ లో లా అండ్ ఆర్డర్ దెబ్బతిని క్రైమ్ రేట్ పెరిగిపోయిందని మీడియాలో ప్రచారం కావడం అబద్దమని.. ఏపీలో క్రైమ్ రేట్ తగ్గిందని ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ప్రకటించారు. ఇలాంటివి రాసే ముందు ఇన్ఫర్మేషన్ తీసుకోవాలని ఆయన మీడియాకు సూచించారు. విశాఖ లో ఎంపీ కుటుంబాన్ని కిడ్నాప్ చేసిన వ్యవహారంపై అమరావతిలో ప్రెస్ మీట్ పెట్టిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పోలీసు శాఖ అద్భుతంగా పని చేస్తోందని కితాబిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో గంజాయి సాగు, రవాణాను గతంలో ఎప్పుడూ లేనంత ఎక్కువగా అరికట్టామన్నారు. 


విశాఖ ఖ ఎంపీ  ఎంవీవీ సత్యనారాయణ భార్య జ్యోతి, కుమారుడు శరత్ చంద్ర, వారి ఆడిటర్ గన్నపనేని వెంకటేశ్వరరావులను రౌడీషీటర్లు హేమంత్, రాజేష్ డబ్బు కోసమే కిడ్నాప్ చేశారని డీజీపీ స్పష్టం చేశారు.  కిడ్నాప్ పై ఎంపీ నుంచి ఫిర్యాదు వ‌చ్చిన రెండు గంట‌ల‌లోనే సెల్ ఫోన్ సిగ్న‌ల్ ద్వారా కిడ్నాప‌ర్స్ ను ప‌ట్టుకున్నామని .. పోలీసులు అద్భుతంగా స్పందించారని డీజీపీతెలిపారు.  డబ్బు కోసమే ఎంపీ భార్య, కుమారుడ్ని, వారి ఆడిటర్ ను కిడ్నాప్ చేశారని .. వారి వద్ద నుంచి రూ. 86 లక్షలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.  రెండు రోజుల్లో వారు రూ. కోటి 75 లక్షలను తమ పేరు మీద  బదలాయించుకున్నారని డీజీపీ తెలిపారు. 
 
ఈ నెల 13న ఎంపీ కుమారుడు శరత్ చంద్రను కిడ్నాప్ చేశారని ఆమె ద్వారా  శరత్ తల్లిని కూడా పిలిపిచారన్నారు.  ఆమె వచ్చిన తర్వాత నిర్బంధించి   బంగారం, నగదు తీసుకున్నారని డీజీపీ తెలిపారు.  ఆడిటర్ వద్ద ఎక్కువ డబ్బు ఉంటుందని ఆయనను కూడా ట్రాప్ చేసి పిలిపించారని తెలిపారు.   డబ్బు కోసమే ఈ కిడ్నాప్ చేశారు. కిడ్నాపర్లలో హేమంత్ అనే వ్యక్తిపై హత్య, పలు కిడ్నాప్ లు సహా 12 కేసులు ఉన్నాయని ఫాస్ట్ ట్రాక్ కోర్టు  పెట్టి వీరికి శిక్షపడేలా చేస్తామన్నారు. హేమంత్ పై పీడీ యాక్ట్ నమోదు చేస్తున్నామని డీజీపీ ప్రకటించారు.    


పోలీసులు తనిఖీలతో ఓ ఆడి కారులో ఎంపీ భార్య, కుమారుడు, జీవీని తీసుకుని వెళ్లే ప్రయత్నం చేశారు. పోలీసులు వెంటాడితే కారులో వారిని వదిలేశారని తెలిపారు.   కిడ్నాపర్లకు మరో ముగ్గురు సహకరించారు.. వారు పరారీలో ఉన్నారని డీజీపీ తెలిపారు.  ఎంపీ ఎంవీవీ కుటుంబం కిడ్నాప్ ఘటనలో పోలీసులు సమర్థవంతంగా వ్యనహరించారు. విశాఖలో క్రైమ్ పెరిగిందని.. శాంతి భద్రతల్లో లోపాలున్నాయని విమర్శించడం సరికాదన్నారు.  పోలీసులు అలెర్టుగా ఉన్నారు కాబట్టే గంటల వ్యవధిలో పట్టుకోగలిగాం. ల్యాండ్ గ్రాబింగ్ కేసులను వెంటనే పరిష్కరిస్తున్నామని స్పష్టం చేశారు.   ఎంపీ ఎంవీవీకి కాంట్రాక్టులో.. సబ్ కాంట్రాక్టుల విషయంలో  హేమంత్ సంబంధం ఉందని అంటున్నారు.. విచారణ చేస్తున్నామన్నారు.  కిడ్నాప్ గురించి 15వ తేదీ కంటే ముందుగా ఎంపీకి తెలుసా.. లేదా..? అనేది ఎంపీని అడగాలని డీజీపీ సూచించారు.  ఎంపీకి కిడ్నాప్ విషయం ముందుగా తెలుసా..? లేదా..? అనే కోణంలో మేం విచారణ చేయలేదని స్పష్టం చేశారు.