AP TS Debt  : దేశంలోని వివిధ రాష్ట్రాల అప్పుల వివరాలను కేంద్రం ప్రకటించింది. లోక్ సభలో బీఆర్ఎస్ ఎంపీలు అడిగిన ప్రశ్నకు కేంద్రం రాష్ట్రాల అప్పుల వివరాలు వెల్లడించింది. తెలుగు రాష్ట్రాల్లో అప్పుల భారం పెరుగుతోందని కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ పై అప్పుల భారం పెరుగుతున్నట్లు కేంద్రం చెప్పింది. 2018లో ఏపీ అప్పు రూ.2.29 లక్షల కోట్లు ఉండగా ప్రస్తుతం ఆ అప్పు రూ.3.98 లక్షల కోట్లకు చేరిందని కేంద్ర ఆర్థికశాఖ తెలిపింది. ఏపీ జీడీపీలో మూడేళ్లుగా అప్పుల శాతం పెరిగినట్టు చెప్పింది. 2014లో ఏపీ జీడీపీలో అప్పుల శాతం 42.3 శాతంగా ఉందని కేంద్ర ఆర్థికశాఖ ప్రకటించింది. 2014 తర్వాత ఏపీ జీడీపీలో అప్పుల శాతం తగ్గిందని, 2015లో 23.3 శాతం అప్పులు ఉండగా 2021 నాటికి అది 36.5 శాతానికి పెరిగినట్టు కేంద్రం వెల్లడించింది. 


తెలంగాణ అప్పులు 
 
తెలంగాణలో కూడా అప్పుల భారం పెరుగుతోందని కేంద్రం తెలిపింది. 2018లో రూ.1.60 లక్షల కోట్లుగా ఉన్న రాష్ట్ర అప్పు 2022 నాటికి రూ.3.12 లక్షల కోట్లకు చేరుకుందని వెల్లడించింది. 2021-22 నాటికి అప్పులు 16.7 శాతంగా ఉన్నట్టు కేంద్రం చెప్పింది.  తెలంగాణ జీఎస్డీపీలో గత మూడేళ్లుగా అప్పుల శాతం పెరిగాయని తెలిపింది.  2016లో రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తిలో అప్పుల శాతం 15.7 ఉండగా, ఆ తర్వాత భారీగా పెరుగుదల నమోదైనట్టు పేర్కొంది. 2022 నాటికి తెలంగాణ జీఎస్డీపీలో 27.4 శాతం అప్పులు నమోదు అయ్యాయని చెప్పింది.  


ఇతర రాష్ట్రాల అప్పులు


ఇతర రాష్ట్రాల విషయానికొస్తే అప్పుల్లో తమిళనాడు నెంబర్ వన్‌గా ఉంది. 2022 నాటికి తమిళనాడు అప్పు రూ. 6,59,868 కోట్లుగా ఉందని కేంద్రం తెలిపింది. రెండో స్థానంలో ఉన్న ఉత్తరప్రదేశ్ కు రూ. 6,53,307 కోట్ల అప్పు ఉంది. మహారాష్ట్ర మూడో స్థానంలో నిలిచింది. మహారాష్ట్ర అప్పు రూ. 6,08,999 కోట్లు, నాలుగో స్థానంలో ఉన్న పశ్చిమబెంగాల్ అప్పు రూ. 5,62, 697 కోట్లు అని తేలింది. ఐదో స్థానంలో రాజస్థాన్ అప్పు రూ. 4,77,177 కోట్లు, ఆరో స్థానంలో కర్ణాటక రూ.4,61,832 కోట్ల అప్పు ఉందని కేంద్ర ఆర్థికశాఖ ప్రకటించింది. ఏడు స్థానంలో గుజరాత్ అప్పు రూ. 4,02,785 కోట్లుగా ఉందని చెప్పింది. 


 రూ.23 వేల ఆర్థికసాయం చేశామని కేంద్రం ప్రకటన


విభజన చట్టంలోని హామీల మేరకు ఇప్పటి వరకూ ఏపీకి రూ.23,110.47 కోట్లు ఆర్థిక సాయం చేశామని కేంద్రం ప్రకటించింది. టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ ఇటీవల అడిగిన ప్రశ్నకు కేంద్రం రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది. రెవెన్యూ లోటు భర్తీ కింద రూ.5617.89 కోట్లు, వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద రూ.1750 కోట్లు, రాజధాని నిర్మాణం కోసం రూ.2500 కోట్లు, పోలవరం ప్రాజెక్టుకు రూ. 13,226.772 కోట్లు ఏపీకి ఇచ్చినట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. 2015-20 మధ్య కాలంలో ఏపీ సంతకాలు చేసిన విదేశీ ప్రాజక్టులపై తీసుకున్న రుణాలకు రూ.15.81 కోట్ల వడ్డీ చెల్లింపులు కూడా విడుదల చేసినట్లు వెల్లడించారు. నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ కింద 2019-20 నుంచి 2022-23 మధ్య ఏపీకి రూ.4199.55 కోట్లు విడుదల చేశామన్నారు. ఏపీ రాజధాని నిర్మాణానికి రూ.2500 కోట్లు ఇచ్చామని రాజ్యసభలో కేంద్రం వెల్లడించింది. ఏపీకి నూతన రాజధాని నిర్మాణానికి నిధులు ఇచ్చామని పేర్కొంది. ఏపీ విభజన చట్టం హామీల అమలు, అందిస్తున్న సాయంపై ఎంపీ కనకమేడల అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి పంకజ్‌చౌదరి లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. విభజన చట్టంలోని నిబంధనలు, నీతి ఆయోగ్ సిఫార్సులతో ఏపీకి ఆర్థికసాయం అందిస్తున్నామని కేంద్రం వెల్లడించింది.