Vundavalli Aruna Kumar : సుప్రీంకోర్టులో విభజన హామీలపై దాఖలైన పిటిషన్‌పై సోమవారం విచారణ జరిగింది. ఈ పిటిషన్ పై జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ బీవీ నాగరత్న  ధర్మాసనం విచారణ చేపట్టింది. పార్టీ ఇన్ పర్సన్ గా పిటిషనర్ ఉండవల్లి అరుణ్ కుమార్ కోర్టుకు తన వాదనలు వినిపించారు. తాను ఎంపీగా ఉన్నప్పుడు రాష్ట్ర విభజన జరిగిందని, విభజన చట్టాన్ని ఆమోదించే  ప్రక్రియ సరిగా లేదని కోర్టుకు తెలిపారు.  పార్లమెంట్ లో లైవ్ టెలికాస్ట్ నిలిపివేసారని, రూల్ బుక్ అమలు చేయలేదని కోర్టుకు తెలిపారు.   


విభజన ప్రక్రియ సరిగా జరగలేదు 
 
విభజన చట్టాన్ని ఆమోదించిన క్రమంలో ప్రక్రియ సరిగా జరగలేదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కోర్టుకు తెలిపారు. తాను ఎంపీగా ఉన్నప్పుడు ఏపీ, తెలంగాణ విభజన జరిగిందన్నారు. పార్లమెంట్ లో టెలీకాస్ట్ ఆపేశారని, రూల్ బుక్ అమలు చేయలేదన్నారు. డివిజన్ కోసం అడిగినా ఓటింగ్ చేపట్టలేదన్నారు. 86 మంది మైక్ ద్వారా తమ అభిప్రాయాలు చెప్పారని, మిగతావారు రాతపూర్వకంగా తమ అభిప్రాయాలు చెప్పారని కోర్టుకు తెలిపారు.  విభజన చట్టంలో ఇవేవీ ప్రస్తావించనేలేదన్నారు. 


విభజనకు వ్యతిరేకం కాదు 


"పార్లమెంటు చరిత్రలో ఇలా గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదు. బిహార్, జార్ఖండ్ విభజన సమయంలో ఏకాభిప్రాయం సాధించారు. గతంలో ఒక కమిషన్ సిఫార్సుల ప్రకారం రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం తప్పనిసరి. రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా ఉంది. నేను విభజనకు వ్యతిరేకం అని ఎక్కడా చెప్పలేదు. నిబంధనల ప్రకారం విభజన ప్రక్రియ జరగలేదన్నదే నా అభ్యంతరం. " అని ఉండవల్లి అరుణ్ కుమార్ కోర్టుకు తెలిపారు. 


 అయితే విభజన హామీల పిటిషన్ పై తదుపరి విచారణను సుప్రీంకోర్టు 2023 ఫిబ్రవరి 22కి వాయిదా వేసింది.  


రాష్ట్ర విభజనపై పుస్తకం 


ఏకపక్ష రాష్ట్ర విభజనపై "విభజన వ్యథ" పుస్తకం రాస్తున్నట్లు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఇటీవల తెలిపారు. రాష్ట్రం ఎలా నష్టపోయిందన్న అంశాలను, అనాటి పరిస్థితులపై పుస్తకంలో వివరాలు వెల్లడిస్తానని అరుణ్ కుమార్ పేర్కొన్నారు. అమరావతిపై తాను ఏనాడో పుస్తకం రాశానని, భ్రమరావతి అనే పుస్తకంలో చాలా విషయాలు వెల్లడించానన్నారు. మార్గదర్శి కేసును వదిలేది లేదని అరుణ్ కుమార్ పునరుద్ఘాటించారు. మార్గదర్శిపై తాను కేసు వేసి 16 ఏళ్లు అయ్యిందని, మార్గదర్శి కేనుపై రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఎల్పీ వేసిందని.. ప్రభుత్వం వేసిన సీఎల్పీకు సంబంధించి తన వద్ద ఉన్నటువంటి డాక్యుమెంటు సాక్ష్యాలను ప్రభుత్వానికి ఇస్తానని వెల్లడించారు. రామోజీరావు కేసు విషయంలో ప్రభుత్వానికి ఛాలెంజ్ చేస్తున్నానని అరుణ్ కుమార్ అన్నారు. 


 విభజన మార్గదర్శకాలు 


 మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ రాష్ట్ర విభజనపై సుప్రీంకోర్టులో పిటిషన్‌పై దాఖలు చేశారు. 2014లో ఏపీ విభజన నిబంధనల ప్రకారం పూర్తి కాలేదని.. అలాగే విభజన చట్టం కొట్టేయాలని ఉండవల్లి అరుణ్‌కుమార్ ఈ పిటిషన్ లో పేర్కొన్నారు. మరి కొంతమంది విభజనపై పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఏపీ విభజన పూర్తయిందని, భవిష్యత్తులో రాష్ట్ర విభజన జరిగేటప్పుడు పాటించాల్సిన మార్గదర్శకాలు సూచించాలని ఆయన పిటిషన్ లో కోరారు.