Ysrcp : గోదావరి నదికి కనివీనీ ఎరుగని రీతిలో సంభవించిన వరదలతో పెద్ద ఎత్తున ఆస్తి, పంట నష్టం వాటిల్లినందున తక్షణమే సాయం చేసి ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకోవాలని వైఎస్సార్సీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు వి.విజయసాయి రెడ్డి, పార్టీ లోక్ సభ ఫ్లోర్ లీడర్ పి.వి.మిథున్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా ఆదివారం దిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న వైసీపీ ఎంపీలు సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా అఖిలపక్ష సమావేశంలో కేంద్రం దృష్టికి తీసుకువచ్చిన తమ డిమాండ్ల గురించి విజయసాయి రెడ్డి వివరించారు. ఆకస్మిక వరదల కారణంగా గోదావరి పరీవాహక ప్రాంతంలోని జిల్లాల్లో ఆస్తి, పంట నష్టం వాటిల్లింది. వందలాది గ్రామాలు నీట మునిగాయి. వరద బాధితుల కోసం రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున సహాయ, పునరావాస చర్యలు చేపట్టినట్లు సమావేశంలో కేంద్రం దృష్టికి తీసుకెళ్లామని ఆయన చెప్పారు.
జీఎస్టీ పరిహారం మరో 5 ఏళ్లు పొడిగించాలి
రాష్ట్రాలకు ఇచ్చే జీఎస్టీ పరిహారం మరో అయిదేళ్ల పాటు పొడిగించాలని అఖిలపక్ష సమావేశంలో కేంద్రాన్ని కోరినట్లు విజయసాయి రెడ్డి చెప్పారు. కోవిడ్ కారణంగా రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులు తీవ్ర ఒడిదొడుగులకు లోనైందున జీఎస్టీ పరిహారం చెల్లింపును మరో అయిదేళ్ల పాటు పొడిగించాలని తాము గతంలోనే కేంద్రాన్ని కోరినట్లు తెలిపారు. దేశంలోని 31 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు గానూ కేవలం 5 రాష్ట్రాల్లో మాత్రమే ప్రొటెక్టెడ్ రెవెన్యూ గ్రోత్ కన్నా ఎక్కువగా నమోదు చేశాయని అన్నారు. ఈ పరిస్థితులను పరిగణలోకి తీసుకుని జీఎస్టీ పరిహారం చెల్లింపును మరో 5 ఏళ్ళు పొడిగించాలని విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. ఏపీ పునర్విభజన చట్టంపై కేంద్రం ఇప్పటికైనా స్పష్టమైన ప్రకటన చేయాలని కోరినట్లు విజయసాయి రెడ్డి తెలిపారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తామని అప్పటి ప్రధాని పార్లమెంట్‌లో స్పష్టమైన ప్రకటన చేసినప్పటికీ ఆ హామీ అమలు చేయకుండా బీజేపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పై సవతి తల్లి ప్రేమను ప్రదర్శిస్తోందని అన్నారు. ఇదే విషయాన్ని సమావేశంలో మరోమారు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. అలాగే పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి నిధుల విడుదలలో జరుగుతున్న జాప్యం వలన ప్రాజెక్ట్ పనులు ఆలస్యం అవుతున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తోన్న సొంత నిధులను రీయింబర్స్ చేయడంలో కూడా విపరీతమైన జాప్యం జరుగుతోందని కేంద్రం దృష్టికి తీసుకువచ్చినట్లు విజయసాయి రెడ్డి చెప్పారు.
రైల్వే జోన్ పై
విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు కొన్నేళ్లుగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. ఈ సమస్యపై అనేక దఫాలుగా తమ పార్టీ ఎంపీలు రైల్వే మంత్రిని కలిసినా రైల్వే జోన్ ఏర్పాటులో ఎందుకు కాలయాపన జరుగుతోందని సమావేశంలో ప్రశ్నించినట్లు చెప్పారు. అమెరికన్ డాలర్‌తో రూపాయి మారకం విలువ విపరీతంగా పడిపోవడం ఆందోళనకర పరిణామంగా సమావేశంలో తెలిపామన్నారు. అమెరికన్ డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.79.72లకు పడిపోవడంతో ఒకే నెలలో ఏర్పడ్డ 26.18 బిలియన్ డాలర్ల వాణిజ్య లోటు ప్రమాద ఘంటికలను మోగిస్తోందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే తగిన దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు.
రాష్ట్రంలోని ప్రధాన ప్రాజక్టులైన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులకు అనుమతులు మంజూరు చేయడంలోనూ, కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు అవసరమైన అనుమతులు ఇవ్వడంలోను జరుగుతున్న జాప్యానికి కారణాలు వివరించాలని డిమాండ్ చేసినట్లు చెప్పారు.
కొత్త మెడికల్ కాలేజీలకు అనుమతులలో జాప్యం
రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన 26 జిల్లాలలో జిల్లాకో మెడికల్ కాలేజీ, జిల్లా ఆసుపత్రి ఏర్పాటు చేయడానికి అనమతించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరితే ఇప్పటి వరకు దీనిపై స్పందన లేకపోవడాన్ని సమావేశంలో ప్రస్తావించినట్లు ఎంపీ విజయసాయి రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు కొత్తగా 12 వైద్య కళాశాలల ప్రతిపాదన ఇప్పటికీ పెండింగ్ లోనే ఉందని గుర్తు చేశారు. ఇటీవల ఉక్రెయిన్ రష్యా యుద్ధం కారణంగా అనేక మంది తెలుగు విద్యార్థులు రాష్ట్రానికి తిరిగి వచ్చారని, చదువు అర్దాంతరంగా ఆగిపోవడంతో వారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారికి తక్షణమే ఇతర మెడికల్ కాలేజీలలో చదువుకోడానికి అనుమతులు ఇవ్వాలని కోరారు.
జనాభా లెక్కల సేకరణ ప్రారంభించాలి
కోవిడ్ కారణంగా గత మూడు సంవత్సరాలుగా జనాభా లెక్కల సేకరణ జరగలేదని ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. అందువలన 2011 జనాభా లెక్కలను మాత్రమే పరిగణలోకి తీసుకోవడంతో రాష్ట్రం అనేక విధాలుగా నష్టపోతున్నామని అన్నారు. పౌరసరఫరా, రేషన్ సరఫరా విషయంలో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. అన్నారు. ఇక కోవిడ్ ప్రభావంతో దేశంలో మహిళా ఉద్యోగుల సంఖ్య తగ్గిపోయిందని మొత్తం జనాభాలో 48% మహిళలున్నా జీడీపీలో వారి భాగస్వామ్యం కేవలం 17% మాత్రమే ఉందని అన్నారు. చైనాలో మహిళలు ఆ దేశ జీడీపీలో 40% అందించగలుగుతున్నారని గుర్తుచేశారు. కోవిడ్ తరువాత 21 మిలియన్ల మహిళలు ఉద్యోగ, ఉపాధి కోల్పోయారని గుర్తు చేశారు.
పార్లమెంట్‌లో మహిళా బిల్లు
మహిళా సాధికారతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే ఏపీ ప్రభుత్వ ఆకాంక్షలకు అనుగుణంగా పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశ పెట్టాలని, మహిళల హక్కులు కాపాడాలని కోరినట్లు చెప్పారు. మహిళల విద్య, జీవన ప్రమాణాల పెంపు, శిశు సంరక్షణ గురించి చర్యలు తీసుకోవాలని కోరామన్నారు.