AP Free Gas Cylinder Scheme Apply Online Check Eligibility and Benefits | అమరావతి: ఏపీ ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాల అమలులో భాగంగా ఉచిత సిలిండర్ పథకాన్ని ఇటీవల ప్రారంభించింది. ‘దీపం 2.0’ కింద ఏడాదికి మూడు ఉచిత సిలిండర్‌లు అందించనుంది. ఫ్రీ సిలిండర్ పథకానికి ఆల్రెడీ బుకింగ్స్‌ మొదలయ్యాయి. 31వ తేదీ నుంచి ఏపీలో ఈ ఉచిత సిలిండర్ల డెలివరీ మొదలైంది. ఏపీ సీఎం చంద్రబాబు శ్రీకాకుళం జిల్లాలో ఉచిత సిలిండర్ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అయితే ఈ పథకానికి అర్హులు ఎవరు అనే అనుమానాలు ప్రజల నుంచి వ్యక్తమవుతున్నాయి. రేషన్ కార్డుదారులతో పోల్చితే లబ్ధిదారుల సంఖ్య తక్కువగా ఉంది.


ఉచిత సిలిండర్ పొందాలంటే ఆధార్ కార్డ్, రేషన్ కార్డు తప్పనిసరిగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. గ్యాస్ కనెక్షన్ ఉన్నా, ఆధార్, రేషన్ కార్డుల్లో ఏదో ఒకటి లేకపోవడంతో ఫ్రీ సిలిండర్ స్కీమ్ అర్హుల సంఖ్య తగ్గిందని అధికారులు చెబుతన్నారు. ఆంధ్రప్రదేశ్ లో 1.54 కోట్ల గృహ వినియోగ వంటగ్యాస్‌ కనెక్షన్లు (LPG Cylinder) ఉంటే అధికారుల అంచనా ప్రకారం 1.08 కోట్ల కనెక్షన్లు ఉచిత సిలిండర్ పథకానికి అర్హత పొందాయి. 1.48 కోట్ల మందికి రేషన్‌ కార్డులున్నా, కొంత మందికి ఆధార్ కార్డులు, గ్యాస్‌ కనెక్షన్ లేకపోవడంతో అర్హుల జాబితాలో లేరు.  దీపం 2.0 లబ్ధిదారులు సందేహాలకు అధికారులు సమాధానాలు ఇలా ఉన్నాయి. దాంతో వారికి ఉచిత సిలిండర్ పథకం ఎలా వర్తిస్తుందో స్పష్టతనిచ్చారు. 


ఉచిత గ్యాస్ సిలిండర్ పథకానికి ఇవి తెలుసుకోండి
- ఏడాదికి 3 ఫ్రీ గ్యాస్ సిలిండర్ పొందాలంటే రేషన్‌ కార్డు, ఆధార్, గ్యాస్‌ కనెక్షన్‌ తప్పనిసరిగా ఉండాలి.
- ఒక రేషన్‌ కార్డులోని సభ్యుల పేర్లతో రెండు అంతకంటే ఎక్కువ గ్యాస్ కనెక్షన్లు ఉన్నా, ఒక్క వంట గ్యాస్ కనెక్షన్‌కే రాయితీ వర్తిస్తుంది. 
- కుటుంబంలో ఎవరి పేరుమీద కనెక్షన్‌ ఉంటుందో వారి పేరు రేషన్‌ కార్డులో ఉంటే ఉచిత గ్యాస్ సిలిండర్ కు మీరు అర్హులు. 
- భార్య పేరుతో రేషన్‌ కార్డు ఉండి, భర్త పేరుతో వంట గ్యాస్‌ కనెక్షన్‌ ఉన్నా ఈ పథకానికి మీరు అర్హులే.
- గ్యాస్‌ రాయితీ నగదు రావాలంటే ఈ కేవైసీ పూర్తి చేసి ఉండాలి. గ్రామ/వార్డు సచివాలయ సిబ్బందితో అయినా ఈ కేవైసీ తీసుకోవాలి.
- టీడీపీ హయాంలో ఇచ్చిన దీపం కనెక్షన్లకూ ‘దీపం 2.0’ స్కీమ్ వర్తిస్తుంది
    
వంట గ్యాస్ సిలిండర్లను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు, లేకపోతే డీలర్‌ వద్దకెళ్లి బుక్‌ చేసుకున్నా సరిపోతుంది. మీకు ఎల్పీజీ సిలిండర్‌ డెలివరీ చేసిన 48 గంటల్లో గ్యాస్ సిలిండర్ సంస్థలే రాయితీ నగదును లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలో జమ చేయనున్నాయి. ఏవైనా సందేహాలు ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ 1967 కు ఫోన్‌ చేయవచ్చు. మరిన్ని వివరాలకు మీ గ్రామ/వార్డు సచివాలయాల్లో, ఎమ్మార్వో ఆఫీసుల్లో సంబంధిత పౌర సరఫరాల అధికారుల్ని సంప్రదించాలని ప్రభుత్వం సూచించింది.



దీపావళి కానుకగా అర్హులైన వారందరికీ ఉచితంగా సిలిండర్లు


ఆధార్‌, వైట్‌ రేషన్‌ కార్డు రెండూ ఉన్న ప్రతీ గ్యాస్‌ వియోగదారులు ఉచిత గ్యాస్ సిలిండర్ స్కీమ్‌లో అర్హులుగా చేసింది. ఏటా మూడు సిలిండర్లు ఉచితంగా ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం ముందు లబ్ధిదారుల నుంచి బుకింగ్ కోసం గ్యాస్ కంపెనీలు డబ్బులు తీసుకుంటాయి. రాయితీ నగదు రూ. 851ను రెండు రోజుల్లో లబ్ధిదారుడి ఖాతాల్లో జమ చేస్తాయి. ఇలా ప్రతి నాలుగు నెలలకోసారి లబ్దిదారులు ఉచిత గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవచ్చు.