YS Viveka Case News : వైఎస్ వివేకా హత్య కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి ప్రాణభయంతో వణికిపోతున్నారు. తనకు, తన కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి జగన్, ఎంపీ అవినాశ్ రెడ్డి నుంచి ప్రాణహాని ఉందని ఆయన ఆరోపించారు. తనను, తన కుటుంబాన్ని ఏమైనా చేస్తారనే భయం తనకు ఉందని చెప్పారు. అవినాశ్ రెడ్డి మనుషులు తనను అనుసరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు కడప ఎస్పీ కార్యాలయంలో ఆయన ఫిర్యాదు చేశారు. తనకు, తన కుటుంబానికి తగిన రక్షణ కల్పించాలని కోరారు. వివేకా కూతురు సునీత నుంచి తాను డబ్బులు తీసుకున్నట్టు అవినాశ్ రెడ్డి పదేపదే ఆరోపిస్తున్నారని అన్నారు. తాను అమ్ముడుపోయానని నిరూపిస్తే జైలు శిక్షకు సిద్ధమని, నిరూపించకపోతే ఎంపీ పదవికి రాజీనామా చేసి జైలుకు వెళ్తారా? అని ప్రశ్నించారు. తనకు ప్రాణహాని ఉందనే విషయాన్ని సీబీఐ ఎస్పీ, రాయలసీమ రేంజ్ డీఐజీకి రిజిస్టర్ పోస్ట్ ద్వారా వినతులు అందజేస్తానని చెప్పారు.
ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్‌రెడ్డి అరెస్టు తర్వాత తనపై కక్ష కట్టారని మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి తెలిపారు. ఈ మేరకు కడప ఎస్పీ కార్యాలయంలో ఆయన ఫిర్యాదు చేశారు. ''పులివెందుల వైఎస్ఆర్‌సీపీ శ్రేణులు, అవినాష్ అనుచరుల నుంచి నాకు ప్రాణహాని ఉంది. నన్ను, నా కుటుంబాన్ని ఏమైనా చేస్తారేమోనని భయంగా ఉంది. సీఎం జగన్, ఎంపీ అవినాష్‌రెడ్డి వల్ల ప్రాణహాని ఉంది. అవినాష్ రెడ్డి అనుచరులు నన్ను అనుసరిస్తున్నారు. వారు నాపై బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. నాకు, నా కుటుంబానికి తగిన రక్షణ కల్పించాలి'' అని ఫిర్యాదులో దస్తగిరి పేర్కొన్నారు. దస్తగిరి ఎస్పీ కార్యాలయానికి వచ్చినప్పుడు ఎస్పీ అందుబాటులో లేకపోవడంతో అక్కడున్న సిబ్బందికి ఫిర్యాదు పత్రం ఇచ్చారు.
మంగళవారం కూడా పులివెందులలో మీడియాతో మాట్లాడిన దస్తగిరి ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్‌రెడ్డి, కడప ఎంపి వైఎస్.అవినాష్‌రెడ్డి నుంచి తనకు ఇప్పటికీ ప్రాణహాని ఉందని ప్రకటించారు. ఎర్ర గంగిరెడ్డి చెప్పిన మేరకే వివేకానందను హత్య చేయడంలో సహాయం చేశానని తెలిపారు. ఈ కేసులో అన్యాయంగా ఇరికించారని వైఎస్.అవినాష్‌రెడ్డి అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రొద్దుటూరులో తాను అప్రూవర్‌గా మారి వాంగ్మూలం ఇచ్చిన మరుసటి రోజు అవినాష్‌రెడ్డి, ఇతరులు కోర్టుకు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. ఇప్పుడు అరెస్టులు జరుగుతున్నాయి కాబట్టి నాపైనా, సిబిఐపైనా, సునీతపైనా తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.
వివేకా హత్య కేసులో దస్తగిరి అత్యంత కీలకంగా మారారు. ఆయన అప్రూవర్‌గా మారిన తర్వాతే కేసు మలుపులు తిరుగుతోంది. దస్తగిరిని ఎలా అప్రూవర్ గా అనుమతిస్తారని ఇతర నిందితులు కోర్టుల్లో పిటిషన్లు కూడా వేస్తున్నారు.