AP Latest News: ఎక్స్ సీఈవో, అమెరికాకు చెందిన వ్యాపార దిగ్గజం ఎలన్ మస్క్‌కు బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి ఛాలెంజ్ చేశారు. ఈవీఎంలు హ్యాక్ చేయొచ్చన్న మస్క్ వ్యాఖ్యలపై పురందేశ్వరి స్పందించారు. ఎలాన్ మస్క్ ను ఎన్నికల సంఘం భారత్ కు ఆహ్వానించాలని.. ఈవీఎంల హ్యాకింగ్ నిరూపణకు మస్క్ కు అవకాశమివ్వాలని పురందేశ్వరి సూచించారు. ఈవీఎంలపై పరిశోధనలకు ఈసీ ఇప్పటికే చాలామందికి అవకాశం ఇచ్చిందని గుర్తు చేశారు. ఆ అవకాశం ఎన్నికల సంఘం ఇచ్చినా ఎవరూ హ్యాక్ చేయలేకపోయారని పురందేశ్వరి గుర్తు చేశారు.
అంతకుముందు ఎలన్ మస్క్ ఓ ఎక్స్‌లో ఓ పోస్టు చేస్తూ.. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లను (ఈవీఎం) నిషేధించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. వీటిని మనుషులు లేదా ఏఐ ద్వారా హ్యాకింగ్ చేయొచ్చని అన్నారు. దీనికి కౌంటర్ గానే పురందేశ్వరి తాజాగా ఎలన్ మస్క్‌కు ఛాలెంజ్ విసిరారు.
అమెరికాలోని ప్యూర్టోరికోలో కొంత కాలం క్రితం జరిగిన ప్రైమరీ ఎలక్షన్స్ లో అవకతవకలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ఎలాన్ మస్క్ స్పందిస్తూ.. మనం ఈవీఎంలను తొలగించాలని పోస్ట్ చేశారు. దీనిపై మాజీ కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ కూడా గట్టిగానే స్పందించారు. సెక్యూర్ డిజిటల్ హార్డ్ వేర్ ను తయారు చేయడం సాధ్యం కాదని మస్క్ మాట్లాడుతున్నారని.. అది తప్పని అన్నారు. అమెరికా సహా ఇతర దేశాలలో సాధారణ కంప్యూటర్ ప్లాట్ ఫాంను ను వాడి ఇంటర్నెట్ కనెక్టెడ్ ఈవీఎంలను తయారు చేస్తుంటారని.. కానీ ఇండియాలో తయారుచేసే ఈవీఎంలు ఏ ఇతర నెట్‌వర్క్‌తో కనెక్ట్ కావని చెప్పారు. అంటే, ఇంటర్నెట్, బ్లూటూత్, వైఫై లాంటి కనెక్షన్ ఈవీఎంలకు ఉండబోదని చెప్పారు. కనీసం వాటిని రీప్రోగ్రామ్ చేసే వీలు కూడా ఉండదని పోస్ట్ చేశారు.
ఈ విషయంపై జాతీయ వార్తా సంస్థలతో కూడా రాజీవ్ చంద్రశేఖర్ మాట్లాడారు. హ్యాకింగ్ కు అవకాశంలేని ఈవీఎంలను తయారుచేసుకోవాలనుకొనే దేశాలకు భారత్ శిక్షణ ఇవ్వడానికి రెడీ అని అన్నారు. థియరీ వేరు.. ప్రాక్టికల్ వేరని.. క్వాంటమ్ కంప్యూటింగ్ ద్వారా తాను ఏ లెవల్ ఎన్‌క్రిప్షన్ అయినా డీక్రిప్ట్ చేయగలనని అన్నారు. కానీ దీనికి, ఈవీఎంలకు సంబంధం లేదని అన్నారు. ఈవీఎంలు పూర్తిగా సేఫ్ అని రాజీవ్ చంద్రశేఖర్ చెప్పారు.
రాజీవ్ చంద్రశేఖర్ ప్రముఖ చిప్ డిజైనర్ కూడా. గుజరాత్‌కు చెందిన ఈయన మూడు సార్లు రాజ్యసభకు ఎంపీగా ఎన్నికై 7 జులై 2021 నుంచి నరేంద్ర మోదీ కేబినెట్ స్కిల్ డెవలప్ మెంట్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రిగా పని చేశారు.