తెలుగు రాష్ట్రాల మధ్య మళ్లీ కృష్ణా జలాల వివాదం మాటకు మాటకు దారి తీస్తోంది. కేంద్రం జోక్యం చేసుకుని నదీ బోర్డును నోటిఫై చేయడంతో సమస్య సద్దుమణిగిందని అనుకున్నారు. ఇక ఏమైనా ఉన్నా కేంద్రమే చూసుకుంటుందని.. ఇరు రాష్ట్రాలు కేంద్రం వద్దకే వెళ్తాయని అనుకున్నారు. అయితే రాజకీయంగా మాత్రం... రెండు ప్రభుత్వల మధ్య మళ్లీ మాటల మంటలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ సీఎం కేసీఆర్ నాగార్జునసాగర్‌లో పర్యటించారు. ఉపఎన్నికలో గెలిపించినందుకు ప్రజలకు కృతజ్ఞతలు చెప్పి.. అభివృద్ధి పనులు ప్రారంభించడానికి ఆయన వెళ్లారు.. అక్కడ జరిగినసభలో కృష్ణా జలాల వివాదంపై మాట్లాడారు. ఏపీ సర్కార్‌పై విమర్శలు చేశారు. నీటి విషయంలో ఏపీ ప్రభుత్వం దాదాగిరి చేస్తోందని మండిపడ్డారు. అయితే న్యాయంగా రావాల్సిన నీటిని దక్కించుకుని సాగర్ ఆయుకట్టు పరిధిలోని పొలాలకు రెండు పంటలకు నీరిస్తామని కేసీఆర్ ప్రజలకు హామీ ఇచ్చారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై వెంటనే ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కాస్త ఘాటుగానే కౌంటర్ ఇచ్చారు. కృష్ణా జలాల విషయంలో ఎవరు దాదాగిరి చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. చట్టాలకు వ్యతిరేకంగా జీవోలు ఇచ్చి మరీ... విద్యుత్ ఉత్పాదన చేశారని, దాదాపుగా 30 టీఎంసీల నీరు సముద్రం పాలయ్యేలా చేశారని విమర్శలు గుప్పించారు. విద్యుత్ ఉత్పత్తి కోసం నీటిని వాడుకోకూడదన్న నిబంధనలను తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ఏపీకి న్యాయంగా రావాల్సిన నీటి కోసమే సీఎం జగన్ పోరాడుతున్నారని కౌంటర్ ఇచ్చారు.
కేసీఆర్ విమర్శలు.. సజ్జల కౌంటర్‌తో... కృష్ణా జలాల అంశం మరో రాజకీయ వివాదంగా మారే అవకాశం కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నదీ బోర్డులను నోటిఫై చేయనంత వరకూ.. తెలంగాణ రాష్ట్ర మంత్రులు.. ఏపీ సర్కార్ పెద్దలపై విరుచుకుపడేవారు. ముఖ్యంగా సీఎం జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై విమర్శలు గుప్పించేవారు. అయితే.. వైసీపీ నేతలు పెద్దగా స్పందించేవారు కాదు. కానీ సమస్య ను పరిష్కరించాలంటూ సీఎం జగన్ కేంద్రానికి లేఖలు రాశారు. ఆ లేఖలకు ప్రతిస్పందనగా కేంద్రం స్పందించి... నదీబోర్డులను నోటిఫై చేస్తున్నట్లు తెలిపింది. ఆ తర్వాత రెండు రాష్ట్రాల నేతల మధ్య పెద్దగా విమర్శలు.. ప్రతి విమర్శలు లేవు. మొత్తం సద్దుమణిగిపోయిందని అనుకున్నారు.
కానీ నాగార్జునసాగర్ పర్యటనలో కేసీఆర్ మళ్లీ ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేయడంతో.. ఏపీ ప్రభుత్వ సలహాదారు కూడా కౌంటర్ ఇవ్వడంతో మళ్లీ వివాదం ప్రారంభమయింది. సజ్జల వ్యాఖ్యలపై టీఆర్ఎస్ మంత్రులు సైలెంట్‌గా ఉండే అవకాశం లేదు. దీంతో ఏపీ, తెలంగాణల మద్య మళ్లీ రాజకీయ వేడి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అయితే.. విపక్షాలు మాత్రం మొదటి నుంచి రెండు రాష్ట్రాల అధికార పార్టీలు సెంటిమెంట్‌ను రెచ్చగొట్టడానికి కృష్ణా జలాల వివాదాన్ని తెరపైకి తెచ్చారని విమర్శలు చేస్తూనే ఉన్నాయి.