నిజాంపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడిన మిగ్‌జాం తుపాను (Michaung Cyclone) తీవ్ర తుపానుగా మారి ఏపీ వైపు దూసుకొస్తోంది. ఇప్పటికే తమిళనాడులో పలు జిల్లాల్లో తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల రోడ్లు చెరువుల్లా మారిపోయాయి. ఏపీపై ముఖ్యంగా నెల్లూరు, తిరుపతి జిల్లాలతో పాటు కోనసీమ జిల్లాలపై మిగ్‌జాం తుపాను తీవ్రత అధికంగా ఉండనుంది. మిగ్‌జాం తుపాను తీవ్రత కారణంగా బాపట్ల జిల్లా నిజాంపట్నం ఫిషింగ్ హార్బర్ వద్ద 10వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మొత్తం 11 ప్రమాద హెచ్చరికలు ఉండగా, 10వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారంటే తుపాను తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.
రేపు తీరం దాటనున్న మిగ్‌జాం తుపాను..
కోస్తాంధ్ర తీరానికి ఆనుకొని మిగ్‌జాం తుపాను (Michaung Cyclone Moving Towards AP) వేగంగా కదులుతోంది. మంగళవారం (డిసెంబర్ 5న) ఉదయం మచిలీపట్నం- బాపట్ల మధ్య నిజాంపట్నానికి సమీపంలో మిగ్‌జాం తుపాను తీరం దాటనుందని అధికారులు తెలిపారు. కానీ తుపాను తీరం దాటుతున్న సమయంలో 100 నుంచి 110 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ, అమరావతి వాతారణ కేంద్రం తెలిపింది. తుపాను తీవ్రత అధికంగా ఉండటంతో మంగళవారం సైతం స్కూళ్లకు సెలవులు ప్రకటించినట్లు కృష్ణా జిల్లా కలెక్టర్ తెలిపారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు.
చెన్నై : చెన్నై మహా నగరం జలదిగ్బంధంలో చిక్కుకుంది. గతంలో భారీ వర్షాలకు చిగురుటాకులా వణికిపోయే చెన్నై నగరం తాజాగా మిగ్ జాం తుపానుకు విలవిల్లాడిపోతోంది. గత వారంరోజులుగా చెన్నైలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. రోడ్లు జలాశయాల్లా మారిపోయాయి. చెన్నైలోని చాలా ప్రాంతాలలో నిలిపోయిన వరద నీరు రోడ్లపై నిలిచిపోయింది. 5 నుంచి 6 అడుగుల వరకు రోడ్లపై వరద నీరు కనిపిస్తోంది. ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు భయపడుతున్న జనం. జలదిగ్బంధంలో చిక్కుకున్న ప్రాంతాల్లో ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది.