CPI Narayana About YS Jagan: హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో (AP Elections) రిపీట్ అవుతాయని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ వ్యాఖ్యానించారు. తెలంగాణతో పోల్చితే ఏపీలోనే అవినీతి అధికంగా ఉందని, వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్ (AP CM YS Jagan) ఓటమి తథ్యమన్నారు. అంతటితో ఆగకుండా ఏపీ ప్రభుత్వంపై, సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ధరణి వెబ్ సైట్ పేరుతో తెలంగాణలో మాజీ సీఎం కేసీఆర్ చేసిన మోసాల కంటే ఏపీలో జరిగిన తప్పులే ఎక్కువని ఆరోపించారు. తెలుగు ప్రజలు బీజేపీకి దూరంగా ఉంటున్నారని, కానీ జగన్ మాత్రం బీజేపీకి సహకారం అందించడం నిజం కాదా అని ప్రశ్నించారు. వచ్చే ఏడాది జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో ఏపీ, తెలంగాణలో ఒక్కో స్థానంలో సీపీఐ పోటీ చేస్తుందన్నారు.


వీలుచిక్కినప్పుడల్లా ఏపీ ప్రభుత్వంపై సీపీఐ అగ్రనేత నారాయణ విమర్శలు చేస్తున్నారు. సీఎం జగన్ కు కేసుల భయం పట్టుకుందని, అందుకే ఢిల్లీకి వెళ్తుంటారని పలుమార్లు ఆరోపించారు. జగన్ ఢిల్లీకి వెళ్లి కేంద్రం పెద్దలు ప్రధాని మోదీ, అమిత్ షా కాళ్లమీద పడుతున్నారని సైతం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ కు ఓటమి భయం పట్టుకుందని, అందుకే వైసీపీ ఇంఛార్జ్ లను మారుస్తున్నారని అభిప్రాయపడ్డారు. రాష్ట్రాన్ని సాధ్యమైనంతగా దోచేసి, ఇప్పుడు ఇంఛార్జ్ లను మార్చేస్తే మాత్రం ఫలితాలు మారిపోతాయా అని ప్రశ్నించారు. సొంత ఎమ్మెల్యేలపై నమ్మకం లేకనే ఇంచార్జ్ లను మార్చుతూ, ప్రజలకు జగన్ ఏం సంకేతాలు ఇస్తున్నాడని అడిగారు. రాష్ట్ర ప్రజలు సీఎం జగన్ పై ఆగ్రహంతో ఉన్నారని, వైసీపీపై ప్రజల్లో నమ్మకం పోయిందన్నారు. కరువు మండలాలను ప్రకటించకుండా, రైతులను సైతం మోసం చేసిన ఘనుడు జగన్ అంటూ ఎద్దేవా చేశారు.