Car Crashes Into Biden Convoy:


భద్రతా వైఫల్యం..


అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ సీక్రెట్ సర్వీస్ వెహికిల్‌ని ఓ ప్రైవేట్ కార్‌ ఢీకొట్టడం (Joe Biden Security Breach) అలజడి సృష్టించింది. స్థానిక మీడియా వెల్లడించిన వివరాల ప్రకారం..డిసెంబర్ 17న రాత్రి ఈ ఘటన జరిగింది. డెలావర్‌లోని హెడ్‌క్వార్టర్స్‌కి బైడెన్ దంపతులు వెళ్లారు. అక్కడ విందు ముగించుకున్న తరవాత బయల్దేరారు. తిరిగి వస్తున్నసమయంలోనే ఈ ప్రమాదం జరిగింది. కాన్వాయ్‌లోకి అకస్మాత్తుగా ఓ కార్‌ దూసుకొచ్చింది. సీక్రెట్ సర్వీస్‌ వెహికిల్‌ని బలంగా (Biden Secret Service Vehicle Collision) ఢీకొట్టింది. ఉలిక్కిపడిన భద్రతా సిబ్బంది వెంటనే ఆ కార్‌ని చుట్టుముట్టింది. ఈ ప్రమాదం జరిగిన చోటు నుంచి 130 అడుగుల దూరంలో బైడెన్ కార్‌ ఉంది. భద్రతా సిబ్బంది బైడెన్‌ కార్‌ వైపు దూసుకెళ్లింది. ఆయన కార్‌ని చుట్టు ముట్టింది. ఆ కార్‌ డ్రైవర్‌ని అదుపులోకి తీసుకున్నారు అధికారులు. జోబైడెన్‌తో పాటు ఆయన సతీమణి జిల్ బైడెన్ కూడా సురక్షితంగా ఉన్నట్టు వెల్లడించారు. 


"డిసెంబర్ 17న రాత్రి 8 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. అధ్యక్షుడు జో బైడెన్‌ కార్‌కి భద్రత కల్పించే సీక్రెట్ సర్వీస్ వెహికిల్‌ని ఓ ప్రైవేట్ కార్‌ ఢీకొట్టింది. విల్మింగ్‌టన్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో జో బైడెన్‌కి ఏమీ కాలేదు"


- భద్రతా అధికారులు


ప్రమాదం జరగడానికి ముందు జో బైడెన, ఆయన సతీమణి జిల్ బైడెన్ క్యాంపెయిన్ ఆఫీస్‌కి వెళ్లారు. అక్కడి స్టాఫ్‌తో కలిసి డిన్నర్ చేశారు. ఆ తరవాత అక్కడి నుంచి బయల్దేరారు. అంతకు ముందు రిపోర్టర్‌లు బైడెన్‌కి చాలా ప్రశ్నలు వేశారు. అక్కడి నుంచి బయల్దేరిన కాసేపటికే భారీ శబ్దం వినిపించింది. ఒక్కసారిగా మీడియా రిపోర్టర్‌లంతా ఘటనా స్థలానికి పరుగులు పెట్టారు.