Andhra Elections  Telangana Voters : తెలంగాణలో జరగనున్న ఎన్నికల్లో ఓట్లేయనున్న ఓటర్లలో కొన్ని లక్షల మందికి ఏపీలోనూ ఓటు ఉందని వైసీపీ ఏపీ సీఈవో ముఖేష్ కుమార్ మీనాకు ఫిర్యాదు చేసింది.   ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి మంత్రులు జోగి రమేష్, మేరుగ నాగార్జున, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి ఫిర్యాదు చేశారు.  నిబంధనల ప్రకారం ఒక వ్యక్తికి ఓటు ఒక చోటే ఉండాలని కోరామని చెప్పుకొచ్చారు. కొంత మందికి తెలంగాణ, ఏపీ రెండు చోట్లా ఓట్లు ఉన్నాయి.. ఇలాంటి వాటిని వెరిఫై చేసి చర్యలు తీసుకోవాలని విఙప్తి చేశామని  మంత్రి జోగి రమేష్ ప్రకటించారు.  వచ్చే ఎన్నికల్లో తాము ఓడిపోవడం ఖాయం అని టీడీపీ, జనసేనకు తెలుసు.. అందుకే ఓట్లు తొలగిస్తున్నారని మా మీద బురద చల్లుతున్నారు.. ప్రజాస్వామ్యంలో ఒక వ్యక్తికి ఒక ఓటు ఉండాలి అంటూ మంత్రి జోగి రమేష్ ఆరోపించారు.


డూప్లికేట్ ఓట్లను తీసేయాలన్నదే వైసీపీ డిమాండ్ 


 వైసీపీ నిబద్దత ఉన్న పార్టీ.. గతంలోనూ ఎన్నికల సమయంలో 16 లక్షలకు పైగా డూప్లికేట్ ఓట్లు ఉన్నాయని తెలిపామని మరో మంత్రి నాగార్జున తెలిపారు.  ఎన్నికల నియమావళి ప్రకారం ఒక వ్యక్తికి ఒకే ఓటు ఉండాలి.. తెలంగాణలో రేపటి ఎన్నికలు అయిన వెంటనే మళ్ళీ ఏపీకి వచ్చి ఓట్లు వేయటానికి కొంతమంది సిద్ధంగా ఉన్నారు అని ఆయన చెప్పుకొచ్చారు. ఇలా మూడు నెలల్లో ఓటు వేయటానికి వచ్చే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరాం.. అధికారులకు స్పష్టంగా ఆదేశాలు ఇవ్వాలని కోరాం.. రెండు చోట్ల ఓటు ఉన్న వారి వివరాలను పూర్తి ఆధారాలతో ఇచ్చాం.. విచారణ చేసి డూప్లికేట్ ఓట్లను ఎన్నికల సంఘం రద్దు చేయాలి అని మంత్రి మేరుగ నాగార్జున వెల్లడించారు.


దొంగే దొంగ అన్న చందంగా వైసీపీ వైఖరి ఉందన్న టీడీపీ 


వైసీపీ ప్రభుత్వ వైఖరి దొంగే దొంగ అన్న చందంగా ఉందని ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు చేశారు. బుధవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిని టీడీపీ ప్రతినిధి బృందం కలిసింది. అనంతరం అచ్చెన్న మీడియాతో మాట్లాడుతూ... వ్యవస్థ మీ చేతుల్లో పెట్టుకొని ఓడిపోతామని దుర్వినియోగం చేస్తున్నారన్నారు. ఏపీలో 8 జిల్లాల కలెక్టర్‌లు వైసీపీ కార్యకర్తలుగా వ్యవహరిస్తున్నారని.. వారిపై ఆధారాలతో సహా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఫార్మ్ 6, 7, 8 డుప్లికేట్‌లపై తాము పట్టిన అప్లికేషన్లు ఏమయ్యాయని ప్రశ్నించారు.


ఎనిమిది జిల్లాల కలెక్టర్లపై ఫిర్యాదు


పరిటాల సునీత   20 వేల ఓట్లు బోగస్ ఉన్నాయని చెపితే ఫామ్ 7 పెట్టమని కలెక్టర్ చెప్పారన్నారు. అదే జిల్లా ఉరవకొండలో మాత్రం 10 వేల ఓట్‌లు తీసేశారన్నారు. రెండు చోట్ల కలెక్టర్ ఒక్కరే అని చెప్పారు. 17 నియోజకవర్గాల్లో ఆధారాలతో సహా వైసీపీ ఓట్లు అక్రమాలపై ఫిర్యాదు చేశామన్నారు. 8 జిల్లాల కలెక్టర్‌లు చేస్తున్న తప్పులు అన్ని రికార్డ్ అవుతున్నాయ మీరు జాగ్రత్తగా ఉండాలన్నారు. శ్రీకాకుళం, కోనసీమ, గుంటూరు, అన్నమయ్య, బాపట్ల, తిరుపతి తదితర జిల్లాల కలెక్టర్‌లపై ఫిర్యాదు చేశామని అచ్చెన్నాయుడు వెల్లడించారు. 


ఏపీలో ఓటర్ల జాబితా అంశం రోజు రోజుకు రాజకీయంగా వివాదాస్పదం అవుతోంది.