Cotton Crop In Andhrapradesh: ఏపీలోని ఉమ్మడి గుంటూరు జిల్లాలో (Guntur District) అధికంగా పత్తి పంటను సాగు చేస్తారు. ఆ తర్వాత ఉమ్మడి కర్నూలు జిల్లా, ఉమ్మడి అనంతపురం జిల్లాల్లో అధికంగా పండిస్తారు. కర్నూలు జిల్లాలోని ఆలూరు, ఆదోని, ఆస్పరి, పత్తికొండ, కోడుమూరు, ఎమ్మిగనూరు ప్రాంతాల్లో అధికంగా పత్తిని సాగు చేస్తారు. అనంతపురం జిల్లాలోని తాడిపత్రి, గుంతకల్లు, ఉరవకొండ ప్రాంతాల్లోని రైతులు పత్తిని అధికంగా సాగు చేస్తారు. ఎప్పుడూ లాభాల బాట పట్టించే పత్తి పంట గత కొన్నేళ్లుగా సరైన దిగుబడి లేకపోవడం, స్థిరమైన ధరలు లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలో రైతులు పత్తి సాగు విస్తీర్ణాన్ని పూర్తిగా తగ్గించారు. ఏపీవ్యాప్తంగా దాదాపు 4 లక్షల హెక్టార్లలో పత్తిని సాగు చేస్తారు. అలాంటిది స్థిరమైన ధరలు దిగుబడి లేక పత్తి పంట సాగు వైపు రైతులు ముగ్గు చూపడం తగ్గింది.
స్థిరంగా ధరలు
ప్రస్తుతం రాష్ట్రంలో పత్తి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. క్వింటాల్ ధర రూ.8 వేలకు పైగా మార్కెట్లో కొనసాగుతోంది. కర్నూలు జిల్లాలోని ఆదోని పట్టణంలో ఉన్న పత్తి మార్కెట్‌కు ప్రతి రోజూ వేల క్వింటాళ్ల పత్తి వచ్చి చేరుతోంది. కాగా, గత వారం రోజులుగా ధర నిలకడగా కొనసాగుతుండడంతో రైతులు కాస్త సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మహారాష్ట్ర, తెలంగాణ నుంచి ముందుగా పత్తి మార్కెట్లకు చేరేది. అధిక వర్షాల కారణంగా కోత దశలో ఉన్న పత్తి పాడవడంతో అక్కడి పత్తి మార్కెట్‌కు రాకపోవడంతో ఏపీ నుంచి పత్తికి డిమాండ్ పెరిగింది. మరోవైపు దారాల రేటు పెరగకపోయినప్పటికీ పత్తి ఎగుమతులు డిమాండ్ పెరగడంతోనే పత్తి ధరలు నిలకడగా కొనసాగుతున్నాయని మార్కెట్లోని వ్యాపారస్తులు చెబుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రోజురోజుకు పత్తి ధరలు పెరుగుతున్నప్పటికీ సాగు విస్తీర్ణం తగ్గిందని అధికారులు అంచనా వేశారు.
ఆదోని మార్కెట్‌కు ప్రత్యేక స్థానం
పత్తి విక్రయాల్లో దేశంలోనే పేరు పొందిన మార్కెట్‌గా కర్నూలు జిల్లాలోని ఆదోని మార్కెట్ నిలుస్తోంది. అధికంగా పత్తి ఎగుమతులు చేసే మార్కెట్లలో ఇది కూడా ఒకటి. ప్రస్తుతం మార్కెట్‌కు గతేడాది ధర లేక నిల్వ చేసుకున్న పత్తిని తీసుకొచ్చి రైతులు విక్రయిస్తున్నారు. మరోవైపు ఇప్పుడిప్పుడే ఖరీఫ్‌లో సాగు చేసిన పత్తి మార్కెట్‌కి వస్తుంది. ప్రతి సంవత్సరం ఆదోని మార్కెట్‌లో పత్తి క్రయ విక్రయాలు రూ.1000 కోట్ల నుంచి రూ.1500 కోట్ల వరకూ జరుగుతాయి.
Also Read: Free Gas Scheme: మహిళలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ - ఉచిత గ్యాస్ సిలిండర్లపై కీలక ప్రకటన