AP BJP Vishnu: తిరుపతిలో ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ పేరుతో సభలు నిర్వహిస్తున్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ సభలను జయప్రదం చేయాలని పోస్టర్లు వేశారు. తిరుపతిలో నిర్వహిస్తున్న ఈ సభకు పెరియార్ అనే తమిళనాడు కవికి సంబంధం లేకపోయినా తిరుపతి అంతా ఆయన పోస్టర్లతో నింపేశారు. పెరియార్ హిందూ వ్యతిరేకిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన దేవుళ్లపై, ఆలయాలపై ఎన్నో ఘోరమైన వ్యాఖ్యలు చేశారు. వాటన్నింటినీ ఇప్పుడు పోస్టర్ల రూపంలో తిరుపతిలో వేశారు.
భగవద్గీత, పురాణాలను కాల్చివేయాలని టెంపుల్స్ ను, పండగులను పరిష్కరించాలని పెరియార్ ఎప్పుడో 80 ఏళ్ల కిందట ఇచ్చిన పిలుపుల్ని ఇప్పుడు పోస్టర్లుగా వేసి హిందూత్వాన్ని కించ పరుస్తున్నారు. హిందువుల ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయిన తిరుపతిలో ఇలా చేయడం వెనుక భారీ కుట్ర ఉందని అనుమానిస్తున్నారు.
ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ ఏఐవైఎఫ్ అనేది కమ్యూనిస్టు పార్టీలకు చెందిన అనుబంధ సంస్థ. నిరుద్యోగం, ఉపాధి అవకాశాలు, పాలకుల విధానాలు తదితర అంశాలపై బోధనలు, చర్చలు, తీర్మానాలు చేస్తామని సభలు పెడతారు. కానీ చేసేది మాత్రం తప్పుడు రాజకీయాలు, హిందూత్వంపై దాడి. ఇలాంటి వాటిని అసలు క్షమించకూడనదన్న అభిప్రాయం హిందూత్వ వాదుల నుంచి వస్తోంది.
ప్రజాస్వామ్యంలో ఎవరైనా అన్ని రకాల అభిప్రాయాలను వెలిబుచ్చవచ్చు. మన దేశంలో ఆ స్వేచ్చ ఎక్కువ ఉంది. అయితే అది.. ఇతరుల్ని కించపర్చడానికి రెచ్చగొట్టడానికి కాదు. అలా చేయడం నేరం. తిరుపతి లాంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రంలో ఇలాంటి పోస్టర్లు వేయడం... భగద్గీతను తగులపెట్టాలని చెప్పడం.. ఆలయాలను బహిష్కరించాలని పిలుపునివ్వడం అంటే చిన్న విషయం కాదని భావిస్తున్నారు. ఈ అంశంపై ప్రభుత్వ పెద్దలు దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది. కమ్యూనిస్టు పార్టీల యూత్ విభాగానికి.. పెరియార్ వాదనలకు ఏమైనా సంబంధం లేదు. ఉద్దేశపూర్వకంగా తప్పు ప్రచారం చేయడానికే ఇలా తిరుపతిలో సభ పెట్టి పోస్టర్లు వేశారని అనుకోవచ్చు.