ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో కేంద్ర ప్రభుత్వానికి చెందిన సంస్థలు మళ్లీ నిర్మాణాలు ప్రారంభిస్తున్నాయి. అమరావతిని రాజధానిగా ఖరారు చేసిన తర్వాత రాష్ట్రాల రాజధానుల్లో కేంద్ర ప్రభుత్వానికి చెందిన సంస్థల కార్యాలయాలను ఏర్పాటు చేయడానికి అప్పటి ప్రభుత్వం భూములు కేటాయించింది. చాలా సంస్థలు శంకుస్థాపనలు కూడా చేసి.. పునాదులు వేయడం వంటి పనులు కూడా చేశాయి. అయితే ప్రభుత్వం మారడం.. ప్రభుత్వ ప్రయారిటీలు మారడంతో రాజధాని నిర్మాణం ఎక్కడిదక్కడ ఆగిపోయింది. దీంతో కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా నిర్మాణాలు నిలిపివేశాయి. అయితే రెండున్నరేళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ నిర్మాణాలు ప్రారంభిస్తున్నాయి. 


తుళ్లూరు-రాయపూడి మధ్య  నేషనల్ జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కార్యాలాయనికి గత ప్రభుత్వం భూమి కేటాయించింది. రెండెకరాల స్థలంలో తొమ్మిది అంతస్తుల భవన నిర్మాణానికి శంకుస్థాపన కూడా చేశారు. కానీ తర్వాత ఎన్నికలు వచ్చి ప్రభుత్వం మారడంతో నిర్మాణం ఆగిపోయింది. శంకుస్థాపన చేసిన రెండు సంవత్సరాల తర్వాత ఇప్పుడు నిర్మాణ పనులను ప్రారంభించారు. తొలి విడతలో భాగంగా సంస్థ తమ కార్యాలయం చుట్టూ ప్రహరి నిర్మాణ పనులు చేపట్టారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కూడా అసంపూర్తిగా మిగిలిపోయిన నిర్మాణాలను పూర్తి చేయాలని నిర్ణయించింది. హైకోర్టు అదనపు భవనానికి కూడా శంకుస్థాపన చేశారు. ఈ పరిణామాలతో అమరావతిలో నిర్మాణాలు మళ్లీ జోరందుకుంటాయన్న అంచనాల్లో రైతులు ఉన్నారు. 


ఆంధ్రప్రదేశ్‌కు అమరావతే రాజధాని అని కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో స్పష్టం చేసింది. బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ సమాధానం ఇచ్చారు.  ఆంధ్రప్రదేశ్  రాజధాని అమరావతేనని స్పష్టం చేశారు. మూడు రాజధానుల ప్రతిపాదన ఏపీ ప్రభుత్వం వెనక్కి తీసుకుందని తెలిసిందన్నారు. విభజన తర్వాత ఏపీలో ఏర్పడిన మొదటి ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ఖరారు చేసిందని తెలిపారు. హోంశాఖ సహాయ మంత్రి ఇలాంటి ప్రకటన చేసిన మూడు రోజుల వ్యవధిలోనే కేంద్ర ప్రభుత్వానికి చెందిన విభాగం అమరావతిలో నిర్మాణాలు ప్రారంభించడం  అమరావతి రైతుల్ని సంతోషానికి గురి చేస్తోది. 


కేంద్రం అమరావతే రాజధాని స్పష్టత ఇవ్వడంతో ఇప్పుడు మిగతా కేంద్ర సంస్థలు కూడా నిర్మాణాలు ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని రాజధాని రైతులు ఆశా భావంతో ఉన్నారు. రాజధాని ఏదో తెలిస్తే తాము ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాన్ని నిర్మిస్తామని ఆ సంస్థ ఇటీవలే లేఖ రాసింది. ఈ పరిణామాలతో అమరావతి కోసం ఉద్యమిస్తున్న వారికి కాస్త ఊరట లభిస్తోంది.