Anantapur News : అనంతపురం జిల్లాలో డిస్మిస్డ్ కానిస్టేబుల్ ప్రకాష్ జిల్లా ఎస్పీ Hక్కీరప్ప కాగినెల్లిని ఎస్సీ , ఎస్టీ చట్టం కింద అరెస్టు చేయాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. దళితుడననే చిన్న చూపుతోనే .. తప్పుడు కేసులు, వాంగ్మూలాలతో తనను ఉద్యోగం నుంచి తొలగించారని ఆరోపిస్తూ ప్రకాష్ అనంతపురం టు టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా జిల్లా ఎస్పీ తోపాటు ఎఆర్ అడిషనల్ ఎస్పి హనుమంతు , డిఎస్పి లు రమాకాంత్ , మహబూబ్ బాషాలపై ఎఫ్ఐఆర్ నమోదయింది. విచారణ అధికారిగా పలమనేరు డీఎస్పీ గంగయ్యను డీఐజీ రవిప్రకాష్ నియమించారు.
ముందుగా డీఎస్పీ గంగయ్య.. కానిస్టేబుల్ ప్రకాష్‌ను విచారణను పిలిచారు. అనంతపురం పోలీస్ గెస్ట్ హౌస్‌లో విచారణాధికారి, పలమనేరు డీఎస్పీ గంగయ్య ఎదుట హాజరయ్యారు. విచారణకు అన్ని విధాలా సహకరిస్తానని డీఎస్పీకి ప్రకాష్ తెలిపారు. ‘ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో ఎస్పీ, ఏఎస్పీ, సీసీఎస్ డీఎస్పిలకు నోటీసులు జారీ చేయలేదు. వారిని అరెస్టు చేయడంతో పాటు.. ఉద్యోగాల నుంచి తొలగించిన అనంతరం విచారణ జరపాలి..’ అని పేర్కొన్నారు. ఆ మేరకు నిందితులను విధుల నుంచి తప్పించి ,అరెస్టు చేయాలని అనంతపురం రేంజ్ డీఐజీ రవి ప్రకాష్ ను ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాష్ కోరారు.
అనంతపురం రేంజ్ డీఐజీ రవి ప్రకాష్ ను కలిసి వినతి పత్రం అందించిన అనంతరం తొలగించిన కానిస్టేబుల్ ప్రకాష్ మీడియాతో మాట్లాడారు. ఎఫ్ఐఆర్ నమోదైన అధికారులను విధుల నుంచి తప్పించి , అరెస్టు చేసి ప్రాసిక్యూట్ చేయాలని తాను డీఐజీ కోరినట్లు వివరించాడు. ఎస్సీ ఎస్టీ కేసుకు ప్రత్యేక అధికారిగా నియమితులైన పలమనేరు డిఎస్పి గంగయ్య నిందితులకు నోటీసులు ఇవ్వకుండా ఫిర్యాదుదారుడైన తనకు మాత్రమే నోటీసులు ఇచ్చి విచారణ చేస్తుండడం నిబంధనలకు విరుద్ధమని డిఐజి దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. తమకు ప్రాణహాని ఉన్నట్లు ఆయనకు తెలపగా సానుకూలంగా స్పందించారని మీడియాకు చెప్పారు.
పోలీసు శాఖలో ఉన్న సమస్యలను ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకెళ్లాలని అనంతపురంలో కానిస్టేబుల్ ప్రకాష్ ప్లకార్డులను ప్రదర్శించడంతో వార్తల్లోకెక్కారు. ఆయనపై పోలీసు శాఖ అంతర్గతంగా విచారణ జరిపి.. ఓ కేసు విషయంలో ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను ట్రాప్ చేసి.. పెద్ద ఎత్తున నగదు, నగలు కాజేశారని రుజువు కావడంతో డిస్మిస్ చేస్తున్నట్లుగా ప్రకటించారు. కానీ ఆ మహిళ మీడియా ముందుకు వచ్చి .. ప్రకాష్ పై ప్రతీకారం తీర్చుకోవడానికి తనను పావుగా వాడుకున్నారని తాను ప్రకాష్‌పై ఎలాంటి ఫిర్యాదు చేయలేదని చెప్పడంతో కేసు అనూహ్య మలుపు తిరిగింది. ఆ వెంటనే ప్రకాష్ పోలీసు ఉన్నతాధికారులపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేయకపోతే కోర్టుకెళ్తానని ప్రకటించడంతో పోలీసులు కేసులు నమోదు చేశారు. విచారణ ప్రారంభమైనా ఆ పోలీసు ఉన్నతాధికారులు ఇంకా విధుల్లోనే ఉన్నారు. వారు విధుల్లో ఉండగా నిష్పాక్షికమైన విచారణ ఎలా సాధ్యమని కానిస్టేబుల్ ప్రకాష్ ప్రశ్నిస్తున్నారు.