Andhra divine Politis: శాసన మండలిలో వైసీపీ సభ్యులు వ్యవహరించిన తీరును నిరసిస్తూ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నేతలు అత్యవసరంగా జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. పవిత్రమైన సభలోకి రాజకీయ ప్రయోజనాల కోసం వేంకటేశ్వర స్వామి ఫోటోలను తీసుకురావడం దైవ అపచారమని కూటమి నేతలు మండిపడ్డారు. వైసీపీ నేతలు పదే పదే హిందూ దేవుళ్లను, భక్తుల మనోభావాలను కించపరుస్తున్నారని, ఈ అంశాన్ని సామాన్య ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. రాజకీయ పోరాటాల కోసం దైవ రూపాన్ని వాడుకోవడం వారి నైతిక పతనానికి నిదర్శనమని ధ్వజమెత్తారు.   

Continues below advertisement

శనివారం వేంకటేశ్వరుని ఆలయాల్లో పూజలు                        వైసీపీ నేతలు చేసిన ఈ అపచారానికి ప్రాయశ్చిత్తంగా  శనివారం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వేంకటేశ్వర స్వామి దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించాలని కూటమి శ్రేణులకు పిలుపునిచ్చారు. దేవాలయాల వద్ద సంప్రోక్షణ కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.   ఇప్పటికే తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంతో ప్రజల్లో ఉన్న ఆగ్రహానికి తోడు, తాజా ఘటనను కూడా జోడించి వైసీపీ హిందూ వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని కార్యాచరణ ఖరారు చేశారు. ప్రతి గ్రామంలోనూ వైసీపీ చేస్తున్న అపచారాల గురించి ప్రజలకు వివరించాలని నిర్ణయించారు.                                         

ఆధ్యాత్మిక తప్పిదాలపై వైసీపీని ఇరకాటంలోకి నెట్టే ప్లాన్                           

Continues below advertisement

కేవలం రాజకీయ నిరసనలకే పరిమితం కాకుండా, ఆధ్యాత్మిక కోణంలో కూడా వైసీపీని ఇరకాటంలో పెట్టేందుకు కూటమి సిద్ధమైంది. రాష్ట్రంలోని ప్రముఖ మఠాధిపతులు, స్వామీజీలు ,  హిందూ ధర్మ ప్రచారకులతో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. దేవుడి విషయంలో వైసీపీ అనుసరిస్తున్న తీరుపై ఆధ్యాత్మిక వేత్తల అభిప్రాయాలను సేకరించి, వారి ద్వారా భక్తులకు అవగాహన కల్పించనున్నారు. రాజకీయాల్లోకి దేవుడిని లాగి అపచారం చేయడం వల్ల కలిగే అనర్థాలను చర్చా వేదికల ద్వారా ప్రజలకు వివరించనున్నారు.                                        

హిందూ దేవుళ్లను కించ పరుస్తున్నారని ఆరోపణ                  గత ప్రభుత్వ హయాం నుండి నేటి వరకు వైసీపీ నేతలు పదే పదే హిందూ దేవుళ్లను కించపరుస్తున్నారని, దీనికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని కూటమి నేతలు హెచ్చరించారు. కల్తీ నెయ్యి ఉదంతం మొదలుకొని మండలిలో ఫోటోల ప్రదర్శన వరకు అన్నీ ఒక వ్యూహం ప్రకారం జరుగుతున్నాయని ఆరోపించారు. భక్తుల మనోభావాలతో ఆడుకుంటున్న వైసీపీకి రాజకీయంగా కాలం దగ్గర పడిందని, ఈ పోరాటాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు.