AP News Today:  సీఎం జగన్ (CM YS Jagan) అన్నమయ్య (Annamayya District), వైఎస్సార్ (YSR District)జిల్లాల్లో పర్యటించనున్నారు. రెండు రోజుల పాటు పర్యటన సాగనుంది. ముందుగా అన్నమయ్య జిల్లాలో సీఎం జగన్ పర్యటించనున్నారు. గురువారం ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి రాయచోటి చేరుకుంటారు. అక్కడ శాసనమండలి డిప్యూటీ చైర్‌పర్సన్ జకియా ఖానం (Mayana Jakiya Khanam) కుమారుడి వివాహ వేడుకలో పాల్గొంటారు. ఆ తర్వాత మాజీ ఎంపీపీ కుటుంబ సభ్యల వివాహ వేడుకలో పాల్గొంటారు. 


అక్కడి నుంచి బయలుదేరి వైఎస్సార్ జిల్లా పులివెందుల చేరుకుంటారు. అక్కడ శ్రీకృష్ణుడి ఆలయ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. తర్వాత పులివెందుల శిల్పారామాన్ని (Pulivendula Shilparamam) ప్రారంభిస్తారు. అనంతరం శ్రీ స్వామి నారాయణ్‌ గురుకుల్‌ స్కూల్‌కు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత ఏపీ కార్ల్‌ ప్రాంగణంలో అగ్రికల్చర్, హార్టికల్చర్‌ కళాశాలలు, స్టేట్‌ ఆఫ్‌ ఆర్ట్‌ సెంట్రల్‌ టెస్టింగ్‌ లేబరేటరీ, అగ్రికల్చర్, హార్టికల్చర్‌ ల్యాబ్‌లు ప్రారంభోత్సవం, ఆదిత్య బిర్లా యూనిట్‌ సందర్శిస్తారు. ఆ తర్వాత సీవీ సుబ్బారెడ్డి నివాసానికి వెళ్తారు. అక్కడి నుంచి బయలుదేరి ఇడుపులపాయ చేరుకుని వైఎస్సార్‌ ఎస్టేట్‌ గెస్ట్‌హౌస్‌లో రాత్రికి బస చేస్తారు.  


శుక్రవారం షెడ్యూల్
శుక్రవారం ఉదయం 8.30 గంటలకు ఇడుపులపాయలో ఆర్‌ కే వ్యాలీ పోలీస్‌ స్టేషన్‌ను సీఎం జగన్ ప్రారంభిస్తారు. ఆ తర్వాత ఎకో పార్క్‌ వద్ద వేముల మండలం ప్రజాప్రతినిధులతో సమావేశమవుతారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్ననికి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. ముఖ్యమంత్రి రెండు రోజుల పర్యటన నిమిత్తం కలెక్టర్ విజయరామరాజు, ఎస్పీ సిద్దార్థకౌసల్ ఏర్పాట్లను పర్యవేక్షించారు.


భద్రతా ఏర్పాట్లు పూర్తి
సీఎం జగన్ పర్యటన సందర్భంగా పులివెందుల, ఇడుపులపాయ ఎస్టేట్​లో హెలిప్యాడ్, వైఎస్సార్ ఘాట్.. ప్రాంగణాలను జిల్లా కలెక్టర్  విజయ్ రామరాజు, జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్, జేసీ గణేష్ కుమార్, అసిస్టెంట్ కలెక్టర్ భరద్వాజ్​లతో కలిసి పరిశీలించారు. బాకరాపురం హెలిప్యాడ్, శ్రీకృష్ణ దేవాలయం, ఎపీ సీఏఆర్ఎల్ ఆవరణలోని ఆదిత్య బిర్లా టెక్స్ టైల్స్, వ్యవసాయ, ఉద్యాన కళాశాల ప్రాంగణాలను కలెక్టర్ విజయ రామరాజు అధికారులతో కలిసి పర్యటించారు. అనంతరం శిల్పారామంలో ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాలను కలెక్టర్ పరిశీలించారు.


సీఎం జగన్ ప్రారంభోత్సవం చేసే.. జిప్ లైన్, దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం, మ్యూజిక్ వాటర్ ఫౌంటెన్​లను తనిఖీ చేయించారు.  ఇడుపులపాయ ఎస్టేట్, హెలిప్యాడ్, ముఖ్యమంత్రి బసచేసే గెస్ట్ హౌస్, నూతనంగా నిర్మితమైన ఆర్కే వ్యాలీ పోలీస్ స్టేషన్ భవనం, నెమళ్ల పార్కులో ప్రజా ప్రతినిధుల రివ్యూ మీటింగ్ సభా ప్రాంగంలో భద్రతా తనిఖీలు చేపట్టారు. 


సీఎం పర్యటనలో ప్రతి ఒక్కరు బాధ్యతగా విధులు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. పారిశుద్ధ్య పనులు పక్కాగా ఉండాలని, అలాగే తాగు నీటి కొరత లేకుండా చూడాలని సంబంధిత అధికారులను సూచించారు. ముఖ్యమంత్రి పాల్గొనే ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉండాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. భద్రత, పార్కింగ్ అంశాలలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందస్తుగా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని పోలీసు అధికారులను కలెక్టర్ ఆదేశించారు.