CM YS Jagan: రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపుల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు సత్వరం అందుతున్నాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. సీఎం క్యాంపు కార్యాలయంలో స్ర్తీ, శిశు సంక్షేమ శాఖపై సీఎం జగన్ బుధవారం ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ప్రతి ఇంటినీ జల్లెడ పట్టి మెరుగైన వైద్యం అందించేలా అధికార యంత్రాంగం పనిచేయాలని సూచించారు. ఆరోగ్య సురక్ష ద్వారా ఆరోగ్యాంధ్రప్రదేశ్ లక్ష్య సాధనే ప్రభుత్వ ధ్యేయమని సీఎం జగన్ గుర్తు చేశారు. ఆరోగ్య సురక్ష క్యాంపులతో రక్తహీనత, పౌష్టికాహార లోపం ఉన్న వారిని ప్రత్యేకంగా గుర్తించి వైద్యం అందిస్తున్నట్లు పేర్కొన్నారు.
ప్రజారోగ్య సమస్యలకు ఆరోగ్య సురక్ష క్యాంపులు అండగా నిలుస్తున్నాయని సీఎం జగన్ హర్షం వ్వక్తం చేశారు. సురక్ష క్యాంపుల్లో రక్తహీనత, పౌష్టికాహార లోపంతో గుర్తించిన చిన్నారులకు పౌష్టికాహారం అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అవసరమైనంత కాలం మందులు ఇచ్చే బాధ్యతను ఆరోగ్యశాఖ తీసుకుంటుందన్నారు. పౌష్టికాహారం ఇచ్చే బాధ్యతను మహిళా, శిశుసంక్షేమ శాఖ చేపట్టాలని సూచించారు. చిన్నారులు, మహిళల్లో పౌష్టికాహార లోపం, రక్తహీనత లోపాలను నివారించేందుకు వైద్య ఆరోగ్యశాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ మధ్య సమన్వయంతో పనిచేయాలన్నారు. దీని ద్వారా గ్రామస్థాయిలో రక్తహీనత సమస్యలను పూర్తిగా నివారించగలుగుతామని పేర్కొన్నారు.
ప్రభుత్వం అందించిన పౌష్టికాహారాన్ని చిన్నారులు, మహిళలు తీసుకుంటున్నారా? లేదా? రక్తహీనత సమస్య తగ్గుతుందా? లేదా? అన్నదానిపై విలేజ్ క్లినిక్స్ స్థాయిలో దృష్టి సారించాలని సీఎం జగన్ సూచించారు. వైద్య ఆరోగ్య శాఖ పీహెచ్‌సీ పరిధిలో ప్రతి నెలా గర్భిణులు, బాలింతలు, పిల్లలకు హిమోగ్లోబిన్ పరీక్షలు చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. జీవన శైలిలో మార్పులు కారణంగా వస్తున్న వ్యాధులు, వాటి నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, వ్యాయామాలపై అవగాహన కల్పించేలా క్యాంపులు నిర్వహించేలా ఉన్నతాధికారులు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. మండలం లేదా సచివాలయం పరిధిలో ప్రతినెలా ఒకసారి క్యాంపు నిర్వహించేలా చూడాలని సీఎం జగన్ సూచించారు.
ఖాళీ పోస్టుల భర్తీకి తక్షణ చర్యలు
స్ర్తీ, శిశు సంక్షేమ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ ప్రక్రియను చేపట్టాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. సంపూర్ణ పోషణ కార్యక్రమంపై సమీక్ష నిర్వహిస్తూ ఈ కార్యక్రమాన్ని ఉన్నతాధికారులు అత్యంత నిశితంగా పర్యవేక్షించాలని సూచించారు. అంగన్ వాడీల్లో సూపర్ వైజరీ వ్యవస్ధ ఎలా పనిచేస్తుందన్నదానిపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు. చిన్నారులు, గర్భిణులకు అందిస్తున్న డ్రై రేషన్ పంపిణీ పైనా అధికారులు ప్రత్యేక దృష్టిసారించాలన్నారు. రేషన్ నాణ్యత విషయంలో ఎక్కడా లోపాలు ఉండకూడదన్నారు.
సంపూర్ణ పోషణ కింద పౌష్టికాహారం అందిస్తున్న సమయంలోనే గర్భిణులు, పిల్లలకు టీకాలు అందించారా? లేదా? అని అధికారులను సీఎం జగన్ ఆరా తీశారు. ఒకవేళ టీకాలు మిస్ అయితే వెంటనే వేయించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పిల్లలు వయసుకు తగ్గ బరువు ఉన్నారా? లేదా? అంశాన్ని అక్కడే పరిశీలన చేసి పిల్లల్లో పౌష్టికాహారం లోపం ఉంటే వారిపై ప్రత్యేక శ్రద్ధపెట్టాలని సూచించారు. ఈ వివరాలను ఎప్పటికప్పుడు యాప్‌లో నమోదు అయ్యేలా చర్యలు తీసుకుని పౌష్టికాహారం అందించాలని సీఎం సూచించారు.