Ayodhya Ram Mandir Funds:


విదేశీ విరాళాలు..


అయోధ్య రామ మందిర నిర్మాణం దాదాపు పూర్తైంది. వచ్చే ఏడాది సంక్రాంతి నాటికి అయోధ్య రాముడు దర్శనమిస్తాడని శ్రీరామ్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ( Shri Ram Janmabhoomi Teerth Kshetra Trust) వెల్లడించింది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఆలయం ప్రారంభం కానుంది. అయితే...ఇందుకు సంబంధించి మరో కీలక అప్‌డేట్ వచ్చింది. నిర్మాణానికి విరాళాలు వెల్లువెత్తాయి. ఇప్పటి వరకూ దేశంలో నలుమూలల నుంచి వచ్చిన విరాళాలను మాత్రమే తీసుకుంది ట్రస్ట్. ఇకపై విదేశాల నుంచీ విరాళాలు సేకరించేందుకు లైన్ క్లియర్ అయింది. Foreign Contribution Regulation Act (FCRA) 2010 కింద విదేశాల్లోని ప్రజలు స్వచ్ఛందంగా విరాళాలు అందించేందుకు వీలవుతుంది. ఇన్నాళ్లూ అందుకు కేంద్ర హోం శాఖ దీనిపై ఆంక్షలు విధించింది. ఇప్పుడు వాటిని ఎత్తివేసింది. ఇదే విషయాన్ని ట్విటర్‌లో ట్రస్ట్ వెల్లడించింది. రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్‌ విదేశాల నుంచి విరాళాలు సేకరించేందుకు హోం మంత్రిత్వ శాఖ అనుమతినిచ్చినట్టు తెలిపింది. 


"రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్‌ ఇకపై విదేశాల నుంచి కూడా విరాళాలు సేకరించుకునేందుకు కేంద్ర హోం శాఖ వెసులుబాటునిచ్చింది. ఈ విరాళాలన్నీ ఒకే అకౌంట్‌లో ఉండేలా ఏర్పాట్లు చేస్తాం. ఆ అకౌంట్‌లో తప్ప మరే అకౌంట్‌కీ బదిలీ కావు"


- రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్‌


2020 నుంచి సేకరణ..


FCRA సెక్షన్ కింద ఓ స్వచ్ఛంద సంస్థ అకౌంట్ ఓపెన్ చేస్తే తప్ప విదేశాల నుంచి విరాళాలు తీసుకోడానికి అవకాశముండదు. ఈ ఏడాది జూన్‌లో FCRA లైసెన్స్ కోసం అప్లై చేసింది ట్రస్ట్. దాదాపు 2020 నుంచి ట్రస్ట్ ఈ విరాళాలు సేకరిస్తోంది. భక్తులు, ఆసక్తి ఉన్న వాళ్ల నుంచి వీటిని తీసుకుంది. వచ్చే ఏడాది జనవరి 21-24 మధ్యలో రామ మందిరం తెరుచుకోనుంది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. 


అయోధ్యలో రామాలయ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. వచ్చే ఏడాది జనవరి 22వ తేదీన ప్రాణప్రతిష్ఠ ఉండవచ్చని రామాలయ నిర్మాణ కమిటీ ఛైర్ పర్సన్ నృపేంద్ర మిశ్రా తెలిపారు. జనవరి 20వ తేదీ నుంచి 24వ తేదీ మధ్య ఏ రోజు అయినా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారని, కచ్చితమైన తేదీని ప్రధాన మంత్రి కార్యాలయం ఇంకా తెలియజేయలేదని నృపేంద్ర మిశ్రా వెల్లడించారు. ఈ భవ్య మందిరాన్ని మూడంతస్తుల్లో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఏడాది డిసెంబర్ చివరి నాటికి గ్రౌండ్ ఫ్లోర్ పూర్తి అవుతుందని నిర్మాణ కమిటీ ఛైర్‌ పర్సన్ తెలియజేశారు. రాముడి విగ్రహ తయారీపై ప్రత్యేక దృష్టి సారించింది రామ మందిర ట్రస్ట్. దాదాపు ఆరడుగుల రాముడి విగ్రహాన్ని తయారు చేయించి...వచ్చే ఏడాది సంక్రాంతి నాటికి ప్రతిష్ఠించాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. అయితే..ఈ విగ్రహ తయారీ కోసం ప్రత్యేక శిలలు తెప్పించింది. నేపాల్ నుంచి రెండు సాలగ్రామ శిలలను తరలించారు. ఇప్పటికే ఇవి అయోధ్యకు చేరుకున్నాయి. 


Also Read: ఫ్యుయెల్ కొనుక్కోడానికి డబ్బుల్లేక ఆగిన ఫ్లైట్‌లు, పాపం పాకిస్థాన్‌