CM Jagan On Amarnath Yatra :  అమర్ నాథ్ యాత్రలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శుక్రవారం భారీ వరద కారణంగా 15 మందికి పైగా మృతి చెందారు. మరో 40 మంది గల్లంతు అయినట్టు ఐటీబీపీ తెలిపింది. ఈ వరద విలయంలో తెలుగు రాష్ట్రాల భక్తులు చిక్కుకున్నారు. ఏపీ వాసులను స్వస్థలాలకు రప్పించేందుకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. ఏపీలోని పలు జిల్లాల నుంచి అమర్‌నాథ్‌ యాత్రకు భక్తులు వెళ్లినట్టుగా తెలుస్తోంది. విశాఖ వాసులు అమర్నాథ్ యాత్రలో చిక్కుకున్నారని తెలుస్తోంది. విశాఖ నుంచి సుమారు 90 మంది వెళ్లినట్టు సమాచారం. జులై 1న విశాఖ నుంచి కొంత మంది భక్తులు అమర్ నాథ్ వెళ్లారు. అమర్‌నాథ్‌ యాత్రలో ఒక్కసారిగా కుండపోత వర్షం, ఆకస్మాత్తుగా వరదలు రావడంతో భక్తులు వరదలో కొట్టుకుపోయారు. ఏపీ నుంచి వెళ్లిన యాత్రికుల భద్రతకు చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకుని భక్తులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా రాష్ట్రానికి తీసుకురావాలని సూచించారు. సీఎం జగన్ ఆదేశాలతో  సీఎంవో అధికారులు దిల్లీలోని ఏపీ రెసిడెంట్‌ కమిషనర్‌ ప్రవీణ్‌ ప్రకాష్‌తో మాట్లాడారు. అడిషనల్‌ రెసిడెంట్‌ కమిషనర్‌గా ఉన్న హిమాంశు కౌసిక్‌ను వెంటనే శ్రీనగర్‌కు పంపించినట్లు తెలుస్తోంది.


రాజాసింగ్ కు తప్పిన ప్రమాదం 


అమర్‌నాథ్‌ యాత్రలో కుండపోత వాన, ఆకస్మాత్తుగా వరదలు రావ‌టంతో భ‌క్తుల స‌మాచారంపై తీవ్రస్థాయిలో ఆందోళ‌న వ్యక్తం అవుతుంది. విజ‌య‌వాడ నుంచి అమ‌ర్ నాథ్ యాత్రకు వెళ్లిన శంక‌ర్  కుటుంబం, చివ‌రి నిమిషంలో కొండపైకి వెళ్లకుండా రాత్రి స‌మ‌యంలో ప్రయాణం వాయిదా వేసుకున్నారు. అదే వారి ప్రాణాల‌ను కాపాడింద‌ని అంటున్నారు. ఆర్మీ అందిస్తున్న సేవ‌ల‌ను కొనియాడారు. అమర్ నాథ్ యాత్రలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు పెను ప్రమాదం తప్పింది. రాజాసింగ్ కు అత్యంత సమీపంలో అకాల వరదల కారణంగా పదుల సంఖ్యల గల్లంతు అయ్యారు. టెంట్లు కొట్టుకుపోయి పెను ప్రమాదం జరిగింది. ఆర్మీ అప్రమత్తతతో ప్రాణనష్టం కాస్త తగ్గిందని, తాను సేఫ్ గా బయటపడ్డానని ఎమ్మెల్యే రాజాసింగ్ తెలిపారు. ప్రజల ఆశీస్సుల వల్లే తాను ప్రమాదం నుంచి భయటపడ్డానని చెబుతూ శ్రీనగర్ నుంచి వీడియో విడుదల చేశారు.  కుటుంబ సభ్యులతో అమర్ నాథ్ యాత్రకు వెళ్లారు రాజాసింగ్.  


బండి సంజయ్ తీవ్ర దిగ్భ్రాంతి  


కుండపోత వర్షాల కారణంగా అమర్నాథ్ యాత్రలో చోటు చేసుకున్న విషాదంపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. అమర్నాథ్ యాత్రికులను రక్షించేందుకు ఎన్​డీఆర్​ఎఫ్​, ఎస్​డీఆర్​ఎఫ్​, ఐటీబీపీ సహా ఇతర సంస్థలు యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాయని తెలిపారు.  సహాయక చర్యలను మరింత వేగవంతం చేయాలని కోరారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సాయం అందించాలని కోరారు.