Breaking News Live: శ్రీకాకుళం జిల్లాలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం 

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 21 Mar 2022 08:22 PM
శ్రీకాకుళం జిల్లాలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం 

శ్రీకాకుళం జిల్లా  రాజాం పరిసర ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. దీంతో ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. ఈదురు గాలులు బలంగా వీయడంతో పలుచోట్ల కరెంట్ స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. ద్విచక్ర వాహనాలు, షాపులు పలుచోట్ల ధ్వంసమయ్యాయి. ఇప్పటికే విద్యుత్ శాఖ అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. బంగాళాఖాతంలో అసమి తుపాను కారణంగా ఏపీలోని పలుచోట్ల వర్షాలు పడుతున్నాయి. కాకినాడలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది.

వచ్చే ఎన్నికల్లో 105 స్థానాలు గెలుస్తాం : సీఎం కేసీఆర్ 

టీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో 95 నుంచి 105 స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలుపై మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు తీర్మానాలు చేసి కేంద్రానికి పంపాలని నిర్ణయించారు. 30 నియోజకవర్గాల్లో ఒక స్థానం కాంగ్రెస్ గెలుస్తుందన్నారు. బీజేపీకి మతపిచ్చి పట్టుకుందని ఆరోపించారు.  

Drugs: పటాన్‌ చెరులో భారీగా డ్రగ్స్ స్వాధీనం

పటాన్ చెరులో భారీ స్థాయిలో నార్కోటిక్ డ్రగ్స్‌ను పోలీసులు పట్టుకున్నారు. పాకిస్థాన్‌కు పంపేందుకు సిద్ధంగా ఉన్న 2500 కిలోల ట్రమెడోల్‌ మెడికల్‌ డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. లూసెంట్‌ డ్రగ్స్ కంపెనీలో ఈ డ్రగ్‌ తయారీ అయినట్టు తెలుస్తోంది. 


 

Paddy Procurement: TRSLP సమావేశం ప్రారంభం

TRSLP Meeting: ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ శాసనసభాపక్ష (TRSLP) సమావేశం ప్రారంభం అయింది. భవిష్యత్తు కార్యాచరణపై పార్టీ నేతలతో ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చిస్తున్నారు. ఈ భేటీలో ముఖ్యంగా యాసంగి ధాన్యం కొనుగోళ్లపై చర్చ జరుగుతోంది. రబీలో పండిన ధాన్యాన్ని కొనేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. ధర్నాలు, నిరసనలకు టీఆర్‌ఎస్‌ఎల్పీ భేటీలో రూపకల్పన జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ భేటీలో పార్టీ కార్యవర్గ సభ్యులతో పాటు జిల్లా అధ్యక్షులు, జడ్పీ ఛైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్‌ల అధ్యక్షులు, రైతు బంధు సమితుల జిల్లా అధ్యక్షులు పాల్గొన్నారు. ఈ భేటీ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రుల బృందం ఢిల్లీకి వెళ్లనుంది. ఢిల్లీ పర్యటనలో ప్రధాని, కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది. పంజాబ్ తరహాలో రాష్ట్రంలోనూ పూర్తి ధాన్యం కొనాలని కేంద్ర సర్కార్‌ను మంత్రులు కోరనున్నారు.

TDP Protests: లోకేష్ ఆధ్వర్యంలో టీడీపీ నిరసన, సీఎం జగన్ చిత్రపటానికి మద్యంతో అభిషేకం

పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంతో పాటు రాష్ట్రంలో కల్తీ సారా మరణాలపై వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష టీడీపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. అమరావతిలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆధ్వర్యంలో నిరసనలో పాల్గొన్న టీడీపీ నేతలు సీఎం వైఎస్ జగన్ చిత్రపటానికి మద్యంతో అభిషేకం చేశారు.





AP Assembly News: ఏపీ అసెంబ్లీలో టీడీపీ సభ్యుల సస్పెన్షన్

ఏపీ అసెంబ్లీలో మరోసారి గందరగోళం నెలకొంది. దీంతో టీడీపీ ఎమ్మెల్యేలను స్పీకర్ ఒకరోజు సస్పెండ్ చేశారు. ప్రశ్నోత్తరాల సమయంలో చర్చ జరుగుతుండగా, కల్తీ సారా, మద్యం ధరలపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు. పెద్దగా నినాదాలు, పోడియంను చుట్టుముట్టి నిరసనలు చేశారు. వారి తీరుపై స్పీకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు వీధి రౌడీలు కాదని, ఇలా ప్రవర్తించడం సరికాదని అన్నారు. 

Nellore: నెల్లూరు జిల్లాలో యువతి గొంతు కోసిన యువకుడు

నెల్లూరు జిల్లాలోని వెంకటగిరిలో ఓ ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. ఓ యువతి గొంతు కోశాడు. కాలేజీమిట్టలో చెంచుక్రిష్ణ అనే వ్యక్తి ఇంటర్ విద్యార్థిని గొంతు కోశాడు. ప్రేమించలేదనే కోపంతో ఈ దారుణానికి ఒడిగట్టాడు. యువతి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించారు. 

Tirumala Updates: శ్రీవారి సేవలో బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి

తిరుమల శ్రీవారిని బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా.. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.. అనంతరం ఆలయ వెలుపలకు వచ్చినా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తిరుపతి కోర్టులో డిఫర్మేషన్ కేసు టీటీడీ తరపున వేయడం జరిగిందన్నారు.. ఆంధ్రజ్యోతి పత్రికపై 100 కోట్ల రూపాయల పరువు నష్ట దావాను వేశాంమని, క్రిస్టియానిటీ తిరుమలకు తీసుకొచ్చారనే అవాస్తవాని ఆంధ్రజ్యోతి ప్రచురించిందని, ఇలాంటి అసత్య ప్రచారం సమాజానికి ప్రమాదకరంమన్నారు..ఆంధ్రజ్యోతి ఛానెల్ పై ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం జరిగిందని ఆయన ఆయన తెలిపారు..

Srikakulam: పలాసలో ఎలుగుబంటి హల్ చల్

అరణ్యంలో ఉండాల్సిన ఎలుగుబంటి జనారణ్యంలో హల్ చల్ చేయడంతో ప్రజలు భయంతో పరుగులు పెట్టిన ఘటన
శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వే స్టేషన్ లో చోటు చేసుకుంది. ఆదివారం రాత్రి 9:30 గంటల సమయంలో  ఓ ఎలుగు బంటి కాశీబుగ్గ లోని నర్సిపురం మీదగా పలాస రైల్వే స్టేషన్ లోకి చొరబడింది. ఒకటో నెంబర్ ప్లాట్ ఫాం శివారున  కాసేపు హల్ చల్ చేసింది. ఎలుగును చూసిన ప్రయాణికులు భయాందోళనకు గురై స్టేషన్ మాస్టర్ రూమ్ వైపు పరుగులు తీశారు. ఊర కుక్కలు ఎలుగును వెంబడించడంతో సమీపంలోని పంప్ హౌస్ ప్రాంతంలో చక్కర్లు కొట్టి సమీపంలోని పంట పొలాల వైపు ఉడాయించింది. విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు, పోలీసులు పంపు హౌస్ ప్రాంతానికి చేరుకుని ప్రజలెవరూ ఇళ్ల నుంచి వెలుపలికి రావద్దని హెచ్చరించారు. ఎలుగుబంటి కోసం గాలింపు చర్యలు చేపట్టారు ‌.

Paritala Sunitha: రాప్తాడు ఎమ్మెల్యేపై మాజీ మంత్రి పరిటాల సునీత సంచలన వ్యాఖ్యలు

రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‍రెడ్డిపై మాజీ మంత్రి పరిటాల సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘శ్రీరాములయ్య సినిమా షూటింగ్‍లో కారు బాంబు పెట్టించింది మీరు కాదా? 26 మందిని పొట్టన పెట్టుకోవడంలో ప్రకాష్‍రెడ్డి కూడా భాగస్తుడు. మా చరిత్ర కాదు.. ప్రకాష్‍రెడ్డి తన చరిత్ర తెలుసుకోవాలి. ప్రకాష్‍రెడ్డి అవినీతిపై సినిమా తీసేరోజు దగ్గర్లోనే ఉంది. ప్రకాష్‍రెడ్డి ఇంట్లో ఐదుగురు ఎమ్మెల్యేలు మా కుటుంబాన్ని విమర్శించడం కాదు.. ప్రాజెక్టులు పూర్తి చేసి చూపించు. పరిటాల రవి గురించి మాట్లాడితే సహించేదు లేదు’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Background

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పడిన అల్పపీడనం తీవ్రరూపం దాల్చి వాయుగుండంగా మారింది. వాయుగుండం నేడు అసని తుఫాన్‌గా తీవ్ర రూపం దాల్చనుందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. ఆ తరువాత అసని తుఫాన్ ఉత్తర ఈశాన్య దిశగా కదులుతూ మార్చి 22 ఉదయం నాటికి బంగ్లాదేశ్, దానిని అనుకుని ఉన్న ఉత్తర మయన్మార్ తీరానికి మార్చి 23న చేరుకుంటుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. వీటి ప్రభావంతో ఏపీ, తెలంగాణతో పాటు యానాం, అండమాన్ నికోబార్ దీవులలో నేటి నుంచి మూడు రోజులపాటు వర్షాలు కురవనున్నాయి.  


దక్షిణ బంగాళాఖాతంలో మార్చి 16న ఏర్పడిన అల్పపీడనం తీవ్రరూపం దాల్చింది. ప్రస్తుతం వాయుగుండం అసని తుఫాన్‌గా మారింది. ఇది తూర్పు ఈశాన్య దిశగా కదులుతూ ఆగ్నేయ బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న తూర్పు ఈక్వటోరియల్ హిందూ మహాసముంద్రం మీదగా కదిలి పోర్ట్ బ్లెయిర్‌కు 170 కి.మీ దక్షిణంగా, నికోబార్ దీవులకు 110 కి.మీ వాయువ్యంగా ఉంటుందని భారత వాతావరణ కేంద్రం, అమరావతి కేంద్రం తెలిపాయి. దక్షిణ అండమాన్ సముద్రం మీదుగా కదులుతూ శనివారం తూర్పు ఈశాన్య దిశగా కదులుతూ అల్పపీడనం తుఫాన్‌గా బలపడింది. 


ఉత్తర కోస్తాంధ్ర యానాంలో.. (Temperature in Andhra Pradesh)
అల్పపీడనం, వాయుగుండం ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో నేటి నుంచి మూడు రోజులపాటు వర్షాలు కురవనున్నాయి. అసని తుఫాన్ నేపథ్యంలో మరోవైపు తీరం వెంట గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. మత్స్యకారులు వేటకు వెళ్లడం క్షేమదాయకం కాదని వాతావరశాఖ హెచ్చరించింది. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. గత రెండు వారాలుగా పెరుగుతున్న ఎండల నుంచి ఉత్తర కోస్తా, యానాం ప్రజలకు కాస్త ఊరట లభించనుంది. గత మూడు రోజులతో పోలిస్తే ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. . 


దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ..
అసని తుఫాన్ కారణంగా దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో నేటి నుంచి మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.  రాయలసీమలో చలి గాలులు వేగంగా వేచనున్నాయి.  చిత్తూరు, అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయి. కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.


తెలంగాణ వెదర్ అప్‌డేట్ (Temperature in Andhra Pradesh)
తెలంగాణలో హైదరాబాద్ సహా కొన్ని చోట్ల చిరు జల్లులు కురిశాయి. దీంతో నగరవాసులకు ఎండల నుంచి కాస్త ఉపశమనం లభించింది. వర్షాల నేపథ్యంలో ఉష్ణోగ్రత 40 కిందకి దిగొచ్చింది. అయినా పగటి పూట వేడ అధికంగా ఉంటుంటే, సాయంత్రానికి చిరుజల్లులు పడుతున్నాయి. ఖమ్మం, నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం, మిర్యాలగూడలో పగటి ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల మేర తగ్గాయి. భగభగ మండే రామగుండంలో ఉష్ణోగ్రత 35.8 డిగ్రీలకు పడిపోయింది.


తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర నేడు (Todays Gold Rate) స్థిరంగా ఉంది. ఉక్రెయిన్ - రష్యా యుద్ధ వాతావరణంతో కొద్ది రోజులుగా ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరల్లో భారీ ఎత్తున పెరిగిన సంగతి తెలిసిందే. వెండి ధర కూడా నేడు స్థిరంగా ఉంది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్‌ (Hyderabad Gold Rate) మార్కెట్‌లో రూ.47,300 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర ప్రస్తుతం రూ.51,600 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో నేడు రూ.72,300 వద్ద ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.


ఏపీలో బంగారం రేట్లు ఇవీ.. (Gold Rates in Andhrapradesh)
ఇక విశాఖపట్నం (Gold Rate in Vizag) మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,300 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,600గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.72,300 గా ఉంది. విజయవాడలోనూ పసిడి ధర అంతే పెరిగింది. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.47,300 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.51,600గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.72,300 గా ఉంది.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.