CM Jagan Madanapalle Visit: జగన్ ప్రభుత్వం ఏపీ విద్యార్థులకు శుభవార్త చెప్పింది. జగనన్న విద్యా దీవెన పథకంలో భాగంగా నాలుగో విడత నిధులను రేపే అంటే నవంబర్ 30వ తేదీనే విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేయనుంది. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో జరిగే ఓ కార్యక్రమంలో సీఎం జగన్ బటన్ నొక్కి ఈ నిధులు విడదల చేయబోతున్నారు. 2022వ సంవత్సరానికి గాను దాదాపు 10.85 లక్షల మంది విద్యార్ధులకు రూ. 709 కోట్లను జగన్‌ మదనపల్లెలో విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డిగ్రీ పీజీ చదువుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ, ముస్లిం, కాపు, క్రిస్టియన్ మైనారిటీ విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఈ నిధులు జమ కానున్నాయి. ఇందు కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమం కోసం సీఎం జగన్ ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయల‌్దేరనున్నట్లు సమాచారం. 


వాతావరణ మార్పులతో వాయిదా పడిన కార్యక్రమం..


అయితే ఈనెల 25వ తేదీనే సీఎం జగన్ ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సి ఉండగా వాతావరణ మార్పుల వల్ల వాయిదా పడింది. 24, 24వ తేదీల్లో వాయుగుండం ప్రభావం ఉండడం వల్ల సీఎం కార్యాలయ అధికారులు మదనపల్లె పర్యటనను ఈనెల 30వ తేదీకి మార్చారు. ఉన్నత విద్యను చదవాలనుకుని ఆర్థికంగా ఇబ్బంది పడే వారి కోసం ఈ పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. పేద విద్యార్థుల భోజన, వసతి కోసం ఇబ్బంది పడకుండా ఏటా ఐటీఏ విద్యార్థులకు 10 వేలు రూపాయలను రెండు వాయిదాల్లో జమ చేస్తోంది. పాలిటెక్నిక్ విద్యార్థులకు అయితే 15 వేలు, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు నేర్చుకునే వారికి 20 వేల రూపాయల చొప్పున అందిస్తోంది. 


ఎంత మంది పిల్లలుంటే అంత మందికి..


అయితే  వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అందిస్తున్న ఈ విద్యా దీవెన,  వసతి దీవెన పథకాలకు లిమిట్స్‌ లేవని... కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఫీజు రీఎంబర్స్ మెంట్ ఇస్తున్నామని ప్రభుత్వం ప్రకటించింది. కుటుంబంలో ఎంతమంది చదువుతుంటే అంతమందికి, వారి తల్లుల ఖాతాల్లో సంవత్సరానికి రెండు దఫాల్లో ఇస్తున్నారు. కాలేజీల్లో జవాబుదారీతనం పెరిగేలా, తల్లులకు ప్రశ్నించే హక్కు కల్పిస్తూ, తల్లుల సాధికారతకు పట్టం కడుతూ ఆర్ధిక సాయం నేరుగా విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నట్లుగా ప్రభుత్వం తెలిపింది. తల్లుల ఖాతాల్లో జమ అయిన నగదును వారు తీసుకెళ్లి కాలేజీల్లో కట్టాల్సి ఉంటుంది. 


కాలేజీల్లో వసతుల్ని పరిశీలించి.. ఏమైనా ఇబ్బందులు ఉంటే కాలేజీ యాజమాన్యాలను విద్యార్థుల తల్లులు ప్రశ్నించవచ్చని జగన్ తెలిపారు అప్పుడు కాలేజీల్లో జవాబుదారీతనం పెరుగుతుందన్నారు. గత ప్రభుత్వం పెట్టిన ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ బకాయిలు రూ. 1,778 కోట్లతో సహా ఇప్పటివరకు జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాల క్రింద జగన్‌ ప్రభుత్వం అందించిన మొత్తం సాయం రూ. 10,994 కోట్ల అని ప్రభుత్వం తెలిపింది.