కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. యాభై పడకలు దాటిన ప్రభుత్వాసుపత్రుల్లో సొంతంగా మెడికల్‌ ఆక్సిజన్‌ తయారీ యూనిట్లను నెలకొల్పడంపై సీఎం జగన్ ప్రత్యేక దృష్టిపెట్టారు. ఫలితంగా రాష్ట్రంలోని అన్నిజిల్లాల్లోని వివిధ ఆస్పత్రుల్లో 133 పీఎస్‌ఏ మెడికల్‌ ఆక్సిజన్‌ తయారీ ప్లాంట్లు అందుబాటులోకి వచ్చాయి. వీటిని ముఖ్యమంత్రి జగన్.. సోమవారం వర్చువల్‌ పద్ధతిలో ప్రారంభించనున్నారు. ఒమిక్రాన్‌ ప్రభావంతో కేసులు వేగంగా పెరుగుతాయని వైద్యులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఈ ప్లాంట్లు కొవిడ్‌ మహమ్మారి బారినపడ్డ వారికి చికిత్స అందించడంలో కీలక పాత్ర పోషించనున్నాయి.


కొవిడ్‌ మహ్మమారి కారణంగా మెడికల్‌ ఆక్సిజన్‌ అన్నది అత్యంత కీలకంగా మారింది. ట్యాంకర్ల ద్వారా మెడికల్‌ ఆక్సిజన్‌ తరలింపు కూడా అత్యంత సవాలుగా మారింది. వీటికోసం ప్రత్యేక మార్గాలు, ప్రత్యేక ఏర్పాట్లు, ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేయాల్సిన పరిస్థితిని మొదటి, సెకండ్‌ వేవ్‌లో స్పష్టంగా చూశాం. గడచిన రెండేళ్లుగా మెడికల్‌ ఆక్సిజన్‌ డిమాండ్‌ విపరీతంగా పెరిగిపోయిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలకు శ్రీకారం చుట్టింది. 


ఆస్పత్రుల ఆవరణలోనే ఈప్లాంట్లను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రెజర్‌ స్వింగ్‌ అబ్జార్షన్‌ పద్ధతిలో తయారైన ఆక్సిజన్‌, పైపులైన్ల ద్వారా నేరుగా రోగికి చేరుతుంది. అలాగే సిలిండర్లను కూడా ఈ ఆక్సిజన్‌తో నింపవచ్చు. వివిధ సామర్థ్యాలతో ఈ పీఎస్‌ఏ ప్లాంట్లను ఏర్పాటు చేశారు. 1000 ఎల్‌పీఎం ( లీటర్‌ పర్‌ మినిట్‌), 500 ఎల్‌పీఎం సామర్థ్యంతో వీటిని ఏర్పాటు చేశారు.


పరిస్థితిని బట్టి, ఆస్పత్రి సామర్థ్యాన్ని అనుసరించి ఒకటి కన్నా ఎక్కువ ప్లాంట్లు కూడా నెలకొల్పారు. శ్రీకాకుళంలో 12 చోట్ల, విజయనగరంలో 2 చోట్ల, విశాఖపట్నలలో 12 చోట్ల, తూర్పుగోదావరిలో 13 చోట్ల, పశ్చిమగోదావరిలో 7 చోట్ల, కృష్ణాలో 12 చోట్ల, గుంటూరులో 7 చోట్ల, ప్రకాశంలో 5 చోట్ల, నెల్లూరులో 7 చోట్ల, చిత్తూరులో 21 చోట్ల, కడపలో 8 చోట్ల, అనంతపురంలో 9 చోట్ల, కర్నూలులో 9 చోట్ల.. మొత్తంగా 124 ప్రాంతాల్లో 133 ప్లాంట్లను ఏర్పాటు చేశారు. అదనంగా మరో 11 ప్లాంట్లకు పనులు జరుగుతున్నాయి. మొత్తంగా 144 ప్లాంట్లు రాష్ట్రంలో ఉన్నాయి. వీటిమొత్తం సామర్థ్యం దాదాపుగా 1.2 లక్షల ఎల్‌పీఎం పైమాటే. అంటే ఒక నిమిషలలో 1.2 లక్షల లీటర్లకు పైగా ఈ ప్లాంట్ల నుంచి తయారు అవుతుంది. 


కొవిడ్‌ థర్డ్‌ వేవ్‌ను ఎదుర్కొనే చర్యల్లో భాగంగా 18,268 ఆక్సిజన్‌ పైపులైన్లను రూ.40.07 కోట్లతో ఏర్పాటు చేశారు. ఇప్పుడున్న పైపులైన్లను మరింత బలోపేతం చేయడానికి 6,151 ఆక్సిజన్‌ లైన్లు వేయడంతోపాటు మరో రూ.50 కోట్లు ఖర్చుచేశారు. లిక్విడ్‌ మెడికల్‌ ఆక్సిజన్‌ నిల్వకోసం 399 కిలో లీటర్ల సామర్థ్యంతో ట్యాంకర్లను 35 ఆస్పత్రుల్లో రూ.15 కోట్లతో ఏర్పాటు చేశారు. మరో 39 ఆస్పత్రుల్లో 390 కిలో లీటర్ల సామర్థ్యంతో రూ.16.3 కోట్లు ఖర్చు చేసి ట్యాంకర్లను ఏర్పాటు చేశారు. 


అంతేగాక లిక్విడ్‌ మెడికల్‌ ఆక్సిజన్‌ నిల్వ, రవాణాకోసం 20 కిలో లీటర్ల సామర్థ్యం ఉన్న 25 క్రయోజనిక్‌ ఐఎస్‌ఓ ట్యాంకర్లను రూ. 15.25 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. 20 వీఆర్‌ఎల్‌ ల్యాబ్స్‌ను రూ. 6.22 కోట్లతో ఏర్పాటు చేసి టెస్టింగ్‌ సామర్థ్యాన్ని గణనీయంగా రాష్ట్ర ప్రభుత్వం మెరుగుపరిచింది. మరో రూ.21.93 కోట్లతో కీలకమైన సివిల్‌ వర్క్స్‌ను పూర్తిచేసింది. 26,746 డి టైప్‌ ఆక్సిజన్‌ సిలెండర్లను కొనుగోలు చేసింది. ఈసీఆర్పీ–2 కింద 64.05 కోట్లతో పీడియాట్రిక్‌ కేర్‌ ఆక్సిజన్‌ సపోర్ట్‌ ఉన్న బెడ్స్‌ను 183 సీహెచ్‌సీల్లో ఏర్పాటు చేశారు. 230 కిలోలీటర్ల సామర్థ్యం ఉన్న ట్యాంకులను 23 ఆస్పత్రుల్లో రూ.8.05 కోట్లతో ఏర్పాటు చేయనున్నారు.


వీటన్నింటి కోసం.. రాష్ట్ర ప్రభుత్వం మొత్తంగా రూ.426కోట్లను ఖర్చు చేసింది. ఈ సదుపాయలన్నింటినీ సీఎం జగన్.. సోమవారం ప్రారంభించనున్నారు. ఈ రూ.426 కోట్లే కాకుండా క్లినికల్‌ మేనేజ్‌మెంట్‌ చర్యల్లో భాగంగా మెడికల్‌ పరికరాలు, కొవిడ్‌ కిట్లు, ల్యాబ్‌ ఎక్విప్‌మెంట్‌ కోసం రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.297.36 కోట్లు ఖర్చు చేసింది. ఇదంతా మూడోవేవ్‌ను ఎదుర్కొనే చర్యల్లో భాగమే.


ఒమిక్రాన్‌ వైరస్‌ నిర్ధారణ కోసం జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ ల్యాబ్‌ను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దేశంలో కేరళ తర్వాత మన రాష్ట్రంలోని విజయవాడలో ఈ ల్యాబ్‌ ఏర్పాటైంది.


Also Read: Minister Appalaraju: చంద్రబాబు ఇది రాసి పెట్టుకో... ఏపీకి జగన్ శాశ్వత ముఖ్యమంత్రి... మంత్రి సీదిరి అప్పలరాజు


Also Read: Tirupati: లైంగిక వేధింపులు వర్సెస్ చికెన్ పకోడా ... ఎస్వీ ఓరియంటల్ కళాశాలలో రచ్చ రచ్చ