YSR Vahana Mitra: ఆటో డ్రైవర్లకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్ అందించింది. వైఎస్సార్ వాహనమిత్ర నగదును ఈ నెల 29న విడుదల చేయనుంది. ఆ రోజున కాకినాడలో జరిగే కార్యక్రమంలో సీఎం జగన్ కంప్యూటర్ బటన్ నొక్కి డబ్బులు విధుల చేయనున్నారు. ఈ పథకం కింద ఆటో, ట్యాక్సీ, మాక్సీ డ్రైవర్ల అకౌంట్లలో రూ.10 వేలు జమ చేయనున్నారు. అనంతరం బహిరంగ సభలో జగన్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. జగన్ సభకు ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.


తాజాగా కాకినాడలో జగన్ పాల్గొనే సభ ఏర్పాట్లను కలెక్టర్ కృతికా శుక్లా, జిల్లా ఎస్పీ సతీశ్ కుమార్, నగరపాలక సంస్థ ఇంచార్జ్ కమిషనర్ నాగ నరసింహరావు పరిశీలించారు. హెలిప్యాడ్, సభా వేదికను పరిశీలించారు. సభకు యుద్దప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలని సూచించారు. అలాగే ఆటో, ట్యాక్సీ యూనియన్లతో సమావేశం ఏర్పాటు చేయాలని అధికారులకు తెలిపారు. జగన్ పర్యటన కోసం జిల్లా కేంద్రంలోని పోలీస్ కవాత్ మైదానం, రంగరాయ వైద్య కళాశాల స్టేడియంను సందర్శించి అధికారులకు కలెక్టర్ కృతిక శుక్లా పలు సూచనలు చేశారు.


రెవెన్యూ, రోడ్డు రవాణా, మున్సిపల్ కార్పొరేషన్, పౌరసరఫరాలశాఖ, మెప్మా, ఇతర శాఖలు సమన్వయం చేసుకుని త్వరితగతిన ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో సచివాలయాల వారీగా లబ్ధిదారులను తరలించాలని సూచించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్లకు ఆర్ధిక సాయం చేస్తామని పాదయాత్ర సమయంలో జగన్ హామీ ఇచ్చారు. అలాగే గత ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఈ అంశాన్ని  వైసీపీ పొందుపర్చింది. దీంతో జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 నుంచి ఈ పథకం ద్వారా ఆటో, క్యాబ్ డ్రైవర్లకు ప్రతి ఏడాది రూ.10 వేల ఆర్దిక సాయం అందిస్తున్నారు.  సొంత ఆటో లేదా ట్యాక్సీ ఉన్నవారికి మాత్రమే సాయం అందిస్తున్నారు.  అలాగే దరఖాస్తుదారుడు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, లైసెన్స్ కలిగి ఉండాలి. తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఇవ్వాల్సి ఉంటుంది.


ఒక కుటుంబంలో ఇద్దరు ఆటో, ట్యాక్సీ కలిగి ఉన్నట్లయితే ఒకరికి మాత్రమే ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుంది. దరఖాస్తుదారుడి వయస్సు 18 ఏళ్లుపైబడి ఉండటంతో పాటు అతడి పేరు మీద వాహనం రిజిస్ట్రేషన్, బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలి.  ఏపీలోని స్థిరనివాసం ఏర్పాటు చేసుకుని ఉండాలి. ఇతర రాష్ట్రాల్లో వాహనం రిజిస్టర్ అయి ఉంటే దరఖాస్తులను తిరస్కరిస్తారు. ఈ పథకానికి అర్హులైనవారు గ్రామ లేదా వార్డు వాలంటీర్ల దగ్గర దరఖాస్తు ఫారంను తీసుకుని పూర్తి చేయాలి. ఆ తర్వాత అప్లికేషన్‌తో పాటు అవసరమైన డాక్యుమెంట్స్‌ను గ్రామ, వార్డు సచివాలయాల్లో అందించాలి. అధికారులు వెరిఫికేషన్ చేపట్టి అర్హులను లబ్ధిదారుల జాబితాలో చేరుస్తారు. లబ్దిదారుల జాబితాను గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్లి చూడవచ్చు. జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రతీ ఏడాది బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల అకౌంట్లలో జమ చేస్తున్నారు. 29న ఐదో విడత వాహనమిత్ర నగదును విడుదల చేస్తున్నారు.